పెట్రోల్‌..డీజిల్ పై మోడీ బాదుడు ఎంతంటే..?

Update: 2017-09-24 05:30 GMT
మోడీ మామూలోడు కాదు. తియ్య‌తియ్య‌గా మాట‌లు చెబుతూనే.. మ‌రోవైపు నొప్పి తెలీకుండా ప‌న్ను బాదుడు బాదేస్తున్నారు. మోడీ ప్ర‌ధాని అయితే అచ్ఛేదిన్ అన్న ఫీలింగ్ దేశ ప్ర‌జ‌ల‌కు ఉన్నా.. వాస్త‌వంలోకి వ‌చ్చిన‌ప్పుడు మాత్రం అందుకు భిన్న‌మైన దృశ్యం ఇప్పుడు ఆవిష్కృత‌మ‌వుతోంది. పెట్రోల్‌.. డీజిల్ మీద స‌గ‌టుజీవికి ప‌డే భారం లెక్క తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు మోడీ ప్ర‌ధాని అయితే లీట‌రు పెట్రోల్ ధ‌ర రూ.50 కంటే త‌క్కువ‌కు వ‌చ్చేస్తుంద‌ని కొంద‌రు ప్ర‌చారం చేస్తే.. మ‌రికొంద‌రు రూ.40 కంటే త‌క్కువ‌కు వ‌స్తుంద‌న్న మాట చెప్పేవారు. ఇప్పుడు అందుకు భిన్నంగా లీట‌రు పెట్రోల్ సుమారు రూ.75 వ‌ర‌కు వెళ్లిపోయిన ప‌రిస్థితి. ఎందుకిలా? అంత‌ర్జాతీయ మార్కెట్లో ముడిచ‌మురు ధ‌ర ఆకాశాన్ని అంటిందా? అంటే.. అలాంటిదేమీ లేద‌ని చెప్పాలి.

అంత‌ర్జాతీయంగా ధ‌ర‌లు చౌక‌గా ఉన్న‌ప్ప‌టికీ.. దేశీయంగా బాదేస్తున్న ప‌న్ను బాదుడు పుణ్య‌మే ఈ అధిక ధ‌ర‌లని చెప్ప‌క త‌ప్ప‌దు. ఒకే దేశం ఒకే ప‌న్ను అంటూ జీఎస్టీని తీసుకొచ్చిన మోడీ స‌ర్కారు.. మ‌ద్యం.. పెట్రోల్‌.. డీజిల్ పై మాత్రం విలువ ఆధారిత ప‌న్ను.. అదేనండి వ్యాట్‌ను వ‌సూలు చేస్తోంది.

దేశంలో ప్ర‌స్తుత గ‌రిష్ఠ ప‌న్నుఅంటే 28 శాతం కానీ.. పెట్రోల్ మీద మోడీ స‌ర్కారు వ‌సూలు చేస్తున్న ప‌న్ను ఎంతో తెలుసా? అక్ష‌రాల 58 శాతం. అంటే.. లీట‌రు పెట్రోల్ రూపాయి అనుకుంటే అందులో 58 పైస‌లు ప‌న్నులే ఉన్నాయ‌న్న మాట‌. ఇంత‌క‌న్నా దారుణం ఇంకేం ఉంటుంది?

పెట్రోల్ మీద కేంద్రం వ‌డ్డిస్తున్న ప‌న్నుల‌తోపాటు.. రాష్ట్రాలు సైతం త‌మ‌కు తోచిన‌ట్లుగా ప‌న్ను బాదుడు బాదేయ‌టంతో ధ‌ర‌లు భారీగా ఉంటున్నాయి. ఇది సామాన్యుడికి భారంగా మారింది. కేంద్రం వ‌సూలు చేస్తున్న ఎక్సైజ్ ప‌న్ను లీట‌రు పెట్రోల్‌కు రూ.21.48 కాగా.. డీజిల్ మీద రూ.17.33 చొప్పున ఉంది. దీనికి రాష్ట్రాలు విధించే ప‌న్ను అద‌నం. దేశంలో అత్య‌ధికంగా ప‌న్ను వ‌డ్డించే రాష్ట్రం మ‌హారాష్ట్ర అయితే.. అత్య‌ల్పంగా వ‌డ్డించే రాష్ట్రం గోవా.

ఇక‌.. తెలుగు రాష్ట్రాల విష‌యానికి వ‌స్తే.. దేశంలోనే అత్య‌ధిక ప‌న్ను విధించే టాప్ ఫైవ్ లో రెండు తెలుగు రాష్ట్రాలు ఉండ‌టం గ‌మ‌నార్హం.

సార్వ‌త్రిక ఎన్నిక‌ల‌కు ముందు.. అంటే 2014లో బ్యారెల్ ముడిచ‌మురు ధ‌ర 108యూఎస్ డాల‌ర్లు ఉంటే.. ఇప్పుడు కేవ‌లం 50 డాల‌ర్లు మాత్ర‌మే ఉంది. అయితే.. 2014లో పెట్రోల్ డీజిల్ మీద ప‌న్ను భారం 34 శాతంగా ఉంటే.. ఇప్పుడు పెట్రోల్ మీద 58 శాతం.. డీజిల్ మీద 50 శాతం ఉంది. నిత్యం మోడీ చెప్పే అచ్చేదిన్ అంటే అచ్చేగా ప‌న్నులు బాదేయ‌ట‌మా?
Tags:    

Similar News