నవ్యాంధ్రకు కొత్త గవర్నరు?

Update: 2017-02-04 17:31 GMT
తెలుగు రాష్ట్రాలకు గవర్నర్‌ గా వ్యవహరిస్తున్న ఇఎస్‌ఎల్‌ నరసింహన్‌ ఏదో ఒక రాష్ట్రానికకే పరిమితం చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో కొత్తగా వచ్చే గవర్నర్‌ బస చేసేందుకు వీలుగా నివాసాన్ని అన్వేషించే పనిలో ఏపీ ప్రభుత్వం నిమగ్నమైంది.  ఈ ఏడాది జూన్‌ లో  ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి కొత్త గవర్నర్‌ వస్తున్నారన్న సమాచారాన్ని అందుకున్న అధికారులు విజయవాడ - గుంటూరు పట్టణాల మధ్య గవర్నర్‌ నివాసముండేందుకు యోగ్యమైన భవనాన్ని వెతుకుతున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసం ఉంటున్న కరకట్ట ప్రాంతం సమీపంలోనే ఓ మంచి భవనాన్ని ఎంపిక చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఒకవేళ అది సాధ్యం కాకపోతే నాగార్జున విశ్వవిద్యాలయంలో అతిథి గృహాన్ని గవర్నర్‌ బసకు తాత్కాలికంగా ఎంపికచేసి ఆ తర్వాత మరో భవనాన్ని ఖరారు చేయాలని భావిస్తున్నట్టు సమాచారం. నాగార్జున విశ్వవిద్యాలయం అతిథి గృహం ఎంపికపై ఇబ్బందులు తలెత్తితే విజయవాడ నగరానికి సమీపంలో ఉన్న కేఎల్‌ విశ్వవిద్యాలయం లేదా మరో భవనాన్ని పరిశీలించి ఒక నిర్ణయానికి రావాలని ప్రతిపాదించారు.     

ఎలాగూ వచ్చే రెండేళ్ళ వ్యవధిలో హైకోర్టు - అసెంబ్లి - శాసనమండలి భవనాలతో పాటు గవర్నర్‌ నివాసముండేందుకు  రాజ్‌ భవన్‌ ను నిర్మించాలని ప్రభుత్వం ఇప్పటికే ప్రణాళికలు రూపొందించింది. ఆగస్టు మొదటి వారంలో ఈ భవనాల నిర్మాణానికి భూమి పూజ చేసి నిర్మాణ పనులను చేపట్టాలని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆదేశించారు కూడా. రాజ్‌ భవన్‌ నిర్మాణానికి ఇప్పటికే ప్రభుత్వం డిజైన్లను రూపొందించి వాటి ఆమోదానికి ప్రయత్నాలను ముమ్మరం చేసింది. రాజ్‌ భవన్‌ లో గవర్నర్‌ బస చేసేందుకు వీలుగా భవనాలు నిర్మించాలని ఇందులోనే రాష్ట్రపతి - ప్రధాని - కేంద్ర మంత్రులు పర్యటనలకు వచ్చేందుకు ఉండేందుకు వీలుగా ఆరేడు వసతి గృహాలను కూడా నిర్మించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. రాజధాని మాస్టర్‌ ప్లాన్‌లో రాజ్‌ భవన్‌ కు పెద్దఎత్తున భూమిని కేటాయించిన సంగతి తెలిసిందే.     

జూన్‌ నెలలో కొత్త గవర్నర్‌ రాష్ట్రానికి నియమితులయ్యే అవకాశం ఉన్నందున ఏప్రిల్‌ చివరిలోపే భవనాన్ని ఎంపికచేసి అవసరమైన మరమ్మతు పనులను ప్రారంభించాలని నిర్ణయించారు. కనీసం 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో గవర్నర్‌ నివాసం రాజ్‌భవన్‌ ఉండేలా చూడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. కనీసం ఐదు పడక గదులు, సమావేశం నిర్వహించుకునేందుకు పెద్ద హాలు, అతిథులు వచ్చినపుడు వారితో సంప్రదింపులు జరిపేందుకు లాంజ్‌, గవర్నర్‌ ముఖ్య కార్యదర్శికి ప్రత్యేక కార్యాలయం, ఏడిసి ఉండేందుకు నివాసం, కార్యాలయం, రాజ్‌భవన్‌లో పనిచేసే అధికారులు, ఉద్యోగులకు ప్రత్యేకంగా కార్యాలయాలను కూడా ఒకే దగ్గర ఉండేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే అధికారులను ఆదేశించింది.  అయితే.. గవర్నరుగా నరసింహనే కొనసాగుతారా.. లేదంటే ఆయన తెలంగాణకు పరిమితమై కొత్తవారు వస్తారా అన్నది వేచి చూడాల్సిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News