డెహ్రాడూన్ టూర్ లో గుండెపోటుకు గురైన సికింద్రాబాద్ ఎమ్మెల్యే
డెహ్రాడూన్ టూర్ కు వెళ్లిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే.. సీనియర్ బీఆర్ఎస్ నేత పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు.
డెహ్రాడూన్ టూర్ కు వెళ్లిన సికింద్రాబాద్ ఎమ్మెల్యే.. సీనియర్ బీఆర్ఎస్ నేత పద్మారావు గౌడ్ గుండెపోటుకు గురయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి ఈ నెల 18న ఆయన అక్కడకు వెళ్లారు. సరదాగా సాగుతున్న వారి టూర్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆదివారం ఉదయం ఆయనకు ఛాతీలో ఇబ్బందిగా అనిపించగా.. హుటాహుటిన అక్కడకు సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.
దీంతో అక్కడి వైద్యులు పరీక్షించగా గుండె నాళాల్లో ఒకటి పూర్తిగా మూసుకుపోయిందని.. గుర్తించి వెంటనే స్టెంట్ వేశారు. ఇదిలా ఉండగా.. అక్కడి నుంచి ఆయన్ను సికింద్రాబాద్ కు మంగళవారం రాత్రి ఇంటికి తీసుకొచ్చారు. ప్రస్తుతం తన ఆరోగ్యం బాగుందని పద్మారావు తన సన్నిహితులతో చెప్పినట్లుగా తెలుస్తోంది.
పద్మారావు అనారోగ్యం గురించి సమాచారం అందుకున్న కేటీఆర్.. ఆయనకు ఫోన్ చేసి పరామర్శించారు. తగిన విశ్రాంతి తీసుకోవాల్సిందిగా సూచన చేశారు. పద్మారావు గుండెపోటుకు గురైన విషయం గురించి తెలిసి తాను షాక్ తిన్నట్లుగా కేంద్రమంత్రి బండి సంజయ్ చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లుగా సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. మరోవైపు పద్మారావు ఆరోగ్య పరిస్థితి గురించి పలువురు మంత్రులు.. ఎమ్మెల్యేలు.. ఎమ్మెల్సీలు ఆరా తీశారు.