ఫైర్ బ్రాండ్‌ కు మోడీ చీవాట్లు

Update: 2017-09-06 10:56 GMT
అస‌లే ఫైర్ బ్రాండ్‌. ఆపై సీరియ‌స్ గా ఉన్న‌ట్లుగా ఉండే ఉమాభార‌తి లాంటి సీనియ‌ర్ నేత‌ను ఎవ‌రైనా తిట్టే అవ‌కాశం ఉందా? అంటే.. లేదంటే లేద‌నేస్తారు. కానీ. ప్ర‌ధాని మోడీ మాత్రం ఆమెను గ‌ట్టిగానే చీవాట్లు పెట్టార‌ట‌.ఆ విష‌యాన్ని ఆమె స్వ‌యంగా వెల్ల‌డించ‌టం విశేషం.

సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌తో త‌ర‌చూ వార్త‌ల్లో నిలిచే ఆమె జ‌ల‌వ‌న‌రులు.. న‌దుల అభివృద్ధి.. గంగాన‌దీ ప్ర‌క్షాళ‌న మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అయితే.. ఆమె ప‌ని తీరు ఆశించినట్లుగా లేద‌న్న అభిప్రాయంలో మోడీ ఉన్న‌ట్లుగా చెబుతారు. దీనికి త‌గ్గ‌ట్లే తాజాగా జ‌రిగిన  మంత్రివ‌ర్గ పున‌ర్ వ్య‌వ‌స్థీక‌ర‌ణలో ఆమెకున్న శాఖ‌ల్ని తీసి.. తాగునీరు.. పారిశుద్ధ్యం శాఖ‌ల్ని అప్ప‌గించారు.

త‌న‌కు మార్చిన శాఖ‌ల విష‌యంలో ఉమా కినుక వ‌హించి.. ప్ర‌మాణ‌స్వీకారోత్స‌వ కార్య‌క్ర‌మానికి హాజరు కాలేద‌ని చెబుతున్నారు. అనంత‌రం గుట్టు చ‌ప్పుడు కాకుండా త‌న‌కు కేటాయించిన శాఖ‌ల బాధ్య‌త‌ల్ని స్వీక‌రించారు. తాజాగా ఆమెను మీడియా క‌లిసింది. జ‌ల‌వ‌న‌రుల శాఖా మంత్రిగా స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేయ‌క‌పోవ‌టంతోనే శాఖ‌లు మార్చారా? అన్న ప్ర‌శ్న‌కు ఉమాభార‌తి త‌న‌దైన రీతిలో స‌మ‌ధానం చెప్పారు.

త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌ల విష‌యంలో మోడీ త‌న‌ను ఎప్పుడూ తిట్ట‌లేద‌ని.. అయితే రెండుసార్లు మాత్రం త‌న బ‌రువు విష‌యంలో మాత్రం చీవాట్లు పెట్టార‌న్నారు. బ‌రువు త‌గ్గాల‌ని మోడీ చెప్పారంటూ పాత విష‌యాల్ని గుర్తు చేసుకున్నారు. తాను ఇప్పుడు గంగాన‌ది ద‌గ్గ‌రే ఉండి ప‌ని చేయిస్తాన‌న్నారు. వ‌చ్చే నెల‌లో తాను చేప‌ట్టే గంగా యాత్ర‌కు మోడీ అనుమ‌తి ఇచ్చార‌ని.. అందుకు థ్యాంక్స్  చెబుతున్న‌ట్లు చెప్పిన ఉమా.. త‌న‌కు అప్ప‌గించిన బాధ్య‌త‌లు గ‌తంలో పోలిస్తే ఎక్కువ‌ని క‌వ‌ర్ చేసే ప్ర‌య‌త్నం చేశారు. త‌ప్పు ప‌ట్టే ఛాన్స్ లేన‌ప్పుడు.. ఆ మాత్రం క‌వ‌ర్ చేసుకోక‌పోతే మోడీ లాంటి నేత ఎలా రియాక్ట్ అవుతారో ఉమాభార‌తికి మిగిలిన వారికంటే బాగా తెలుస‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.


Tags:    

Similar News