ఆ సీఎం మాట‌లు మోడీ దాకా వెళ్లాయి

Update: 2018-04-30 05:23 GMT
అనుకున్న‌దంతా అయ్యింది. ముఖ్య‌మంత్రిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు చేప‌ట్టిన త‌ర్వాత పాల‌న మీద ఫోక‌స్ చేయ‌కుండా.. కెలుకుడే ల‌క్ష్య‌మ‌న్న‌ట్లుగా ప్ర‌తి విష‌యానికి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసి వార్త‌ల్లో ద‌ర్శ‌న‌మిస్తున్నారు త్రిపుర సీఎం విప్ల‌వ్ (బిప్ల‌వ్‌) కుమార్‌.

మ‌హాభార‌త కాలంలోనే ఇంట‌ర్నెట్ ఉంద‌ని.. అందాల పోటీల‌న్నీ కార్పొరేట్ మాయాజాల‌మ‌ని.. మ‌మ‌త‌కు మ‌తి చెడింద‌ని.. మాజీ మిస్ వ‌ర‌ల్డ్ డ‌యానా ఏంద‌ని?  సివిల్ స‌ర్వీసెస్ కు సివిల్ ఇంజ‌నీరింగ్ వాళ్లే సూట్ అవుతారన్న వ్యాఖ్య‌లు ఒక ఎత్తు అయితే.. తాజాగా విద్యార్థుల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్య‌లు విప్ల‌వ్ కెలుకుడికి ప‌రాకాష్ఠ‌గా చెబుతున్నారు. చ‌దువుకోవ‌టం క‌న్నా ఆవులు మేపుకోవ‌ట‌మే మంచిదంటూ నోటికి వ‌చ్చిన‌ట్లుగా మాట్లాడేస్తున్న బిప్ల‌వ్‌కు మోడీ క్లాస్ ప‌క్కా అన్న మాట వినిపిస్తూనే ఉంది.

ఈ అంచ‌నాలు ఏ మాత్రం త‌ప్పు కాద‌న్న రీతిలో తాజాగా మోడీ నుంచి ఆదేశాలు జారీ అయిన‌ట్లుగా తెలుస్తోంది. మే2 త‌న ఎదుట హాజ‌రు కావాల‌న్న ఫ‌ర్మానాను మోడీ జారీ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. త్రిపుర సీఎంను త‌న‌ను క‌ల‌వాలన్న మాట‌ను అమిత్ షాకు మోడీ చెప్పార‌న్న వైనం బ‌య‌ట‌కు వ‌చ్చింది.

ఇటీవ‌ల కాలంలో తాను చేస్తున్న వ్యాఖ్య‌ల‌కు విప్ల‌వ్ వివ‌ర‌ణ ఇవ్వాల్సి ఉంటుంద‌ని చెబుతున్నారు. ఏప్రిల్ లో త్రిపుర ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన విప్ల‌వ్‌.. ఇటీవ‌ల కాలంలో చెల‌రేగిపోతున్న‌ట్లుగా ప‌లు అంశాల మీద చేస్తున్న వ్యాఖ్య‌లు ఆయ‌న్ను జాతీయ మీడియా మొద‌లు లోక‌ల్ మీడియా వ‌ర‌కూ నానేలా చేశాయి. విప్ల‌వ్ కెలుకుడు వ్యాఖ్య‌ల కార‌ణంగా పార్టీ ఇమేజ్ సైతం ప్ర‌భావిత‌మ‌య్యేలా మారింద‌న్న మాట వినిపిస్తోంది. విప్ల‌వ్ వ్యాఖ్య‌ల‌పై మోడీ సీరియ‌స్ గా ఉన్నార‌ని.. ఆయ‌న‌కు భారీ క్లాస్ త‌ప్ప‌ద‌ని చెబుతున్నారు. ప్ర‌ధాని మోడీతో త్రిపుర సీఎం మీటింగ్ ను అధికార వ‌ర్గాలు సైతం క‌న్ఫ‌ర్మ్ చేస్తుండ‌టం గ‌మ‌నార్హం.


Tags:    

Similar News