కశ్మీర్ విషయంలో పాక్ జోక్ పేల్చింది!

Update: 2016-08-12 04:13 GMT
చిన్నప్పడు చదివిన - విన్న కథల ప్రకారం నక్క మోసం చేయకూడదని మాట్లాడినా - సింహం నాన్ వెజ్ తినడం మానేశానని ప్రకటించినా అది ఏమాత్రం నమ్మశక్యం కాని విషయమే కాకుండా పెద్ద జోక్ కూడా! ఇదే క్రమంలో మా దేశంలో ఉగ్రవాదులు లేరు - ఉగ్రవాదులను మేము పెంచిపోషించేది లేదు, దావూద్ ఇబ్రహీం మా వద్దలేడు - ఉగ్రవాద రహిత ప్రపంచాన్ని మేము కోరుకుంటున్నాం... అంటూ ప్రపంచ వేదికలపై ఊకదంపుడు ఉపన్యాశాలు ఇచ్చే దేశం పాకిస్థాన్! పైన చెప్పుకున్న ఈ విషయాల్లో, పాక్ చెబుతున్న అంశాల్లో ఏ ఒక్కటైనా నిజముందంటే.. ప్రపంచవ్యాప్తంగా ఆ విషయం నమ్మేవారు ఎందరనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాంటి పాకిస్థాన్ తాజాగా మానవహక్కుల గురించి స్పందించింది. అసలు పాక్ కి మానవహక్కులు - వాటి అమలు వంటి సంగతుల గురించి మాట్లాడే నైతిక హక్కు ఉందా అనే విషయం వారి అంతరాత్మకే వదిలేస్తే.. ఏకంగా భారతదేశమే మానవహక్కుల ఉల్లంఘన చేస్తోందని చెప్పుకొస్తోంది. ఇది జోక్... కాదు కాదు అంతకు మించి!

తాజాగా భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ ఐక్యరాజ్యసమితికే లేఖ రాశారు. ఇదే క్రమంలో కశ్మీర్‌ లో భారత్ దురాగతాలకు పాల్పడుతోంద ని ఆరోపిస్తూ అరబ్ దేశాల కూటమికి కూడా లేఖ రాశారు. తమ భూబాగాన్ని ఉగ్రవాద కార్యకలాపాలకు వినియోగించబోమంటూ కశ్మీర్ విషయంలో చేసుకున్న ఒప్పందాలను నిస్సిగ్గుగా - నిరంకుశంగా అతిక్రమిస్తోన్న పాక్.. ఐకాస కు లేఖ రాయడంపై భారత్ ఘాటుగా స్పందించింది. ఒకపక్క చేసుకున్న ఒప్పందాలను అతిక్రమిస్తూనే.. తిరిగి భారత్ మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందని చెప్పడంపై భారత మండిపడింది..

ఈ సందర్భంగా... కశ్మీర్ పూర్తిగా భారత్ అంతర్గత విషయమని - ఇందులో జోక్యం చేసుకోవద్దని పాక్‌ ను భారత్ హెచ్చరించింది. కశ్మీర్ అంశాన్ని అంతర్జాతీయ సమస్యగా చూపే ప్రయత్నాన్ని మానుకోవాలని - సీమాంతర ఉగ్రవాదాన్ని ప్రోత్సహించడం - చొరబాట్లు ఆపాలని పాక్‌ కు గట్టి హెచ్చరికలు పంపింది. ఏదిఏమైనా.. అంతర్జాతీయ వేదికలపై తాము చేస్తున్న తప్పులను భారత్ పైకి నెట్టడం వారి మార్కు సంస్కారమని కొందరంటుంటే.. భారత్ మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతోందని పాక్ చెప్పడం ఈ మేటి మేటి జోక్ అని అభివర్ణిస్తున్నారు మరికొందరు.
Tags:    

Similar News