ఏపీకి అభ‌యం ఇచ్చిన మోడీ

Update: 2019-06-10 05:29 GMT
అంద‌రూ ఎంతో ఆస‌క్తిగా ఎదురుచూసిన ప్ర‌ధాని మోడీ తిరుప‌తి ప‌ర్య‌ట‌న పూర్తి అయ్యింది. ఈ ప‌ర్య‌ట‌న‌లో ఆయ‌న నుంచి సానుకూల ప్ర‌క‌ట‌న వ‌స్తుంద‌ని ఆశ‌గా చూసినోళ్లు ఎంద‌రో. ఏపీకి సంబంధించి ఏదైనా ఒక శుభ‌వార్త చెబుతార‌ని భావించినా.. ఆ విష‌యంలో కాస్తంత నిరాశే ఎదురైంది. అయితే.. ఏపీ ప్ర‌జ‌ల‌కు మోడీ ఇచ్చిన అభ‌యం మాత్రం భ‌విష్య‌త్తులో కేంద్రం నుంచి స‌హ‌కారం మంచిగా ఉంటుంద‌న్న విష‌యాన్ని చెప్ప‌క‌నే చెప్పేసింది.

ఏపీ ప్ర‌జ‌ల్ని పొగిడేసిన మోడీ.. జ‌గ‌న్ నాయ‌క‌త్వంలో ఏపీలో శ‌క్తివంత‌మైన ప్ర‌భుత్వం ఏర్పాటైంద‌న్నారు.   ఏపీలో ప్రజలు విజ్ఞానవంతులు. ఎంతో నిష్ణాతులైన వారంటూ పొగిడేశారు.  ఏపీ ప్ర‌జ‌ల సంక్షేమానికి కేంద్రం క‌ట్టుబ‌డి ఉంద‌న్న ఆయ‌న‌.. అభివృద్ధి దిశ‌గా దూసుకుపోవ‌టానికి అవకాశాలు చాలా ఉన్న రాష్ట్రమ‌న్న ఆయ‌న‌.. కొత్త‌ద‌నం సృష్టించే దిశ‌గా న‌వ్యాంధ్ర అడుగులు వేయాల‌న్న ఆకాంక్ష‌ను వ్య‌క్తం చేశారు.

ఏపీలో ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేయ‌టానికి మంచి నేత‌ను ఎంచుకున్న ఏపీ ప్ర‌జ‌ల‌కు అభినంద‌న‌లు తెలిపిన మోడీ.. త‌న ప‌ర్య‌ట‌న ఆల‌స్యం కావ‌టంపై క్ష‌మాప‌ణ‌లు చెప్పారు. ఎన్నిక‌ల్లో గెలిచిన త‌న‌కు ప్ర‌జ‌ల మ‌న‌సుల్ని కూడా గెల‌వాల్సి ఉంద‌న్నారు. రానున్న ఐదేళ్ల‌లో దేశాన్ని ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకెళ్ల‌నున్న ధీమాను మోడీ వ్య‌క్తం చేశారు. ఆయ‌న ప్ర‌సంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

+   దేశం ముందు ప్రస్తుతం రెండు ప్రధాన అవకాశాలున్నాయి.వాటిని మనం పోగొట్టుకోకూడదు.  దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు అవుతోంది. దేశానికి ఏదో ఒకటి చేయాలని ప్రజలందరూ సంకల్పించాలి. ఐదేళ్ల అనుభవం.. అవినీతి రహిత పాలన అందించడం ద్వారా 130 కోట్ల మంది ప్రజలంతా మ‌మ్మ‌ల్ని ఆశీర్వదించారు.

+   ప్రజాస్వామ్య విలువలను నిలబెట్టారు ప్రజల ఆకాంక్షల మేరకే కేంద్రంలోని ప్రభుత్వం పనిచేస్తుంది.  జగన్‌ రెడ్డి నాయకత్వంలో ఏపీలో శక్తివంతమైన ప్రభుత్వం ఏర్పాటైంది. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పని  చేస్తాం.

+  ఏపీలో ప్రజలు విజ్ఞానవంతులని.. స్టార్ట్ అప్‌ కార్యక్రమంలో ఎంతో నిష్ణాతులైన వారు ఉన్నారు.  ఆంధ్రప్రదేశ్ - తమిళ ప్రజలకు ధన్యవాదాలు.

+  అభివృద్ధిలో దూసుకుపోవడానికి అన్ని అవకాశాలున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌. కొత్తదనం సృష్టించటంలో నవ్యాంధ్ర దిశగా అడుగులు వేయాలి. అన్ని రాష్ట్రాలు కలిస్తేనే నవభారత్‌ సాధ్యమవుతుంది.
Tags:    

Similar News