మోడీ గ్రాఫ్ ఇలా.. రాహుల్ గ్రాఫ్ అలా

Update: 2018-02-18 05:11 GMT
ఎన్నిక‌ల‌కు ఏడాది టైముంది. దేశంలో అప్పుడే సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేడి ర‌గులుకుంటోంది. సార్వ‌త్రికానికి ముందు సెమీఫైన‌ల్స్ అన్న‌ట్లుగా కొన్ని రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. నాలుగేళ్ల క్రితం మోడీ మీద కోట్లాది మంది క‌ల‌లు క‌న్నారు. ఆయ‌న మాట‌ల్ని పూర్తిగా విశ్వ‌సించారు. మోడీని తీసుకెళ్లి అర్జెంట్ గా పీఎం కుర్చీలో కూర్చోబెట్టాల‌న్న త‌లంపు బ‌లంగా క‌నిపించింది.

దేశ రూపురేఖ‌ల్ని మార్చేసే స‌త్తా న‌మోకు మాత్ర‌మే ఉంద‌ని న‌మ్మినోళ్లు చాలామందే. అందుకే.. ఇటీవ‌ల కాలంలో ఎవ‌రికీ రానంత అద్భుత‌మైన మెజార్టీతో కేంద్రంలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేసేలా ప‌వ‌ర్ ను అప్ప‌గించేశారు. చూస్తున్నంత‌నే నాలుగేళ్ల కాలం గ‌డిచిపోయింది. మ‌రో ప‌దిహేనేళ్ల పాటు మోడీకి తిరుగులేద‌న్న మాట సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వెల్ల‌డైన వేళ‌.. విశ్లేష‌కుల అంచ‌నా ఇది. మ‌రి.. నాలుగేళ్ల అధికారం త‌ర్వాత ప‌రిస్థితి ఇప్పుడెలా ఉంద‌న్న‌ది చూసుకున్న‌కొద్దీ క‌మ‌ల‌నాథుల్లో కంగారు అంత‌కంత‌కూ పెరుగుతోంది. మ‌రో ఏడాది మాత్ర‌మే టైం ఉన్న వేళ‌.. మోడీ గ్రాఫ్ అంత‌కంత‌కూ ప‌డిపోవ‌టం మోడీ అండ్ కోలో ఆందోళ‌న అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి.

మోడీకి తిరుగులేద‌న్న స్థాయి నుంచి.. రాహుల్ వైపు చూసేలా ప‌రిస్థితులు చోటు చేసుకుంటున్నాయి. గ‌తంలో మాదిరి మోడీ అన్న వెంట‌నే.. న‌మో.. న‌మో అంటూ జ‌నాలు ఊగిపోవ‌టం లేదు. 2014 సార్వ‌త్రిక ఎన్నిక‌ల టైంలో ఆన్ లైన్లో జ‌రిగిన ప్ర‌చారానికి.. ఇప్పుడు జ‌రుగుతున్న ప్ర‌చారానికి పోలికే లేదు. అప్పుడంతా మోడీ మీద కొండంత ఆశ వ్య‌క్త‌మైతే.. ఇప్పుడు అంతే నిరాశ ప్ర‌తి పోస్టులోనూ క‌నిపిస్తోంది.

అచ్చే దిన్ అంటూ ఊరించిన మోడీ మాట‌ల్ని ప్ర‌స్తావిస్తూ.. స‌టైర్ల‌తో క‌డిగిపారేస్తున్నారు. మోడీ హ‌యాంలో కుంభ‌కోణాలు జ‌ర‌గ‌లేద‌నే వారి మాట‌ల‌కు.. మాల్యా.. నోరి మోడీ లాంటోళ్లు దేశాన్ని దోచేసి.. ఎంచ‌క్కా పారిపోతున్న వైనాన్ని ప్ర‌స్తావిస్తున్నారు. ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్కిరి చేస్తున్నారు.  గ‌డిచిన నాలుగేళ్ల‌లో మోడీ గ్రాఫ్ చూస్తే.. పీక్స్ కు వెళ్లిన స్థానే ఇప్పుడు రోజులు గ‌డుస్తున్న కొద్దీ డౌన్ అవుతున్న వైనం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

