జాతీయ మీడియా ప‌రువు పోవ‌టం ఖాయ‌మ‌ట‌!

Update: 2018-11-19 04:53 GMT
గ‌ల్లీ మీడియాను సిల్లీగా తీసి పారేయ‌టం మామూలే. గ‌ల్లీ మీడియా ఈక‌గా మారి ఎంతో కాల‌మైంది. ఇక‌.. స్టేట్ మీడియా కూడా అలాంటి ప‌రిస్థితే దాపురించి కొన్ని సంవ‌త్స‌రాలైంది.ముక్కుముఖం తెలీనోళ్లు.. మీడియా అంటే అవ‌గాహ‌న లేకున్నా చేతిలో ఉన్న కోట్ల‌ను కుమ్మ‌రించేయ‌టం.. మీడియా సంస్థ‌ల్ని స్థాపించ‌టం ఎక్కువైంది. ఇది స‌రిపోద‌న్న‌ట్లుగా  మీడియా వ్యాపారంలోకి వ‌చ్చినోళ్లు హుందాత‌నాన్ని వ‌దిలేసి చాలా ఏళ్లు అయిపోయింది. ఎమ్మెల్యే స్థాయి నేత‌ను సైతం మీడియా అధినేత‌లు నేరుగా మాట్లాడ‌టం.. అబ్లిగేష‌న్ పేరుతో హ‌ద్దులు దాటేసిన వైనం ఇప్పుడు పాత‌దైంది.

ఎప్పుడైతే ఎమ్మెల్యే స్థాయి నేత‌.. మీడియా అధినేత‌తో నేరుగా మాట్లాడ‌టం.. త‌మ అవ‌స‌రాలు తీర్చుకోవ‌టం పెరిగిందో పాత్రికేయానికి ఉన్న కొద్దిపాటి మ‌ర్యాద‌.. గౌర‌వం గంగ‌లో క‌లిసిపోయింది. ఎమ్మెల్యే కాదు.. స‌ర్పంచ్ లు సైతం మీడియా అధినేత‌ల ట‌చ్ లోకి వెళ్లిపోతున్నారు. త‌మ అవ‌స‌రాల్ని వారి దృష్టికి తీసుకొచ్చి త‌మ‌కు త‌గ్గ‌ట్లుగా ప‌ని చేయించుకోవ‌టం.. మీడియాలో వార్త‌లు వండించుకోవ‌టం ఈ మ‌ధ్య‌న ఎక్కువైంది.

స్టేట్ మీడియాలో ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్లే జాతీయ స్థాయిలోనూ ఇప్పుడు మార్పులు వ‌చ్చేశాయి. ఏదైనా జాతీయ స్థాయిలో ప్ర‌భావాన్ని చూపించే కుంభ‌కోణాల మీద విస్తృతంగా వార్త‌లు ఇవ్వ‌టం మొద‌టినుంచి ఎక్కువే. కానీ.. మోడీ మాష్టారి ఎంట్రీతో ఇప్పుడు సీన్ మొత్తం మారిపోయింది.   మోడీ సాబ్‌కు వ్య‌తిరేకంగా కానీ.. వారి మనోభావాలు దెబ్బ తినేలా కానీ.. వారి ఇమేజ్ డ్యామేజ్ అయ్యే అంశాలేవీ వార్త‌లుగా బ‌య‌ట‌కు రాకూడ‌ద‌న్నది ఇప్పుడు అప్ర‌క‌టిత రూల్ గా మారిన‌ట్లుగా చెబుతున్నారు.

