జనసేన ఇక దూకుడేనా ?

ఏపీలో టీడీపీ వైసీపీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న నేపధ్యంలో మూడవ పార్టీకి స్పేస్ ఏదీ అన్న చర్చ ఉంటూనే ఉంది.

Update: 2025-01-22 03:46 GMT

ఏపీలో టీడీపీ వైసీపీ బలమైన ప్రాంతీయ పార్టీలుగా ఉన్న నేపధ్యంలో మూడవ పార్టీకి స్పేస్ ఏదీ అన్న చర్చ ఉంటూనే ఉంది. అయితే పవన్ కళ్యాణ్ జనసేనను స్థాపించిన తరువాత దశాబ్ద కాలంలో రచించిన వ్యూహాల కారణంగా జనసేన మూడవ పార్టీగా ఏపీ పాలిటిక్స్ లో ఎమర్జ్ కాగలిగింది. జనసేన 2014లో పోటీ చేయలేదు, 2019లో పోటీ చేసినా కూడా అధినేత పవన్ రెండు సీట్లలో ఓటమి పాలు అయ్యారు. పార్టీకి ఒకే సీటు దక్కింది. కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఏడు శాతం కంటే తక్కువ ఓట్లు వచ్చాయి.

ఫలితంగా జనసేన 2019లో సాధించిన తాత్కాలిక గుర్తు గాజు గ్లాస్ అయితే అలా దక్కునా మానునా అన్న సందేహాలతోనే అయిదేళ్ల కాలం గడచింది. అయితే జనసేన 2024 ఎన్నికల్లో అనేక వ్యూహాలతో ముందుకు సాగింది. ఎందరు ఏ విధంగా మాట్లాడినా లేక రెచ్చగొట్టినా కూడా విడిగా పోటీ చేయలేదు. టీడీపీతో పొత్తు పెట్టుకుని బీజేపీ జట్టుని విడవకుండా కూటమిలో చేర్చి తాను లాభపడి ఆయా పార్టీలకూ రాజకీయ లాభం చేకూర్చింది.

దాని ఫలితంగానే పోటీ చేసిన 21 సీట్లనూ జనసేన గెలుచుకుంది. అంతే కాదు ఏకంగా 8 శాతం ఓటు షేర్ ని సాధించింది. దాంతో జనసేనకు కేంద్ర ఎన్నికల సంఘం గుడ్ న్యూస్ వినిపించింది. ఆ పార్టీకి గాజు గ్లాస్ గుర్తుని శాశ్వతం చేస్తూ ఏపీలో జనసేనను రిజిష్టర్ పార్టీగా గుర్తిస్తూ కీలక నిర్ణయం ప్రకటించింది. దీంతో జనసేన కూడా ఏపీలో టీడీపీ వైసీపీలతో సరిసమానంగా రాజకీయం చేసేందుకు జనమెరిగిన గుర్తు గాజు గ్లాస్ తో దూకుడు చేసేందుకు మంచి ఆస్కారాన్ని ఈసీ కల్పించినట్లు అయింది.

ఇక మార్చి 14న జనసేన ఆవిర్భావ సభలు పిఠాపురం వేదికగా జరగబోతున్నాయి. ఈ సభలలో పదేళ్ళ పార్టీ రాజకీయ ప్రస్థానం ముగించుకుని పదకొండో ఏట అడుగుపెడుతున్న నేపధ్యాన్ని పూర్తిగా గుర్తు చేసుకుంటారు. సమీక్షించుకుంటారు. అధికారంలోకి జనసేన వచ్చిన తరువాత తొలిసారి జరుగుతునన్ పార్టీ ప్లీనరీ అన్నది ఇప్పటిదాకా ఉన్న ఉత్సాహం అయితే ఇపుడు మరో కొత్త హుషార్ ఆ పార్టీకి దక్కుతోంది

అదేంటి అంటే జనసేనకు శాశ్వతంగా పార్టీ గుర్తు. ఇది నిజంగా జనసేన సాధించిన అపూర్వ విజయంగా భావిస్తున్నారు. జనసేన గాజు గ్లాస్ జనాలలో ఉంది. అయితే ఇంతకలం ఫ్రీ సింబల్ కావడం వల్ల జనసేనకు ఇబ్బంది ఏర్పడింది. ఇక మీదట జనసేన సొంత గుర్తుతో పోటీకి దిగవచ్చు.

పొత్తులు అన్నవి ఉన్నా లేకున్నా కూడా ఆ పార్టీ జెండా ఎగరవేయగలదు అన్న ధీమాను ఈ గుర్తు కలుగచేస్తోంది. ఏ రాజకీయ పార్టీకి అయినా ఊపిరి ప్రాణమూ గుర్తు మాత్రమే. అటువంటి గుర్తుని సాధించిన జనసేన చాలా ఆత్మ విశ్వాసాన్నే నింపుకుని ప్లీనరీ సభలకు ముస్తాబు కాబోతోంది. రానున్న రోజులలో జనసేన రాజకీయ దూకుడు ఏ విధంగా ఉంటుందో కూడా చూడాల్సిందే అని అంటున్నారు.

Tags:    

Similar News