ట్రంప్ తాజా ఆదేశాలు.. వణికిపోతున్న లక్షలాది మంది మనోళ్లు

అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి పంపించేయక తప్పదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలోని మనోళ్లను వణికిస్తున్నాయి.

Update: 2025-01-22 04:45 GMT

అమెరికాకు అక్రమంగా వలస వచ్చిన వారిని తిరిగి పంపించేయక తప్పదన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలు అమెరికాలోని మనోళ్లను వణికిస్తున్నాయి. గడ్డ కట్టే చలిని సైతం ఏదోలా మేనేజ్ చేసే వారికి.. ట్రంప్ తాజా హెచ్చరికలు మాత్రం నిలువెల్లా వణికించేస్తున్నాయి. తాత్కాలిక వీసాలపై వచ్చిన వారికి ఇలాంటి పరిస్థితే ఉంది. సరైన పత్రాలు లేకుండా అమెరికాలో దాదాపు 1.40 కోట్ల మంది ఉంటారన్నది ఒక అంచనా. అందులో భారతీయుల సంఖ్య సుమారు 7.25 లక్షలుగా చెబుతారు.

భారతీయుల కంటే అత్యధికంగా ఉండే విదేశీయుల్లో ఎక్కువగా మెక్సికో.. సాల్వెడార్ దేశాలకు చెందిన వారిగా చెబుతారు. తన ఎన్నికల ప్రచారంలో ఇలాంటి వారి విషయంలో ట్రంప్ పదే పదే తన వైఖరిని స్పష్టంచేసిన ట్రంప్.. అధికారం చేపట్టినంతనే దీనికి సంబంధించి స్పష్టమైన ఆదేశాల్ని జారీచేశారు. ట్రంప్ దేశాధ్యక్షుడిగా ఉన్నప్పుడు వివిధ దేశాలకు చెందిన 1529 మంది విదేశీయల్ని గత ఏడాది అమెరికా నుంచి పంపేశారు. అయితే.. ట్రంప్ ఆదేశాలు అమలైన పక్షంలో ఈ సంఖ్య లక్షల్లో ఉండనుంది.

ట్రంప్ తీసుకున్న తాజా నిర్ణయంతో భారతీయులు ఎక్కువగా ఎఫెక్టు కానున్నారు. జన్మత: లభించే పౌరసత్వాన్ని రద్దు చేయాలని ట్రంప్ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ మనోళ్లపై ప్రభావాన్ని చూపుతుందని చెబుతున్నారు. అమెరికా జనాభాలో సుమారు 50 లక్షల మంది మనోళ్లే. వీరిలో మూడోవంతు మంది అమెరికాలో పుట్టినోళ్లే. మిగిలిన వారంతా వలసదారులు. తాత్కాలిక వీసాపై అమెరికాకు వెళ్లి.. గ్రీన్ కార్డు కోసం వెయిట్ చేస్తున్నోళ్లు.

ఇలా వెయిట్ చేస్తున్న వారికి పుట్టే పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించాలన్న ఉద్దేశంతో చాలామంది భారతీయులు డెలివరీ సమయానికి అమెరికాకు వెళ్లటం తెలిసిందే. ఇకపై అలాంటి వాటికి బ్రేకులు పడనున్నాయి. బిడ్ల తల్లి అమెరికాలో అక్రమంగా ఉంటున్నా.. తండ్రి అమెరికా పౌరుడు కాకున్నా.. చట్టబద్ధంగా శాశ్విత నివాసి (పర్మినెంట్ సిటిజన్) కాకున్నా ఆటోమేటిక్ గా పౌరసత్వం రాదు.

అంతేకాదు.. కాన్పు టైంలో బిడ్డ తల్లి అమెరికాలో చట్టబద్ధంగా ఉన్నా.. అది తాత్కాలిక ప్రాతిపదిక మీద అయినప్పుడు.. వారికి పుట్టే సంతానానికి అమెరికా పౌరసత్వం రాదు. ఉదాహరణకు స్టూడెంట్ వీసా.. టూరిస్టు వీసా మీద రావటం లాంటివి ఈ కోవకు చెందినవి. మనోళ్లు కొందరు ఇతర దేశాలకు చెందిన వారిని పెళ్లి చేసుకొని అమెరికాలోనే ఉండిపోతారు. ఇకపై.. లాంటి వారికి పుట్టే పిల్లల పౌరసత్వం విషయంలోచాలా తీవ్రమైన సమస్యల్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది.

Tags:    

Similar News