కేసుల్లో తెలంగాణ‌, ఏపీ పోటాపోటీ: ‌తాజాగా 199 పాజిటివ్‌

Update: 2020-06-07 11:30 GMT
తెలుగు రాష్ట్రాలు మ‌హ‌మ్మారి వైర‌స్ విష‌యంలో పోటీ ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తున్నాయి. గ‌తంలో వెయ్యిలోపు కేసులున్న స‌మ‌యంలో తెలంగాణ‌, ఆంధ్రప్రదేశ్‌లో కేసులు కొద్ది తేడాలో ఉన్నాయి. ఆ తర్వాత తెలంగాణ‌లో కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌గా ఏపీలో క్ర‌మంగా భారీగా కేసులు న‌మోద‌వుతున్నాయి. ఇప్పుడు తాజాగా మ‌ళ్లీ తెలంగాణ‌లో కేసుల ఉధృతి పెరుగుతున్నాయి. ఈక్ర‌మంలోనే శ‌నివారం ఒక్క‌రోజే 206 కేసులు న‌మోదైన విష‌యం తెలిసిందే. దీనికి పోటీగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కూడా కేసులు పెరుగుతున్నాయి. ఎప్పుడూ లేనివిధంగా రికార్డ్ స్థాయిలో ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో ఒక్క‌రోజే 199 కేసులు న‌మోద‌య్యాయి.

ఆ వైర‌స్ నియంత్రణకు ప్రభుత్వం అన్ని రకాలుగా ప్రయత్నాలు చేస్తున్న‌ప్పటికీ కేసుల ఉధృతి తగ్గట్లేదు. తాజాగా ఆంధ్ర‌ప్రదే‌శ్‌లో కొత్తగా 199 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయని వైద్యారోగ్య శాఖ ఆదివారం ప్ర‌క‌టించింది. ఈ కొత్త కేసులతో కలిపి ఏపీలో మొత్తం కేసులు 3,718కు చేరుకున్నాయి. ఇవాళ మొత్తం 17,695 శాంపిల్స్‌ను పరీక్షించారు.

కొత్తగా నమోదైన కేసుల్లో ఏపీకి చెందిన వారు 130 మంది ఉండ‌గా, ఇతర ప్రదేశాల నుంచి వచ్చిన వారు 69 మంది ఉన్నారు. తాజాగా ఇద్దరు ఆ వైర‌స్ బారిన ప‌డి మృతి చెందారు. కృష్ణా జిల్లాలో ఒకరు, కర్నూలు ఒకరు మ‌ర‌ణించారు. వీటితో క‌లిపి ఇప్పటివరకు వైర‌స్‌తో 75 మంది మృతి చెందారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 1,290 ఉన్నాయి. ఇప్పటివరకూ డిశ్చార్జ‌యిన వారి సంఖ్య 2,353.

Tags:    

Similar News