కుల నాయకులు చెప్తే కులాల ఓట్లు వెల్లువేనా?

Update: 2017-10-30 04:35 GMT
కులనాయకుడు చెబితే.. ఆ కులం వాళ్లందరూ మూకుమ్మడిగా ఓట్లు వేస్తారా? ఇది సాధ్యమేనా? అనే చర్చ ఇప్పుడు ప్రధానంగా జరుగుతోంది. ఇదేమీ మన తెలుగురాష్ట్రాల రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన చర్చ కాదు గానీ.. ప్రస్తుతం దేశం దృష్టిని మొత్తం ఆకర్షిస్తూ హాట్ హాట్ గా జరుగుతున్న గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కులాల గురించి ఎక్కువ చర్చ జరుగుతోంది. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా కులాల్ని మాత్రమే నమ్ముకున్నది. బలమైన కులాల దన్ను ఉంటే చాలు.. 20 ఏళ్లుగా ఆ రాష్ట్రంలో అప్రతిహతంగా సాగుతున్న కమలదళం హవాకు చెక్ పెట్టవచ్చుననేది వారి కోరిక. అయితే అందుకోసం ఆయా కులాల ఆదరణ సంపాదించడానికి నిర్దిష్టమైన హామీలు ఏమీ ఇవ్వకుండానే.. కేవలం కుల నాయకుల్ని తమ పార్టీలో చేర్చుకుంటే చాలునని వారు ప్లాన్ చేస్తున్నారు. అందుకే కేవలం కుల నాయకుల్ని చేర్చుకున్నంత మాత్రాన ఆయా కులాలు.. మూకుమ్మడిగా ఓట్లు సమర్పించుకుంటాయా అనే చర్చ ఇప్పుడు నడుస్తోంది.

కాంగ్రెస్ నమ్ముతున్న సిద్ధాంతం గనుక నిజమైతే.. చాలా రాష్ట్రాల్లో కేవలం కొన్ని కులాలు మాత్రమే శాశ్వతంగా అధికార పీఠం పై తిష్టవేసే పరిస్థితి ఏర్పడుతుండేది. కుల నాయకులు కులం కోసం పోరాడినంతకాలమూ వారికి కులం మద్దతు ఉంటుంది గానీ.. కులాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు ప్రారంభిస్తే అదే కులాల్లో వారిని అసహ్యించుకునే వారూ తయారవుతారు. ప్రాక్టికల్ గా ఉండగల ఈ పరిస్థితుల్ని పక్కన పెడితే.. కేవలం కులాల నాయకుల మీద ఆధారపడి కాంగ్రెస్ సాగిస్తున్న వ్యూహరచన గుజరాత్ లో పెద్దగా ఫలితమిచ్చే అవకాశమూ కనిపించడం లేదు.

నిజానికి ఈ కుల నాయకుల చేరికల వల్ల.. అప్పుడే కాంగ్రెస్ కు కొన్ని చికాకులు కూడా మొదలవుతున్నాయి. కాంగ్రెస్ అక్కడ పటేళ్లకు రిజర్వేషన్లు కోరుతున్న హార్దిక్ ను - వ్యతిరేకిస్తున ఠాకోర్ ను కూడా తమలో చేర్చుకున్నారు. అయితే తమ తమ డిమాండ్ల విషయంలో పార్టీ వైఖరి ఏమిటో ముందుగా స్పష్టం చేసాకే తమ మద్దతు తేలుతుందని వారు హెచ్చరిస్తున్నారు. హార్దిక్ పటేల్ అయితే.. భాజపాను పెద్ద దొంగతో పోలుస్తూ - చిన్న దొంగ కాంగ్రెస్ మేలు కదా అంటున్నారే తప్ప.. కాంగ్రెస్ న్యాయం చేస్తుందనే అభిప్రాయం, ఆ పార్టీ మంచిదనే అభిప్రాయం చెప్పడం లేదు. ఇలాంటి ప్రచారాలతో ఆ పార్టీకి నిజంగానే లాభం జరుగుతుందా? లేదా, కొత్త వ్యూహాల ఉచ్చులో చిక్కుకుని మరో మారు ఓటమి చవిచూస్తుందా? అనేది అర్థం కావడం లేదు.
Tags:    

Similar News