డ్ర‌గ్స్ కేసులో ఐపీఎల్ జ‌ట్టు ఓన‌ర్ కు జైలు!

Update: 2019-04-30 08:00 GMT
ఐపీఎల్ సీజ‌న్ స్టార్ట్ అయ్యిందంటే చాలు.. ఏదో ఒక వివాదం తెర మీద‌కు రావ‌టం.. ర‌చ్చ ర‌చ్చ అయ్యేది. గ‌డిచిన రెండు..మూడు సీజ‌న్ల‌లో అలాంటిదేమీ చోటు చేసుకోక‌పోవ‌టంతో అంద‌రూ ఊపిరి పీల్చుకుంటున్న ప‌రిస్థితి. ఇదిలా ఉంటే.. ఈసారి అలాంటి ప‌రిస్థితి లేన‌ట్లే. తాజాగా చోటు చేసుకున్న ప‌రిణామం దీనికి కార‌ణంగా చెప్పాలి.

ఐపీఎల్ టీం పంజాబ్ కింగ్స్ య‌జ‌మాని.. పారిశ్రామిక‌వేత్త నెస్ వాదియాకు జ‌పాన్ కోర్టు రెండేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పును ప్ర‌క‌టించింది. ఈ ఏడాది మార్చిలో పాతిక గ్రాముల డ్ర‌గ్స్ తో జ‌పాన్ లో ఆయ‌న అక్క‌డి పోలీసుల‌కు ప‌ట్టుబ‌డ్డారు. దీంతో.. ఆయ‌న‌కు శిక్ష ఖ‌రారైన‌ట్లుగా ప్ర‌ముఖ మీడియా సంస్థ ఫైనాన్షియ‌ల్ టైమ్స్ ప్ర‌క‌టించింది.

ప్ర‌ఖ్యాత నెస్ వాదియా గ్రూప్ అధినేత నుస్లీ వాదియా వార‌సుడే నెస్ వాడియా. పేరున్న పెద్ద పారిశ్రామిక కుటుంబం నుంచి వ‌చ్చిన ఈ బిజినెస్ మ్యాన్.. త‌న వ్య‌క్తిగ‌త వాడ‌కం కోస‌మే డ్ర‌గ్స్ ను త‌న‌తో ఉంచుకున్న‌ట్లుగా పోలీసుల‌కు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

డ్ర‌గ్స్ కేసులో నెస్ వాడియాకు జ‌పాన్ లో జైలుశిక్ష విధించిన వైనంపై ఇప్ప‌టివ‌ర‌కూ వాదియా గ్రూపు నుంచి ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డ‌లేదు. దీనిపై ఎవ‌రూ స్పందించ‌లేదు కూడా. ఇదిలా ఉంటే.. మ‌రో ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ వార్త‌కు జాతీయ మీడియాలోనూ.. ప్రాంతీయ మీడియాలోనూ ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోవ‌ట‌మే కాదు.. చాలామంది అస‌లీ వార్త‌ను క‌వ‌ర్ చేయ‌క‌పోవ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది. 
Tags:    

Similar News