సోష‌ల్ మీడియా మొద‌లు సామాన్య ప్ర‌జ‌ల వ‌ర‌కూ అంద‌రి నోటా మోడీ మీద పెట్టుకున్న ఆశ‌లు వ‌మ్ము అయ్యాయ‌న్న మాటే వినిపిస్తోంది. నాలుగేళ్లలో ఏదో జ‌రుగుతుందంటూ మోడీ క‌ల్పించిన భ్ర‌మ‌ల‌న్నీ తొలిగిపోతున్నాయి. మాట‌లే త‌ప్పించి చేత‌ల్లో ఏమీ చేసి చూపించ‌లేద‌న్న ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. తియ్య‌టి మాట‌లు చెప్ప‌టానికి.. చేత‌ల్లో చేసి చూపించ‌టానికి మ‌ధ్య‌నున్న వ్య‌త్యాసం ఇప్పుడు ప్ర‌జ‌ల‌కు బాగానే అర్థ‌మ‌వుతోంది. సొంత రాష్ట్రమైన గుజ‌రాత్ లో ఆత్మ‌గౌర‌వ కార్డు బ‌య‌ట‌కు తీసి నానాపాట్లు ప‌డితే కానీ.. అసెంబ్లీ ఎన్నిక‌ల్లో మోడీ బ్యాచ్ గెలవ‌టం చూస్తే త‌రిగిపోతున్న ఆయ‌న గ్రాఫ్ కు నిద‌ర్శ‌నంగా చెప్పాలి.

పెద్ద‌నోట్ల ర‌ద్దు.. జీఎస్టీతో పాటు ప‌లు రాష్ట్రాల విష‌యంలో ఎన్నిక‌ల వేళ మాత్ర‌మే గుర్తుకు రావ‌టం.. త‌ర్వాత కూర‌లో క‌రివేపాకులా వాడుకున్న తీరు ఇప్పుడు అంద‌రికి అర్థ‌మ‌వుతోంది. ఏపీ విష‌యంలో మోడీ అనుస‌రిస్తున్న తీరు ఆయ‌న ఇమేజ్ ను భారీగా డ్యామేజ్ చేసింది. ఇందుకు నిద‌ర్శ‌న‌మ‌న్న‌ట్లుగా ఇటీవ‌ల వెలువ‌డిన ఉప ఎన్నిక‌ల ఫ‌లితాలు చూస్తే ఈ విష‌యం స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. ప‌వ‌ర్లో ఉన్న రాజ‌స్థాన్ లో జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో బీజేపీ ఓట‌మి పాలు కావ‌టం.. మ‌ధ్య ప్ర‌దేశ్ లోనూ ఇదే త‌ర‌హా ప‌రిస్థితి ఉండ‌టం.. ప‌లు రాష్ట్రాల్లో బీజేపీ ప‌ట్ల వ్య‌తిరేక‌త అంత‌కంత‌కూ పెర‌గ‌టం చూస్తే.. సార్వ‌త్రిక వేళ‌కు ఇది మ‌రింత పెరుగుతుంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

ఇదిలా ఉంటే.. ఇందుకు భిన్నంగా రాహుల్ మీద ఆశ‌లు అంత‌కంత‌కూ పెరుగుతున్నాయి. ఆయ‌న మాట‌ల్ని శ్ర‌ద్ధ‌గా వింటున్నారు. ప‌ట్నం.. ప‌ల్లె అన్న తేడా లేకుండా శ్ర‌మిస్తున్న వైనం ఆయ‌న‌పై కొత్త ఆశ‌లు పుట్టుకొచ్చేలా చేస్తోంది. అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న క‌ర్ణాట‌క‌లో ఆయ‌నే స్వ‌యంగా రంగంలోకి దిగ‌టం.. లోతుల్లోకి వెళ్లి ప్ర‌చారం చేయ‌టం.. మోడీ వైఫ‌ల్యాల్ని బ‌లంగా తెర మీద‌కు తీసుకురావ‌టంలో ఇప్పుడిప్పుడే స‌క్సెస్ అవుతున్నారు. గ‌డిచిన నాలుగేళ్ల‌లో మోడీ గ్రాఫ్ చూస్తే.. మొద‌ట్లో భారీగా పెరిగి.. త‌ర్వాత స్థిర‌ప‌డి.. కొద్దికాలంగా అంత‌కంత‌కూ డౌన్ అవుతున్న వైనం క‌నిపిస్తుంటే.. రాహుల్ విష‌యంలో మొద‌ట్లో నిరాశను క‌లిగిస్తూ.. అలానే కొన‌సాగింది. గ‌డిచిన కొద్దికాలంగా ఆయ‌న గ్రాఫ్ అంత‌కంత‌కూ పెరుగుతోంది. ఇప్పుడు మోడీ డౌన్ ఫాలో ఎలా అయితే ఉందో.. రాహుల్ గ్రాఫ్ దూసుకెళ్ల‌టం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మాట‌ల్ని న‌మ్ముకున్న న‌మో ఓవైపు.. చేత‌ల్లో చేసి చూపించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్న రాహుల్ మ‌రోవైపు. తీర్పు చెప్ప‌టానికి ఏడాది  టైమున్న వేళ‌.. ఇప్ప‌టికైతే గ‌త త‌ప్పును మ‌ళ్లీ చేయ‌కూడ‌ద‌న్న బావ‌న పెద్ద ఎత్తున క‌నిపిస్తోంది. క‌రిగే కాలం దేశ ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని మ‌రెలా మారుస్తుందో చూడాలి.
Tags:    

Similar News