కష్టంలో కక్కుర్తికి అమెరికా మినహాయింపు కాదు
అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల్నిచూస్తే.. అచ్చం మన దగ్గరి మాదిరే కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల్ని అవకాశంగా మార్చుకొని దొంగలు చెలరేగిపోతూ..
మనిషికి మించిన అవకాశవాది మరొకడు ఉండడన్న మాటకు తగ్గట్లే.. పరిణామాలు చోటు చేసుకుంటాయి. మరీ.. ముఖ్యంగా విపత్తు విరుచుకుపడినంతనే.. ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటం కోసం కాసుల కక్కుర్తిని ప్రదర్శిస్తుంటారు. ఈ తీరు చూసి.. మనోళ్లు ఎంత స్వార్థపరులని తిట్టుకుంటూ ఉంటాం. తుపాను.. వరదల వేళ.. ఏదైనా అనూహ్య ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు.. డిమాండ్ కు తగ్గట్లే..ధరలు పెంచేసి భారీగా డబ్బులు లాగేసే ధోరణి మన దేశంలో కనిపిస్తూ ఉంటుంది. మనల్ని మనం తిట్టుకుంటాం కానీ.. ఇలాంటి ధోరణిని తరచి చూస్తే.. ప్రపంచంలోని చాలా దేశాల్లోనూ ఇది కనిపిస్తుంది.
దీనికి అగ్రరాజ్యం అమెరికా కూడా మినహాయింపు కాదు. దగ్గర దగ్గర రెండు వారాల నుంచి అమెరికాలోని లాస్ ఏంజెలిస్ మహానగరాన్ని అతలాకుతలం చేస్తున్న కార్చిచ్చు ధాటికి ఇప్పటికే వేలాది విలాస భవనాలు కాలి బూడిద కావటమే కాదు.. దగ్గర దగ్గర ఆస్తినష్టం రూ.20 లక్షలకోట్ల వరకు జరిగి ఉంటుందని భావిస్తున్నారు. హాలీవుడ్ కు చెందిన పలువురు ప్రముఖుల విలాస భవనాలు ఈ అగ్నికీలకల ధాటికి కాలి బూడిదగా మారాయి.
దీంతో.. అక్కడ చోటు చేసుకుంటున్న పరిణామాల్నిచూస్తే.. అచ్చం మన దగ్గరి మాదిరే కనిపిస్తున్నాయి. అగ్ని ప్రమాదాల్ని అవకాశంగా మార్చుకొని దొంగలు చెలరేగిపోతూ.. ఖరీదైన ఇళ్లల్లోకి వెళ్లి దోచేస్తున్నారు. కార్చిచ్చు ప్రభావానికి భయాందోళనలతో పలువురు ప్రముఖులు తమ ఇళ్లను ఖాళీ చేసేయటంతో దొంగలు పెద్ద ఎత్తున రెచ్చిపోతున్నారు. ఇక.. ఈ విపత్తును అవకాశంగా మార్చుకొని ఆన్ లైన్ మోసాలు చేసే వారు తమ టాలెంట్ ను ప్రదర్శిస్తూ.. ప్రముఖుల పేరుతో దోచేస్తున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. ఇప్పటికి కార్చిచ్చు తీవ్రత ఒక కొలిక్కి రాకపోవటం తెలిసిందే. అంతకంతకూ విస్తరిస్తున్న మంటల ధాటికి ఇప్పటివరకు 19వేల ఇళ్లు కాలిపోయాయి. మరిన్ని ఇళ్లు కూడా అగ్నికి ఆహుతి అవుతాయని అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా తమ ఇళ్లను ఖాళీ చేస్తున్న వారు.. ఇప్పుడు అద్దె కోసం కొత్త ఇళ్ల వేటలో పడ్డారు. దీన్నో అవకాశంగా మార్చుకున్న ఇళ్ల యజమానులు తమ ఇంటి అద్దెల్ని భారీగా పెంచేస్తున్న వైనం ఇప్పుడు బయటకు వచ్చింది.
బెల్ ఎయిర్ అనే ప్రాంతంలో నాలుగు పడకల ఇంటికి 29,500 డాలర్లు చెల్లించినట్లుగా స్థానిక పత్రికలు వెల్లడించాయి. ఇక్కడ ఉండే అద్దెలకు రెట్టింపు పెంచేసి.. వసూలు చేస్తున్నారు. ఇళ్లకు భారీగా డిమాండ్ పెరగటంతో డబ్బుల కోసం వెనుకాడని పరిస్థితి. మరోవైపు అద్దెల్ని 10 శాతానికి మించి పెంచకూడదన్న చట్టాన్ని సైతం చాలామంది ఉల్లంఘిస్తున్నట్లుగా పేర్కొంటున్నారు. ఇలా ఇష్టారాజ్యంగా అద్దెల్ని పెంచేసే వారిపై కంప్లైంట్ ఇవ్వాలని కాలిఫోర్నియా అటార్నీ ఆఫీసు అధికారులు పేర్కొంటున్నారు. ఇదంతా చూసినప్పుడు.. విపత్తు వేళ.. ఇష్టారాజ్యంగా వసూలు చేసే తీరు మనకే కాదు.. ఈ కాసుల కక్కుర్తికి అగ్రరాజ్యం మినహాయింపు కాదన్నదితాజా ఉదంతంతో అర్థమవుతుందని చెప్పాలి.