కోడిని కోసుకు తినే ముందు కనికరించండి ప్రజలారా!
జంతువులను, అమాయక మూగజీవాలను చంపి తినడం సరికాదని చెబుతూనే, శాఖాహారంతో ఆయురారోగ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు.
సంక్రాంతి పండుగలో కనుమ రోజు మందు, ముక్క లేనిదే కొందరికి ముద్ద దిగదు. ఈసారి కూడా కోటి కోళ్లయినా ప్రాణాల్ని ఆర్పించాల్సి ఉంటుందని అంచనా. కానీ ఇలాంటి మాంసాహారులకు శాఖాహారం విలువేంటో తెలుసుకోవాలని సూచిస్తున్నారు కొందరు కథానాయికలు. ఆలియా భట్, పరిణీతి చోప్రా, కంగన రనౌత్, అనుష్క శర్మ, విద్యా బాలన్, ఇషా గుప్తా, జాక్విలిన్ తదితర నటీమణులు ఉన్నారు. జంతువులను, అమాయక మూగజీవాలను చంపి తినడం సరికాదని చెబుతూనే, శాఖాహారంతో ఆయురారోగ్యాలు పెరుగుతాయని చెబుతున్నారు. ఈ సంక్రాంతికి కోటి కోళ్లు ప్రాణాలర్పించడానికి సిద్ధంగా ఉన్న వేళ ఫేవరెట్ హీరోయిన్స్ చెప్పిన సంగతులు ఇలా ఉన్నాయి.
బాలీవుడ్ తో పాటు దక్షిణాదికి సుపరిచితురాలైన అలియా భట్ శాఖాహారమే ఆరోగ్యానికి మేలు అని చెబుతున్నారు. ఆలియా మాంసాహారం నుంచి శాఖాహారానికి మారారు. చాలా కాలంగా వీలున్న అన్ని వేదికలపైనా ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని ఆమె చెబుతుంది. అలాగే మాంసాహారాన్ని సంకల్ప శక్తితో జయించవచ్చు ! అని తలైవి ఫేం కంగనా రనౌత్ అన్నారు. క్వీన్ కంగన నాన్-వెజిటేరియన్ నుండి శాఖాహారిగా మారిపోయానని గతంలో ప్రకటించింది. శాఖాహారంలోని పోషక విలువలు, నైతికత గురించి తెలుసుకుని తాను మారానని తెలిపింది.
నాలుగైదేళ్ల క్రితం మాంసాహారం మానేశానని, పాలు -పాల ఉత్పత్తులను స్వీకరించడం మానేశానని సీనియర్ నటి సోనమ్ కపూర్ అన్నారు. సోనమ్ ఇప్పుడు ఆరోగ్యకరమైన శాఖాహారాన్ని తీసుకుంటున్నానని తెలిపారు. జాక్వెలిన్ మొదటి నుంచి శాకాహారి కాబట్టి జంతువులపై క్రూరత్వాన్ని వ్యతిరేకిస్తుంది. శుభ్రమైన ఆరోగ్యకరమైన శాఖాహారాన్ని తినాలని గట్టిగా నమ్ముతుంది. ముంబైలో తన శాఖాహార ప్రాధాన్య రెస్టారెంట్‌ను తెరిచింది. జంతువుల భద్రత, రక్షణకు సంబంధించిన ఎన్జీఓలకు కూడా జాకీ మద్దతునిస్తుంది.
శత్రుఘ్న సిన్హా నట వారసురాలు సోనాక్షి సిన్హా జంతువులపై క్రూరత్వానికి వ్యతిరేకి. సోనా చాలా కాలం క్రితమే శాకాహారిగా మారింది. అలా మారాక బరువు తగ్గింది. దాని ఫలితంగా ఇప్పుడు ఆకట్టుకునే శరీరాకృతి వచ్చింది. శాకాహారం తన జీవక్రియను పెంచడానికి సహాయపడిందని నటి సోనాక్షి అంగీకరించింది. ఇస్కాన్ ఆచారాలను అనుసరించే, అనుష్క శర్మ భర్త విరాట్ కోహ్లీతో పాటు శాఖాహారిగా మారారు. ఈ ఎంపికతో సంతోషంగా ఉన్నానని అనుష్క వెల్లడించింది. శాఖాహారిగా మార్చడం నాకు చాలా కష్టం.. కానీ ఇది అనుకోని ఎంపిక. జంతువులపై నా ప్రేమ, ఆధ్యాత్మిక కారణాలు ఈ జీవనశైలి మార్పును తెచ్చాయి... అని తెలిపారు.
జాక్విలిన్ తరహాలోనే విద్యా బాలన్ స్వచ్ఛమైన శాఖాహారి. తన భర్త మాంసాహారి కాదు. అందువల్ల ఈ జంట శాఖాహారులుగా తమ జీవనశైలిని కొనసాగిస్తున్నారు. సన్నీలియోన్ కు కొన్ని ఆరోగ్య సంబంధిత సమస్యలను ఎదుర్కొంటున్నందున తన వైద్యుడు నాన్-వెజిటేరియన్ ఆహారానికి దూరంగా ఉండాలని సలహా ఇచ్చారు. దీంతో విషపూరితమైన మాంసం తినను అని సన్నీ ప్రకటించారు. పెటా ప్రచారం కోసం తన షూట్ సమయంలో శాఖాహారిగా మారేందుకు నేహా ధుపియా ప్రయత్నించింది. పెటా సూత్రం ఏమిటంటే జంతువులను తినడం, జంతు శరీరాలను ధరించడం, మూగజీవాలను వినోదం కోసం హింసించడం సరికాదు అని ప్రచారం చేస్తోంది.
నేను శాకాహారిగా ఉండటం గురించి చాలా గొప్పగా చెప్పుకుంటాను. అది నా స్పష్టమైన మనస్సాక్షి! అని మల్లికా షెరావత్ అన్నారు. ఈ బ్యూటీ 2011లో పెటా హాటెస్ట్ శాకాహారిగా ఎంపికైంది. ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలనుకుంటే శాఖాహారులుగా ఉండటం మంచి మార్గం అని ఇషాగుప్తా ప్రకటించారు. శాఖాహారిగా ఉండటం నిజంగా జంతువుల ప్రాణాలను కాపాడుతుంది.. అని తెలిపింది. ఇషా తన శాకాహార జీవనశైలిని ఆనందంగా స్వీకరించింది.
బౌద్ధ, జైన మతాలు శాంతి తత్వాన్ని భోధించడానికి ముందు శాఖాహారం గురించి విస్త్రతంగా ప్రచారం చేసాయి. కొన్ని హిందూ సంస్థానాలు శాఖాహారానికి కట్టుబడి ఉండాలని సూచిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 170 దేశాలకు విస్తరించిన ఇస్కాన్ (అంతర్జాతీయ కృష్ణ సమాజం) దీనిని భోధిస్తుంది. కనుమకు ముందు రోజే ఈ విషయం తెలిసింది గనుక.. కోడిని కోసుకు తినేవాళ్లంతా గ్రహించాల్సింది చాలా ఉంది. శాఖాహారం ప్రాశస్త్యం వెనక సైన్స్ ను అర్థం చేసుకుని ప్రజలలో కొందరైనా శాఖాహారులుగా మారాలని ఆకాంక్షిద్దాం. కోడిని కోసుకు తినే ముందు ఒకమారు ఆలోచించండి ప్రజలారా!