కొత్త కరెన్సీపై నేపాల్ ఫిటింగ్

Update: 2016-11-25 09:49 GMT
కొత్త కరెన్సీపై నేపాల్ ఫిటింగ్
  • whatsapp icon
పెద్ద నోట్ల రద్దు వ్యవహారం పొరుగుదేశాలతో మన సంబంధాలనూ దెబ్బతీసేలా కనిపిస్తోంది. ఇండియా పొరుగు దేశాల్లో చైనా - పాకిస్థాన్ తప్ప మిగతా అన్ని చోట్లా మన కరెన్సీ బాగా చెలామణీలో ఉంటుంది. ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో ఇండియా కరెన్సీని చాలా సాధారణంగా యాక్సెప్ట్ చేస్తారు. నేపాల్ - బంగ్లాదేశ్ - భూటాన్ - బర్మా దేశాల్లో మన కరెన్సీకి ఏమాత్రం అడ్డులేదు. కానీ... తాజా పరిస్థితుల నేపథ్యంలో సీను మారుతోంది. నేపాల్ మన కరెన్సీకి బ్రేకులేస్తోంది. ఇండియాలో కొత్తగా విడుదల చేసిన 500 - 2000 నోట్లు చెల్లుబాటు కాకుండా నోటిఫికేషన్ ఇచ్చింది. అంటే... ఇకపై మన నోట్లను అక్కడి కరెన్సీలోకి మార్చుకోవాల్సిందే.

దశాబ్దాలుగా భారత కరెన్సీని ఉపయోగిస్తున్న నేపాల్ ఇలాంటి ఉత్తర్వులివ్వడం భారత్ కు షాకనే చెప్పుకోవాలి. నేపాల్ తో తరతరాలుగా భారత్ కు అనుబంధం ఉంది. దాదాపు అన్ని విషయాల్లోనూ నేపాల్ భారత్ ను ఫాలో అవుతుంది. భారతీయులకు బాగా విలువ ఇస్తుంది. అలాంటి నేపాల్లో ఇప్పటివరకూ భారత కరెన్సీ యథేచ్ఛగా చలామణిలో ఉంది. అలాంటిది ఉన్నట్లుండి కొత్త కరెన్సీని మాత్రం బ్యాన్ చేశారు. నేపాల్ ఆగ్రహంతోనే ఈ పని చేసినట్లు తెలుస్తోంది.

మన వద్ద రద్దు చేసిన 500 - 1000 నోట్లు నేపాల్ ప్రజల వద్ద కూడా చెప్పుకోదగ్గ సంఖ్యలో ఉంటాయి. కానీ, వాటిని మార్చుకోవడం వారికి సాధ్యం కావడం లేదట. ఇండియాలో ఉన్న కరెన్సీయే ఇంకా పూర్తిగా మారకపోవడంతో ఇతర దేశాల్లో సాధ్యం కావడం లేదు. దీంతో నేపాలీ ప్రజలు ఆ మేరకు నష్టపోయే పరిస్థితి కనిపిస్తోంది. కానీ... ఇండియా వైపు నుంచి దానిపై ఎలాంటి స్పందన లేకపోవడంతో మనకు హెచ్చరిక చేసేందుకే నేపాల్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొత్త కరెన్సీ చెల్లుబాటు కాకుండా రెండు దేశాల మధ్య మార్కెట్ పైనా ప్రభావంపడుతుంది.  మన ఆర్బీఐ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్ మెంట్ యాక్ట్ కింద ఇతర దేశాల్లోని పాత నోట్ల సంగతి తేల్చేవరకు నేపాల్లో మన కొత్త నోట్లు బ్యాన్ ఉండబోతోంది. తమ ప్రజల వద్ద పెద్ద నోట్లు భారీగా ఉన్నాయని... అవి మార్చుకోలేకపోవడం ఒకెత్తయితే - ఏదోరకంగా మార్చుకున్నా కొత్త నోట్లు 2000 నోట్లు కావడంతో చిల్లర సమస్య తలెత్తుతోంది.  దీంతో భారత్ తమ ప్రజల సమస్య తీరిస్తేనే కొత్త నోట్లకు ఓకే చెబుతామని నేపాల్ ప్రభుత్వం గట్టి సంకేతాలే పంపించింది.  మన ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో చూడాలి. భారత ప్రజల సమస్యలు తీర్చలేకే నానా బాధలు పడుతున్న సమయంలో నేపాలీల బాధ్యత కూడా భుజానికెత్తుకోవడం తలకుమించిన భారమే మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News