కొత్త క‌స‌ర‌త్తు మొద‌లెట్టిన మోడీ..అమిత్ షాలు

Update: 2017-08-07 05:06 GMT
ప‌ట్టు చిక్కిన‌ప్పుడు మ‌రింత ప‌ట్టు పెంచుకోవ‌టం తెలివైనోళ్ల ల‌క్ష‌ణం. చ‌రిత్ర‌లో తొలిసారి దేశంలోని నాలుగు అత్యున్న‌త ప‌ద‌వుల్ని సొంతం చేసుకుంది బీజేపీ క‌మ్ సంఘ్ ప‌రివార్ లు. భార‌త రాష్ట్రప‌తి.. ఉప రాష్ట్రప‌తి.. ప్ర‌ధాని.. లోక్ స‌భ స్పీక‌ర్ ప‌ద‌వుల్లో అచ్చంగా బీజేపీ తో కూడిన సంఘ్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వారు ఉండ‌టం ఒక కొత్త ప‌రిణామంగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ హ్యాపీ మూడ్ లో ఉన్న మోడీ అండ్ అమిత్ షాలు ఇప్పుడు కేంద్ర క్యాబినెట్‌ ను విస్త‌రించాల‌న్న ప్లాన్ లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

ఇటీవ‌ల కాలంలో చోటు చేసుకున్న మార్పుల కార‌ణంగా ప‌లువురు కేంద్ర‌మంత్రులు మంత్రి వ‌ర్గం నుంచి బ‌య‌ట‌కు వెళ్లిపోయిన సంగ‌తి తెలిసిందే. బ‌య‌ట‌కు వెళ్లిన వారి స్థానాల్ని భ‌ర్తీ చేసే దిశ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ ప్ర‌య‌త్నించ‌ని మోడీ ఇప్పుడు ఆ ఇష్యూ మీద ఫోక‌స్ చేసిన‌ట్లు చెబుతున్నారు. తాజా మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌ను 2019లో జ‌రిగే సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని ల‌క్ష్యంగా చేసుకొని ప్లాన్ ను రెఢీ చేయాల‌ని భావిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

ర‌క్ష‌ణ‌మంత్రిగా వ్య‌వ‌హ‌రించిన మ‌నోహ‌ర్ పారీక‌ర్‌ ను గోవా ముఖ్య‌మంత్రిగా పంప‌టం.. ప‌ట్ట‌ణాభివృద్ధి.. గృహ‌నిర్మాణం.. పేద‌రిక నిర్మూల‌న శాఖ‌ల్ని చూసే వెంక‌య్య‌నాయుడు ఉప రాష్ట్రప‌తి కావ‌టం.. ప‌ర్యావ‌ర‌ణ మంత్రిగా ఉండే  అనిల్ మాధ‌వ్ ద‌వేల అకాల మ‌ర‌ణం.. లాంటి కార‌ణాల‌తో మంత్రివ‌ర్గంలో ఖాళీలు ఏర్ప‌డ్డాయి. కొంద‌రు మంత్రుల ప‌నితీరు మీద మోడీ అసంతృప్తితో ఉన్న‌ట్లుగా చెప్ప‌క త‌ప్ప‌దు. ఇలాంటి నేప‌థ్యంలో రానున్న సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొని ప‌క్కా ప్ర‌ణాళిక‌ను సిద్ధం చేస్తున్నారు మోడీ.. అమిత్ షాలు.

ఉత్త‌రాదిలో తిరుగులేని రీతిలో బ‌లాన్ని సంపాదించిన బీజేపీ దృష్టి ఇప్పుడు ఈశాన్యం.. ద‌క్షిణాదిలో బ‌లం పెంచుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. ఈ రెండు ప్రాంతాల్లో ఉన్న 189 లోక్ స‌భ స్థానాల్ని దృష్టిలో పెట్టుకొనే మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణ ఉండే అవ‌కాశం ఉంటుంద‌ని చెబుతున్నారు.  తాజాగా చేప‌ట్ట‌నున్న మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ద‌క్షిణాది రాష్ట్రాల‌తో పాటు.. ప‌శ్చిమ బెంగాల్‌.. ఒడిశా.. ఈశాన్య రాష్ట్రాల్లో పార్టీని బ‌లోపేతం చేసేలా ఉంటుంద‌ని తెలుస్తోంది. ఇందులో భాగంగా ఆయా రాష్ట్రాల‌కు చెందిన వారికి పెద్ద‌పీట ల‌భించే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు.

రోజురోజుకీ బీజేపీ బ‌లోపేతం అవుతున్నా.. ద‌క్షిణాదిన‌.. ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం త‌న స‌త్తాను చాట‌లేక‌పోతోంది. అందుకే.. ఏపీలోని 25.. తెలంగాణ‌లోని 17.. ఒడిశాలోని 21.. ప‌శ్చిమ‌బెంగాల్ లోని 42.. త‌మిళ‌నాడులోని 39.. కేర‌ళ‌లోని 20.. ఏడు ఈశాన్య రాష్ట్రాల్లో ఉన్న 25 లోక్ స‌భ స్థానాల‌కు సంబంధించిన వారికి మంత్రివ‌ర్గ విస్త‌ర‌ణ‌లో ప్రాధాన్యం ల‌భిస్తుంద‌ని చెబుతున్నారు. అంతేకాదు.. ఇప్ప‌టివ‌ర‌కూ రాజ్య‌స‌భ‌కు మాత్ర‌మే ప‌రిమిత‌మైన కొంద‌రు నేత‌ల్ని ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలో కూడా దించాల‌న్న ఆలోచ‌న‌లో మోడీ ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. 2014లో విజ‌యం సాధించిన కొన్ని స్థానాల్లో కొత్త వారిని బ‌రిలోకి దింపేందుకు వీలుగా క‌స‌ర‌త్తు జ‌రుగుతోంది. పశ్చిమ బెంగాల్‌ - గుజరాత్‌ - తెలంగాణ - ఉత్తర్‌ ప్రదేశ్‌ లలో కొందరు సినీతారల్నీ బరిలో దించే అవకాశాలు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. రాబోయే రోజుల్లో మోడీ.. అమిత్ షాలు వేసే ప్ర‌తి అడుగు 2019 సార్వ‌త్రిక ఎన్నిక‌ల్ని దృష్టిలో పెట్టుకొనే ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News