క‌ర్ణాట‌క‌లో మోదీ మేనియా ప‌నిచేస్తుందా?

Update: 2018-05-01 14:30 GMT
ఒక దేశ ప్ర‌ధాని హోదాలో ఉన్న వ్య‌క్తి చాలా బిజీగా ఉండ‌డం స‌ర్వ సాధార‌ణం. అయితే, భార‌త దేశ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ మాత్రం అంద‌రికంటే కాస్త ఎక్కువ బిజీగా ఉంటార‌నే చెప్ప‌వ‌చ్చు. దాదాపుగా మోదీ....విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌తో....లేదంటే స్వ‌దేశానికి వ‌చ్చిన విదేశీ వీఐపీలకు ఆతిథ్యం అందించ‌డంతోనో....స‌మ‌యం గ‌డిపేస్తుంటారు. ఇక స్వ‌దేశంలో ఉన్న కొంత స‌మ‌యంలో...రాష్ట్రాల ప్ర‌ధానుల‌ను కూడా క‌లవ‌డానికి స‌మ‌యం చిక్క‌నంత బిజీగా మోదీ ఉంటారంటే అతిశ‌యోక్తి కాదు. మొన్న‌టికి మొన్న నిరాహార దీక్ష చేసినపుడు కూడా ఏమాత్రం స‌మ‌యం వృథా కాకుండా....య‌థాప్ర‌కారం త‌న ప‌నుల‌ను కూడా చ‌క్క‌బెట్టుకున్న నిబ‌ద్ధ‌త మోదీ సొంతం. అయితే, ఇంత బిజీగా ఉండే మోదీ....ఒక్క‌సారిగా ఓ వారం పాటు ఖాళీగా ఉండ‌డం నిజంగా ఆశ్చ‌ర్య‌పోవాల్సిన విష‌య‌మే. అయితే, ఊర‌క‌రారు మ‌హానుభావులు అన్న చందంగా ....మోదీ ఖాళీ స‌మ‌యాన్ని సృష్టించుకోవ‌డం వెనుక ఓ బ‌ల‌మైన కార‌ణం ఉంది. త్వ‌ర‌లో క‌ర్ణాట‌క‌లో జ‌ర‌గ‌బోతోన్న అసెంబ్లీ ఎన్నికల నేప‌థ్యంలో అక్క‌డ ప్ర‌చారం నిర్వ‌హించేందుకు మోదీ కొద్దిగా వీలు క‌ల్పించుకున్నారు.

ఎన్నిక‌ల ప్ర‌చారానాకి ప్ర‌ధాని వెళ్ల‌డం కూడా కొత్తేమీ కాదు. ఏదో ఒక రోజో....రెండు రోజులో బ‌హిరంగ స‌భ‌ల్లో పాల్గొని రావ‌డం ఆన‌వాయితీ. అయితే, మోదీ అందుకు భిన్నంగా ఏకంగా 8 రోజుల పాటు క‌ర్ణాట‌క‌లో మ‌కాం వేయ‌బోతున్నార‌న్న వార్త చ‌ర్చ‌నీయాంశ‌మైంది. నేటి నుంచి ల‌గాయ‌త్తు....ఈ నెల 8వ తేదీ వ‌ర‌కు మోదీ ..క‌ర్ణాట‌క‌లో తిష్ట‌వేయ‌నున్నారు. క‌న్న‌డీగుల మ‌న‌సు దోచుకొని అక్క‌డ అధికారం చేప‌ట్ట‌డానికి మోదీ స్వ‌యంగా రంగంలోకి దిగార‌న్న‌ది ప్ర‌త్యేకించి చెప్ప‌న‌వ‌స‌రం లేదు. క‌ర్ణాట‌క‌లో బీజేపీకి పూర్వ‌వైభ‌వం తెచ్చేందుకు మోదీ అండ్ కో రెడీ అయ్యారు. అయితే, తాజాగా బీజేపీకి దేశ‌వ్యాప్తంగా అనుకూల ప‌వ‌నాలు త‌గ్గాయ‌న్న వార్త‌ల నేప‌థ్యంలో మోదీ స్వ‌యంగా రంగంలోకి దిగారు. అందులోనూ....క‌థువా - ఉన్నావ్ ఘ‌ట‌న‌ల నేప‌థ్యంలో...బీజేపీ గ్రాఫ్ ప‌డిపోయింది. మ‌రోవైపు లింగాయ‌త్ ల‌ను ఆక‌ట్టుకునేందుకు సిద్దూ వేసిన ఎత్తులు పార‌కుండా చేయాల‌ని కూడా బీజేపీ భావిస్తోంది. అధికారంలో ఉన్న కాంగ్రెస్ ను గ‌ద్దె దించాల‌ని కృత నిశ్చ‌యంతో మోదీ ఉన్నారు. అంద‌ని ద్రాక్ష‌గా ఊరిస్తోన్న ద‌క్షిణాదిలో పాగా వేసేందుకు క‌ర్ణాట‌క‌లో తొలి అడుగు ప‌డాల‌ని మోదీ ప్లాన్ చేస్తున్నారు. ఈ విజ‌యంతో 2019 ఎన్నిక‌లకు బాకా ఊదాల‌ని భావిస్తున్నారు. ఓ ర‌కంగా ఈ ఎన్నిక‌ల‌లో  గెలుపు....బీజేపీకి ఓ ప్రోగ్రెస్ కార్డు వంటిది. మెయిన్ ఎగ్జామ్ కు ముందు ప్రీ ఫైన‌ల్ లాగా....ఇందులో అనుకూల ఫ‌లితం కోసం బీజేపీ తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తోంది. అందులో భాగంగా స్వ‌యంగా గోదాలోకి దిగిన మోదీ పాచిక‌లు ఎంత‌వ‌ర‌కు పార‌తాయో వేచి చూడాలి.
Tags:    

Similar News