దావోస్ లో లోకేష్ అలా చేశారా ?
ఆయన పట్టుదల ఆయన మాదిరిగా సాహసం అన్నీ లోకేష్ కూడా పుణికి పుచ్చుకున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి
ఎంతైనా చంద్రబాబు కొడుకు కదా. అందువల్ల తండ్రి లక్షణాలు లోకేష్ కి కచ్చితంగా వస్తాయి. ఆయన పట్టుదల ఆయన మాదిరిగా సాహసం అన్నీ లోకేష్ కూడా పుణికి పుచ్చుకున్నారు అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. తాజాగా కళ్ళకు కట్టినట్లుగా కనిపించిన ఒక ఉదంతం దావోస్ లో జరిగింది.
దావోస్ లో ఎముకలు కొరికే చలిలో మంత్రి నారా లోకేష్ పాదయాత్ర చేశారు అంటే నమ్మగలరా. కానీ నమ్మి తీరాల్సిందే. ఆయన దావోస్ లో వరల్డ్ ఎకనామిక్ ఫోరం సమావేశాలకు హాజరయ్యేందుకు తండ్రితో పాటు వచ్చారు. ఒక మంత్రిగా ఆయన అధికారిక హోదాలో ఈ సదస్సుకు హాజరయ్యారు.
ఇదిలా ఉంటే దావోస్ రెండవ రోజు సదస్సుకు లోకేష్ కాలినడకన హాజరు కావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. దావోస్ లో మైనస్ ఏడు డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. అటువంటి సంక్లిష్టమైన పరిస్థితులలో లోకేష్ అన్నింటినీ దాటుకుని సకాలంలో సదస్సుకు హాజరయ్యారు. ఇది నిజంగా గ్రేట్ అని అంటున్నారు. ఒక వైపు కురిసే మంచులో ఆయన కాలి నడకన ఈ విధంగా చేయడం పట్ల చర్చ సాగుతోంది.
ఏపీలో పెట్టుబడులో కోసం చంద్రబాబుతో పాటుగా లోకేష్ పడుతున్న తపనకు ఇది నిదర్శనమని అంటున్నారు. దావోస్ లో హొటల్ గదులలోనే చలికి ఎవరూ ఉండలేక నానా ఇబ్బందులు పడుతున్న నేపథ్యం ఉంది.
అటువంటిది లోకేష్ ఈ విధంగా చేయడం సదస్సుకు హాజరైన వారిని సైతం ఆశ్చర్యపరచింది అని చెప్పాలి.
ఇక చంద్రబాబు అయితే పూర్తిగా ఏపీలో ఉన్నట్లుగానే అదే డ్రెస్ కోడ్ తో సమావేశాలకు హాజరవుతున్నారు. ఆయన కనీసం మఫ్లర్ కూడా చుట్టుకోకుండా మైనస్ డిగ్రీల దావోస్ లో తన పర్యటన కొనసాగిస్తున్నారు. ఇపుడు కొడుకు లోకేష్ తాను ఏమీ తీసిపోనని నిరూపించుకున్నారు. దీంతో తండ్రీ కొడుకులు ఎవరికి వారుగా ప్రతికూల పరిస్థితులను ఎదురీదుతున్నారని అంటున్నారు.