త‌మ‌ను తాము కొమ్ములు తిరిగిన మీడియాగా.. ద‌మ్ము.. ధైర్యం అన్న‌వి త‌మకు మాత్ర‌మే పేటెంట్ ఉంద‌న్న‌ట్లుగా చెప్పే మీడియా హౌస్ లు సైతం ఇప్పుడు కామ్ గా మారాయి. ఇదిలా ఉంటే తాజాగా అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న‌ ఆరు రాష్ట్రాల్లో  (తెలంగాణ‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌.. రాజ‌స్థాన్‌.. సిక్కిం.. చ‌త్తీస్ గ‌ఢ్‌.. మిజోరం)   బీజేపీ గెలుపు ఎక్క‌డా? అన్న క్వ‌శ్చ‌న్ కు వెంట‌నే స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి. ఈ ఆరు రాష్ట్రాల్లో అయితే ఒక్క రాష్ట్రంలో మిన‌హా మ‌రే రాష్ట్రంలోనూ క‌మ‌లం త‌న‌ ప్ర‌భావాన్ని చూప‌లేవ‌న్న మాట‌ను అంత‌కంత‌కూ ఎక్కువ అవుతోంది. అయితే.. జాతీయ మీడియాలో మాత్రం అందుకు భిన్నంగా మోడీ గాలి వీస్తుంద‌న్న మాట అదే ప‌నిగా చెబుతున్నారు. మీడియాలో మోడీకి ఇస్తున్న ప్రాధాన్య‌త‌.. హైప్ అంతా కూడా కృత్రిమ‌మైన‌దేన‌ని చెబుతున్నారు.

ఈ మ‌ధ్య‌న జ‌రిగిన కొన్ని రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల్లోనూ.. ఉప ఎన్నిక‌ల వేళ‌లోనూ త‌మ‌దైన త‌ర‌హాలో విశ్లేష‌ణ‌లు చేసి.. భారీ ఎత్తున కుంభ‌కోణాల్ని పెద్ద‌గా ఫోక‌స్ చేయ‌కున్నా ఎలాంటి ఫ‌లితాలు వ‌చ్చింది తెలిసిందే. అంతేనా.. స‌ర్వేల పేరుతో.. బీజేపీకి అనుకూలంగా అంచ‌నాల్ని ప్ర‌క‌టించ‌టం ఈ మ‌ధ్య‌న మీడియా సంస్థ‌ల‌కు కామ‌న్ అయిపోయింద‌న్న అప్ర‌పద‌ను మూట‌గ‌ట్టుకున్న దుస్థితి. ఇలాంటివేళ‌.. తాజాగా జ‌రుగుతున్న ఆరు రాష్ట్రాల్లో బీజేపీ మూడు రాష్ట్రాల్లో త‌న స‌త్తా చాటుతుంద‌న్న మాట బీజేపీ నేత‌ల నోట వినిపిస్తోంది. వారి మాటే వేద‌వాక్కుగా వల్లె వేసే జాతీయ మీడియా సంస్థ‌లు అదే ప‌నిగా వార్త‌లు వండేస్తున్నారు.

మ‌రి.. వాస్త‌వం ఏమిట‌న్న విష‌యంలోకి వెళితే.. హైద‌రాబాద్‌కు చెందిన సీనియ‌ర్ జ‌ర్న‌లిస్టులు కొంద‌రు అసెంబ్లీ ఎన్నిక‌లు జ‌రుగుతున్న రాజ‌స్థాన్‌.. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌..ఛ‌త్తీస్ గ‌ఢ్‌.. రాష్ట్రాల్లో ప‌ర్య‌టించారు. ఈ మూడు రాష్ట్రాల్లోనూ బీజేపీ గ‌డ్డు ప‌రిస్థితి ఎదుర్కొంటున్న‌ట్లుగా వారు చెప్పారు. సామాన్య జ‌నం అనుకుంటున్న దానికి.. జాతీయ మీడియాలో వ‌స్తున్న వార్త‌ల‌కు ఏ మాత్రం పొంత‌న లేద‌ని వారు చెబుతున్నారు. మోడీ బ్యాచ్ భ‌జ‌న‌లో మునిగి తేలుతున్న నేష‌న‌ల్ మీడియా తాజా ఎన్నిక‌ల ఫ‌లితాలు షాకింగ్ గా మార‌టమే కాదు.. వాటి ఇమేజ్ ను దారుణంగా డ్యామేజ్ చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట ప‌లువురి నోట వినిపిస్తోంది. ఎంత మోడీ అయితే మాత్రం.. త‌మ ఉనికికే ప్ర‌మాదమైన పోక‌డ‌ల‌కు పోవ‌టం ఏమిటో?
Tags:    

Similar News