బండి ఓవర్ చేస్తున్నారా ?

Update: 2021-08-30 06:30 GMT
‘వచ్చే ఏడాది గోల్కొండపై బీజేపీ జెండాను ఎగరేస్తాం’ తాజాగా తెలంగాణా కమలంపార్టీ చీఫ్ బండ సంజయ్ చేసిన వ్యాఖ్యలు. పాదయాత్ర సందర్భంగా బండి మాట్లాడుతు కేసీయార్ పై ఆరోపణలు, విమర్శలు చేశారు. సరే ఇపుడు మొదలైన పాదయాత్ర కేసీయార్ పాలనకు వ్యతిరేకంగా మొదలుపెట్టింది కాబట్టి సహజంగానే సీఎంనే బండి టార్గెట్ చేశారు. అయితే ఇక్కడే బండి చేసిన ప్రకటన కాస్త ఓవర్ గా ఉందనిపించింది అందరికీ.

వచ్చే ఏడాది గోల్కొండపైన  బీజేపీ జెండాను ఎగరేస్తామని ప్రకటించటం ఆశ్చర్యంగానే ఉంది. గోల్కొండపై బీజేపీ జెండాను ఎగరేయటం అంటే తెలంగాణాలో అధికారంలోకి వచ్చేస్తామని చెప్పటమే. నిజంగానే తెలంగాణాలో అధికారంలోకి వచ్చేంత సీన్  బీజేపికి ఉందా ? అన్నదే ప్రశ్న. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధులను కూడా పోటీలోకి దింపేంత సీన్ పార్టీకి లేదన్నది వాస్తవం.

2018 ముందస్తు ఎన్నికల్లో అన్నీ నియోజకవర్గాల్లోను బీజేపీ పోటీచేస్తే గెలిచింది ముచ్చటగా ఒక్కసీటు. గెలిచిన ఓల్డ్ సిటీలోని గోషామహల్ నియోజకవర్గం కూడా రాజాసింగ్ సొంత ఇమేజి వల్లే కానీ పార్టీపరంగా కాదని అందరికీ తెలిసిందే. ఆమధ్య గెలిచిన దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీ గెలిచిందంటే అది కేసీయార్ నిర్లక్ష్యం వల్లే తప్ప బీజేపీ గొప్పదనం కాదు. దుబ్బాకలో గెలిచేంత బలం బీజేపీకి లేదు. కాకపోతే కేసీయార్ మీదున్న వ్యతిరేకత దుబ్బాకలో బయటపడింది.

ఇదే సమయంలో ఇతర పార్టీల నుండి అందిన సహకారం, బీజేపీ అభ్యర్ధి రఘునందనరావు మీదున్న సానుభూతి లాంటి అనేక కారణాలు కలిసొచ్చి బీజేపీ గెలిచిందంతే. వాస్తవం ఇలాగుంటే వచ్చే ఎన్నికల్లో గోల్కొండ పై బీజేపీ జెండా ఎగరేస్తామన్న ప్రకటనపై చాలామంది ఆశ్చర్యపోతున్నారు. ఇపుడు చేస్తున్న హడావుడి వల్ల, గట్టి అభ్యర్ధులను పోటీలోకి దింపితే, కేసీయార్ వ్యతిరేకతలో బీజేపీ వచ్చే ఎన్నికలో ఓ ఐదారు నియోజకవర్గాల్లో గెలిస్తే గెలవచ్చనే టాక్ జనాల్లో నడుస్తోంది.

జనాల్లోని టాక్ మాత్రమే వాస్తవానికి దగ్గరగా ఉందని అర్దమవుతోంది. ఇంతోటిదానికి బండి ఏకంగా అధికారంలోకి వచ్చేస్తామని చెప్పటం మాత్రం ఓవర్ యాక్షన్ లాగే ఉంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కూడా ఆమధ్య మాట్లాడుతు 72 సీట్లలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని ప్రకటించారు. సరే రేవంత్ చెప్పినట్లు అధికారంలోకి వచ్చినా రాకపోయినా ప్రకటనపై ఎవ్వరు నవ్వుకోలేదు. ఎందుకంటే అధికారంలోకి రావటానికి అవకాశముంది.

ప్రతి గ్రామంలో పార్టీ యంత్రాగముంది. నేతలున్నారు. కాకపోతే అందరిని కలిపి ఏకతాటిపై నడిపించే నాయకుడే పార్టీకి లేకుండాపోయారు. అందుకనే దెబ్బపడుతోంది. రేవంత్ నాయకత్వంలో గనుక స్ధానిక నేతలను, నియోజకవర్గస్ధాయి నేతలను గనుక ఏకతాటిపై నడిపించగలిగితే  మంచి ఫలితాలు సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మరి బీజేపీకి కార్యకర్తలు లేరు నేతలూ లేరు. అయినా అధికారంలోకి వచ్చేస్తామంటే ఎలా బండి ?
Tags:    

Similar News