దీక్ష‌లో బాబు.. ట్వీట్ తో విషెస్‌ చెప్పిన మోడీ

Update: 2018-04-20 08:37 GMT
హోదా సాధ‌న కోసం త‌న పుట్టినరోజు సంద‌ర్భంగా భారీ ఎత్తున దీక్ష చేస్తున్న‌ ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు వ్య‌వ‌హారం తెలిసిందే. దీక్ష ను భారీ స్థాయిలో చేయ‌టంతో పాటు.. కోట్లాది రూపాయిల ప్ర‌జాధ‌నాన్ని ఖ‌ర్చు చేస్తున్న వైనంపై ఇప్ప‌టికే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

ఇదిలా ఉంటే.. త‌న ఒక‌రోజు దీక్ష కోసం టీడీపీ వ‌ర్గాలు చేప‌డుతున్న చ‌ర్య‌ల్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. దీక్షా స్థ‌లి వ‌ద్ద‌కు కాలేజీ విద్యార్థుల్ని.. స్కూల్ పిల్ల‌ల్ని తీసుకురావ‌టం.. ఈ సంద‌ర్భంగా చేప‌డుతున్న కార్య‌క్ర‌మాలు నాట‌కీయంగా ఉండ‌టంతో పాటు.. మీడియాలో హైలెట్ కావ‌టానికే త‌ప్పించి మ‌రిక ఎలాంటి ప్ర‌యోజ‌నం ఉండ‌ద‌న్న అభిప్రాయం వ్య‌క్తమ‌వుతోంది.

మ‌రోవైపు దీక్షా స్థ‌లి వ‌ద్ద సినీ న‌టులు.. ఏపీ ఎమ్మెల్యే బాల‌కృష్ణ ప్ర‌సంగిస్తూ ప్ర‌ధాని మోడీపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేయ‌టంతో పాటు.. కొన్ని వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. ఇదిలా ఉంటే.. వీటితో త‌న‌కేం సంబంధం లేన‌ట్లుగా ప్ర‌ధాని మోడీ ఎప్ప‌టి మాదిరే బాబుకు బ‌ర్త్ డే విషెస్ తెలిపారు.

ఆటో జ‌న‌రేటెడ్ విషెస్ మాదిరి ఉన్న మోడీ ట్వీట్ లో ఆయురారోగ్యాల‌తో చంద్ర‌బాబు చిర‌కాలం చ‌ల్ల‌గా ఉండాల‌ని ప్ర‌ధాని ఆకాంక్షించారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ సీఎం చంద్ర‌బాబుకు జ‌న్మ‌దిన శుభాకాంక్ష‌లు.. ఆయ‌న ఆయురారోగ్యాల‌తో జీవించాల‌ని ఆ భ‌గ‌వంతుడ్ని వేడుకుంటున్నా అంటూ ట్వీట్ చేశారు. ఓప‌క్క మోడీని బండ‌కేసి బాదిన‌ట్లుగా టీడీపీ వ‌ర్గాలు తిట్టేస్తున్న వేళ‌.. అవేమీ త‌న‌కు ప‌ట్ట‌న‌ట్లుగా బాబుకు బ‌ర్త్ డే విషెస్ చెప్ప‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.


Tags:    

Similar News