పోలవరానికి వినాయక్ - యుద్ధం వస్తే ప్రభాస్

Update: 2017-09-20 19:03 GMT
చంద్రబాబు నాయుడు ప్రభుత్వం రాజధాని అమరావతి నిర్మాణానికి డిజైన్లను ఓ.కే. చేయడానికి, డిజైన్లలో అవసరమైన మార్పులు చేర్పులు సూచించడానికి సినిమా దర్శకుడు రాజమౌళి ని సంప్రదించడం అనే వ్యవహారం నెటిజన్లలో అభాసుపాలవుతోంది. విపరీతంగా నెటిజన్లు జోకులు మీద జోకులు పేలుస్తున్నారు. అమరావతి నగరాన్ని నిర్మించడానికి బహుబలి దర్శకుడు సూటబుల్ వ్యక్తి అయ్యేటట్లయితే గనక ఇప్పటికే పనులు సరిగా సాగకుండా కుంటుతూ సాగుతున్న పోలవరం పనులని దర్శకుడు వి.వి. వినాయక్ కు అప్పగిస్తే మంచిదని నెట్లో ఒక పోస్ట్ హల్ చల్ చేస్తున్నది. పైగా పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణం లో వి.వి. వినాయక్ కి చాల అనుభవం వుందని ఈ పోస్ట్ లో  ప్రత్యేకంగా పేర్కొంటున్నారు. బన్ని సినిమాలో పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి చూపించాడని కాబటి ఈ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని వినాయక్ కి అప్పగిస్తే గనక ఖచ్చితంగా చాల వేగంగా దాని పూర్తి చేస్తాడని అనేక జోకులు చంద్రబాబు మీద రువ్వుతున్నారు.

అలాగే ఆర్కిటెక్ట్ వర్గాల నుండి మరో జోక్ చంద్రబాబు మీద వినిపిస్తుంది. అదేంటంటే రాజధాని నగరం నిర్మాణం కోసం దర్శకుడు రాజమౌళిని సంప్రదించారు కదా ఒకవేళ యుద్ధం వస్తే బాహుబలి హీరో ప్రభాస్ ని సంప్రదిస్తారా అని  ఆర్కిటెక్ట్ లు నిలదీస్తున్నారు. అర్ధం పర్ధం లేకుండా వచ్చిన ప్రతి డిజైన్ ను తిరస్కరించడం అవమానకరమని ఒక వైపు ఆర్కిటెక్ట్ లు భావిస్తుంటే ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన వాళ్ళు చేసిన డిజైన్ లను తీసుకెళ్ళి ఒక సినిమా దర్శకుడి సలహా అడగడం అనేది మరీ ఘోరం గా వుందనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి.

ఈ రకంగా గమనించి నప్పుడు సోషల్ మీడియా మాత్రం చంద్రబాబు చేతలను ఏ మాత్రం ఉపేక్షించడం లేదని మనకి అర్ధం అవుతుంది. చంద్రబాబు తరపున మంత్రి నారాయణ, సి ఆర్ డి ఎ అధికారి శ్రీధర్ వెళ్లి రాజమౌళి తో భేటి కావడం ఒక్కటే ఇప్పటి వరకు జరిగింది.తాజా వార్తలను చూస్తే రాజమౌళిని లండన్ తీసుకెళ్ళి నార్మన్ అండ్ ఫోస్టర్స్ సంస్థ తో సమావేశం ఏర్పాటు చేయాలని కూడా ప్రభుత్వం భావిస్తున్నది.  

బాహుబలి చిత్రం తీసిన రాజమౌళి కి అందరు అభినందించి తీరాలి. కాని ఒక సినిమా  కోసం కథా పరంగా తనకు కావలసినట్టుగా ఆర్ట్ డైరెక్టర్ సూచనలతో సెట్స్ నిర్మించిన రాజమౌళికి ఏకంగా నూతన రాష్ట్ర రాజధాని నిర్మించడానికి సంప్రదించడం కొంత వింతగానే వుందని అనుకుంటున్నారు.  ఇక ఆర్కిటెక్ట్ లు సినిమా సెట్టింగ్ లు వేసి తమ ప్రతిభను చాటుకోవలేమో నని నెటిజన్లు నవ్వుకుంటున్నారు. అంతే కాకుండా రైతు సమస్యలైతే ఖైది నెం.150హీరోతో, సిబిఐ కేసులైతే స్పైడర్ హీరోతో  చంద్రబాబు నాయుడు సంప్రదిస్తారేమో నని జోకులు వేసుకుంటున్నారు.
Tags:    

Similar News