మోడీజీ పెట్టిన నిప్పు ఆ పార్టీలో ఇంకా ఆర‌లేదు!

Update: 2022-07-21 16:30 GMT
విల‌క్ష‌ణ రాజ‌కీయాల‌కు పెట్టింది పేరైన త‌మిళ‌నాడులో అన్నాడీఎంకే అధినేత్రి, అప్ప‌టి ముఖ్య‌మంత్రి జ‌య‌లలిత మ‌రణించాక అధికారం కోసం జ‌య న‌మ్మిన బంటు ప‌న్నీర్ సెల్వం, జ‌య నెచ్చెలి శ‌శిక‌ళ మ‌ధ్య ఫైడ్ న‌డిచిన సంగ‌తి తెలిసిందే. సంద‌ట్లో స‌డేమియాలా, గోతి కాడ న‌క్క‌లాగా ఈ వివాదంలో తాను లాభ‌ప‌డ‌టానికి, వీలుంటే ప‌న్నీర్ సెల్వంకు మ‌ద్ధ‌తిచ్చే ఎమ్మెల్యేలంద‌రినీ బీజేపీలోకి లాగేసి బీజేపీ ప్ర‌భుత్వాన్ని త‌మిళనాడులో ఏర్పాటు చేయాల‌ని ప్ర‌ధాని నరేంద్ర మోడీ క‌ల‌లు క‌న్నార‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఈ నేప‌థ్యంలో శ‌శిక‌ళ‌ను అక్ర‌మాస్తుల కేసులో జైలుకు పంపార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి.

అయితే శ‌శిక‌ళ జైలుకు వెళ్లినా త‌న అనుంగు స‌హ‌చ‌రుడు ప‌ళ‌నిస్వామి సీఎం అయ్యేలా చ‌క్రంతిప్పారు. అయితే ఆ త‌ర్వాత ప‌రిణామాల‌తో ప‌న్నీరు సెల్వం, ప‌ళ‌నిస్వామిల మ‌ధ్య బీజేపీ అధిష్టానం రాజీ ఫార్ములా తెచ్చి క‌లిపింద‌ని వార్త‌లు వ‌చ్చాయి. ఇందులో భాగంగా ప‌ళ‌నిస్వామి సీఎంగా, ప‌న్నీరు సెల్వం డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌లు చేప‌ట్టారు. అలాగే పార్టీకి ప‌న్సీరు సెల్వం క‌న్వీన‌ర్ గా, ప‌ళ‌నిస్వామి కోక‌న్వీన ర్ గా ఉండేలా ఒప్పందం కుదిర్చార‌ని మీడియా సంస్థ‌లు నాడు తెలిపాయి.

అయితే గ‌తేడాది జ‌రిగిన త‌మిళ‌నాడు ఎన్నిక‌ల్లో అన్నాడీఎంకే ప‌రాజ‌యం పాలై డీఎంకే అధికారంలోకి వ‌చ్చింది. దీంతో స్టాలిన్ ముఖ్య‌మంత్రి అయ్యారు. అధికారం లేక‌పోవ‌డంతో పార్టీపై పెత్త‌నం కోసం మ‌ళ్లీ ప‌ళ‌నిస్వామి, ప‌న్నీర్ సెల్వం మ‌ధ్య ఆధిప‌త్య పోరు రాజుకుంది. ఇందులో భాగంగా ఎక్కువ మంది ఎమ్మెల్యేలు, జిల్లాల పార్టీ అధ్య‌క్షులు, కార్య‌క‌ర్త‌లు ప‌ళినిస్వామికే జై కొట్టారు. దీంతో ప‌న్నీరు సెల్వాన్ని, ఆయ‌న కుమారుడు (ఎంపీ)తోపాటు ప‌లువురిని ప‌ళ‌నిస్వామి పార్టీ నుంచి బ‌హిష్క‌రించారు.

ఈ నేప‌థ్యంలో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చెస్‌ ఒలంపియాడ్‌ ప్రారంభోత్సవం కోసం జూలై 27న చైన్నైకు రానున్నారు. దీంతో నరేంద్ర మోదీతో భేటీ అయ్యేందుకు అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి ఎడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్‌), బహిష్కృత నేత ఒ.పన్నీర్‌సెల్వం (ఓపీఎస్‌) ప్రయత్నాలు మొదలుపెట్టారు. ఈ మేరకు వారు మోదీ అపాయింట్‌మెంట్‌ కోసం ప్రధానమంత్రి కార్యాలయానికి లేఖ రాశార‌ని స‌మాచారం. అన్నాడీఎంకేలో నెలకొన్న సంక్షోభం, దానిని అధిగమించి తాను బయటపడిన వైనం గురించి తెలియజేయడంతో పాటు తనకే ఆశీస్సులివ్వాలని మోదీని అభ్యర్థించేందుకు ఈపీఎస్‌ సిద్ధమైనట్లు తెలిసింది. మ‌రోవైపు ద్వంద్వ నాయకత్వం కోసం కృషి చేసిన తనను పార్టీ నుంచి గెంటేసిన తీరును, ఈపీఎస్‌ పోకడల్ని ఏకరువు పెట్టుకునేందుకు ఓపీఎస్‌ కూడా మోదీని కలవాలని ప్రయత్నిస్తున్నారు.

నిజానికి మోదీ వీరిద్దరితోనూ సన్నిహితంగానే ఉన్నారు. అన్నాడీఎంకే సాధారణ సభ్య సమావేశంలో సమన్వయకర్తగా ప‌న్నీరును తొల‌గించాక‌ ఆయన ఢిల్లీ వెళ్లారు. ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నామినేషన్‌ కార్యక్రమంలో కూడా పాల్గొన్నారు. అప్పుడు కూడా బీజేపీ నేతలు ఆయన్ని సాదరంగానే ఆహ్వానించారు. అయితే మోదీ, అమిత్‌షాలతో భేటీ కోసం చేసిన ప్రయత్నాలు మాత్రం విఫలమయ్యాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీరిద్దరు ప్ర‌ధాని మోడీని క‌ల‌వ‌డానికి చేస్తున్న ప్రయత్నాలు ఏ మేరకు ఫలిస్తాయి, ఎవరు విజయం సాధిస్తారన్నదానిపై రాజకీయవర్గాలు ఉత్కంఠతో గమనిస్తున్నాయి.

మ‌రోవైపు సంద‌ట్లో స‌డేమియా అన్న‌ట్టు అన్నాడీఎంకే బహిష్కృత నాయకురాలు వీకే శశికళ కూడా మోదీని కలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. నిజానికి ఈపీఎస్‌, ఓపీఎస్‌, శశికళ, దినకరన్‌ కలిసి వుంటేనే అన్నాడీఎంకేకు భవిష్యత్తు వుందని, మున్ముందు ఆ పార్టీ మరింత బలపడుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తదితరులు గట్టిగా తలపోస్తున్నారు. ఆ మేరకు ఆయన ప్రయత్నాలు కూడా చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మోదీతో భేటీ అయ్యేందుకు అన్నామలై ద్వారా శశికళ ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది.
Tags:    

Similar News