రజినీపై దుష్ప్రచారం ఏ స్థాయిలో ఉందంటే..

Update: 2018-01-07 07:10 GMT
రాజకీయాలంటేనే రొచ్చు అనేది ఇందుకే మరి. ఒక ప్రభావవంతమైన వ్యక్తి కొత్తగా ఆ రంగంలోకి వస్తే వారిపై ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా బురద చల్లడానికి.. వారి వ్యక్తిత్వాన్ని భ్రష్టు పట్టించడానికి ప్రయత్నాలు జరుగుతాయి. సూపర్ స్టార్ రజినీకాంత్ విషయంలోనూ ఇలాగే జరుగుతోంది. రజినీకాంత్ భారతీయ జనతా పార్టీకి పరోక్ష మద్దతుదారు అనే ప్రచారం ఒకటి ముందు నుంచి ఉంది. ఆ పార్టీతో రజినీకి లోపాయకారీ ఒప్పందాలున్నాయని ప్రత్యర్థులు ఆరోపిస్తుంటారు. గత రెండేళ్లలో తమిళనాడు విషయంలో కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ పెద్దలు వ్యవహరించిన తీరుతో ఆ రాష్ట్ర ప్రజలు విసిగిపోయి ఉన్నారు. ఆ ప్రభావం మొన్నటి ఆర్కే నగర్ ఉప ఎన్నికల్లోనూ కనిపించింది.

ఈ నేపథ్యంలో ఆ వ్యతిరేకతను రజినీ మీదికి కూడా మళ్లించడానికి ప్రయత్నాలు మొదలయ్యాయి. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తో రజినీ సమావేశం అయినట్లుగా ఉన్న ఒక ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఆ సమావేశంలో కొందరు మత పెద్దలు.. సాధువులు కూడా కూర్చుని ఉన్నారు. ఇలాంటి సమావేశంలో పాల్గొనాల్సిన అవసరం రజినీక ఏం వచ్చిందా అని జనాలు చర్చించుకుంటున్నారు. కానీ అసలు విషయం ఏంటంటే.. నిజానికి ఆ మీటింగ్ లో రజినీ లేనే లేడు. ఫొటో మధ్యలో ఖాళీ ప్లేస్ కనిపించేసరికి ఫొటో షాప్ సాయంతో ఒక కుర్చీ వేసి అందులో రజినీని కూర్చోబెట్టేశారు. జనాలకు దురభిప్రాయం కలిగేలా చేశారు. రజినీ అంటే తమిళనాట ఉన్న పార్టీలు ఎంత భయపడుతున్నాయో.. ఆయనకి వ్యతిరేకంగా అప్పుడే ఎలాంటి దుష్ప్రచారం మొదలైందో చెప్పడానికి ఇది రుజువు.


Tags:    

Similar News