విక్రమ్‌ జాడ కని పెట్టింది ఇస్రోనేనా ..నాసా కాదా ?

Update: 2019-12-04 10:31 GMT
భారత అంతరిక్ష పరిశోధనా కేంద్రం ఇస్రో ప్రతిష్ఠాత్మంగా ప్రయోగించిన ప్రాజెక్టు చంద్రయాన్ 2కు చెందిన విక్రమ్ ల్యాండర్ శకలాలను కనుగొనడంపై సంస్థ ఛైర్మన్ కే శివన్ సంచలన ప్రకటన చేశారు. అమెరికా అంతరిక్ష పరిశోధక సంస్థ నాసా కంటే ముందే తామే విక్రమ్ ల్యాండర్ అవశేషాలను గుర్తించినట్లు వెల్లడించారు. ఇస్రో భారీ స్థాయిలో , అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకోని ప్రయోగించిన ఈ విక్రమ్ చంద్రుడి ఉపరితలంపై దిగుతూ భూ కేంద్రంతో సంబంధాలు తెంచుకుంది. ఇస్రో సాఫ్ట్ ల్యాండ్ కి ఏర్పాటు చేయగా ..విక్రమ్ అదుపుతప్పి హార్డ్ ల్యాండ్ అయ్యింది . దీనితో ఆ లాండర్ తో సంబంధాలు తొలగిపోయాయి.

ఈ నేపథ్యంలో  చంద్రయాన్-2లో విక్రమ్ ల్యాండర్ ఆచూకీని గుర్తించినట్టు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మంగళవారం ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే, విక్రమ్‌ జాడను తాము ఎప్పుడో గుర్తించామని ఇస్రో ఛైర్మన్ కే శివన్ బుధవారం ప్రకటించారు. నాసా ప్రకటనను తోసిపుచ్చిన ఆయన.. విక్రమ్ ఆచూకీ కనుగొన్నది నాసా కాదని,  ఇస్రోనే అని ప్రకటించారు. ఈ విషయాన్ని ఇప్పటికే ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌లో తెలియజేశామని, కావాలంటే మీరు కూడా చూడొచ్చని శివన్ అన్నారు.

చంద్రుడి ఉపరితలంపై దిగుతూ బలంగా ఢీ కొట్టడంతో శకలాలు చెల్లాచెదురయి కిలోమీటర్ వరకు పడిపోయినట్టు తెలిపింది. చెన్నైకు చెందిన మెకానికల్‌ ఇంజినీర్‌ షణ్ముగ సుబ్రమణియన్‌ తొలుత నాసా ఎల్ఆర్‌వో కెమెరా తీసిన ఫోటోలను పరిశీలించి విక్రమ్ ల్యాండర్‌ను గుర్తించినట్లు ఆ సంస్థ  ప్రకటించింది. కాగా, విక్రమ్ ల్యాండర్ సెప్టెంబరు 7న ఉపరితలంపై దిగుతూ భూకేంద్రంతో సంబంధాలు తెగిపోయిన మూడు రోజుల తర్వాత సెప్టెంబరు 10న ల్యాండర్ గురించి ఇస్రో తమ వెబ్‌సైట్‌లోఇలా  తెలిపింది.

చంద్రయాన్‌-2 ఆర్బిటర్‌ విక్రమ్‌ ల్యాండర్‌ను గుర్తించింది. కానీ, దానితో ఇంకా కమ్యూనికేషన్‌ జరగలేదు. ల్యాండర్‌ తో కమ్యూనికేషన్‌ పునరుద్ధరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అని తెలిపింది. అందుకే నాసా కంటే ముందే విక్రమ్‌ ల్యాండర్‌ను తాము గుర్తించామని శివన్‌ చెబుతున్నారు. అయితే, విక్రమ్‌ ఎలాంటి పరిస్థితుల్లో ఉందన్న మాత్రం ఇస్రో స్పష్టంగా వెల్లడించలేదు. కానీ ,నాసా తాజాగా  విడుదల చేసిన ఫోటోల్లో ల్యాండర్‌ పూర్తి గా విచ్ఛిన్నమైనట్లు  కనిపిస్తుంది.
Tags:    

Similar News