మోడీషాలు డిసైడ్ అయితే.. సీన్ సితారేనా?

Update: 2019-07-24 05:16 GMT
మ‌న‌సు ప‌డితే సొంతం కావాల్సిందే. సినిమాల్లో కానీ.. సీరియ‌ల్స్ లో కానీ.. క‌థ‌ల్లో కానీ.. కామిక్ బుక్కుల్లో  కానీ.. ఈ తీరును పాజిటివ్ గా చూపించేటోళ్లు ఎంత‌మందో.. నెగిటివ్ గా చూసేటోళ్లు అంతే మంది ఉంటారు. ఈ కార‌ణంతోనే కావొచ్చు.. క‌ర్ణాట‌క‌లో కుమారస్వామి సంకీర్ణ ప్ర‌భుత్వం కుప్ప‌కూలిన వెంట‌నే.. ప్ర‌జాస్వామ్యం విజ‌యం సాధించిందంటూ క‌మ‌ల‌నాథులు చేసిన హుషారు ప్ర‌క‌ట‌న‌ల‌తో ఉప్పొంగిపోయారు బీజేపీ అభిమానులు.

అదే స‌మ‌యంలో దేశంలో ప్ర‌జాస్వామ్యానికి గ్ర‌హ‌ణం ప‌ట్టింద‌ని విప‌రీత‌మైన వేద‌న చెందినోళ్లు ఉన్నారు. ధ‌ర్మ స‌మ్మ‌తంగా త‌మ‌కు బ‌లం లేనప్ప‌టికి.. ఆప‌రేష‌న్ క‌ర్ణాట‌క‌ను అమ‌లు చేసేందుకు ఇప్ప‌టికే ప‌లుమార్లు ప్ర‌య‌త్నం చేసి.. ప్ర‌తిసారి ఎదురుదెబ్బ‌లు తిన్న‌ప్ప‌టికీ.. అలుపెర‌గ‌క పోరాడి.. చివ‌ర‌కు తాము అనుకున్న‌ది సాధించారు మోడీషాలు.

తాము డిసైడ్ కామ‌ని..  ఒక‌సారి ఫిక్స్ అయితే మాత్రం.. సీను సితారే అన్న విష‌యాన్ని మోడీషాలు క‌ర్ణాట‌క ఎపిసోడ్ తో స్ప‌ష్టం చేశార‌ని చెప్పాలి. చేతి వ‌ర‌కూ వ‌చ్చి చేజారిన అధికారాన్నిచేజిక్కించుకునేందుకు వాజ్ పేయ్ కాలం నాటి బీజేపీ కాద‌ని.. ఇప్పుడున్న‌ది మోడీషాల హ‌యాం అన్న విష‌యాన్ని వారు చెప్పేశార‌ని చెప్పాలి.

తాము స్నేహ‌హ‌స్తం చాచినా.. ఓవ‌ర్ కాన్ఫిడెన్స్ తో త‌మ చేతిని విదిల్చి కొట్టిన కేసీఆర్ కు త‌గిన రీతిలో గుణ‌పాఠం చెప్పాల‌న్న ఆలోచ‌న‌లో మోడీషాలు ఉన్న‌ట్లు చెబుతారు. తాజాగా చోటు చేసుకున్న క‌ర్ణాట‌క ఎపిసోడ్‌.. గులాబీ బాస్ కు ఒక హెచ్చ‌రిక లాంటిద‌న్న మాట వినిపిస్తోంది. తాము కావాల‌నుకున్న‌ది ఎలా అయినా తీసేసుకుంటామ‌ని.. ఆ విష‌యంలో మ‌రెలాంటి మొహ‌మాటాల్లేవ‌న్న‌ది తేలిపోయింద‌ని చెబుతున్నారు. ఇంత‌టి తెగింపుతో దూసుకొస్తున్న  క‌మ‌ల‌నాథుల్ని గులాబీ బాస్ ఎలా డీల్ చేస్తారో చూడాలి.
Tags:    

Similar News