లోకేశ్ తెలంగాణను వదిలేసినట్లేనా?

Update: 2015-11-22 07:23 GMT
తెలుగుదేశం పార్టీ అగ్రనాయకత్వం అమరావతి బాట పడుతోంది. పార్టీ ప్రముఖులంతా విజయవాడకు తరలిపోతున్నారు. విభజన తరువాత పరిస్థితులు మారడంతో హైదరాబాద్ కు దూరమవుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే తన మకాంను పూర్తిగా విజయవాడకు మార్చేశారు. కృష్ణానది కరకట్టపై  ఉన్న లింగమనేని గెస్ట్ హౌస్ లో ఉంటున్నారు. తాజాగా ఆయన కుమారుడు లోకేశ్ కూడా విజయవాడలో మకాం పెడుతున్నారు. తండ్రి చంద్రబాబు ఉంటున్న గెస్టుహౌస్ కు అత్యంత సమీపంలోనే కృష్ణాకరకట్టపైనే లోకేశ్ కూడా గెస్టు హౌస్ ను ఎంపిక చేసుకున్నారు. శనివారం ఆయన ఆ గెస్టుహౌస్ లోకి వేదమంత్రాల మధ్య ప్రవేశించారు.

చంద్రబాబు గెస్టు హౌస్ వద్ద కట్టుదిట్టమైన భద్రత, ఆయనతో దేశవిదేశీ ప్రతినిధులు ఎక్కువగా భేటీ అవుతుండడంతో రాష్ట్ర నేతలు చంద్రబాబును కలవడం కష్టమవుతోందట. ఆ కారణంగా లోకేశ్ తాను అందుబాటులో ఉంటూ కొంతవరకు ఆ సమస్యను పరిష్కరించాలన్న ఉద్దేశంతో విజయవాడకు మకాం మార్చినట్లు చెబుతున్నారు. పైగా లోకేశ్ ఇప్పుడు టీడీపీ జాతీయ కార్యదర్శి కావడంతో పార్టీ పరంగా ఆయన కీలక స్థానంలో ఉండడం వల్ల తరచూ విజయవాడ రావాల్సి వస్తోందట. ఆ కారణంగానూ లోకేశ్ అక్కడకు మారినట్లు తెలుస్తోంది.

అయితే... ఎన్టీఆర్ ట్రస్టుభవన్ కేంద్రంగా పార్టీ వ్యవహారాలు, తెలంగాణలోని పార్టీని చూసుకోవాలని గతంలో లోకేశ్ బాధ్యతలు అప్పగించినా తెలంగాణ విషయంలో ఆయన జోక్యం చేసుకోవడం లేదు. వరంగల్ ఉప ఎన్నిక జరిగినా అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. దీంతో హైదరాబాద్ లో ఉండి పెద్దగా ప్రయోజనం లేదని, ఉండాల్సిన అవసరమూ లేదని భావిస్తూ పూర్తిగా ఏపీపై దృష్టి పెట్టే ఉద్దేశంతో విజయవాడకు షిఫ్టయినట్లు చెబుతున్నారు.
Tags:    

Similar News