హెచ్‌1బీ షాక్‌ మ‌న‌కు లాభ‌మేన‌ట‌!

Update: 2017-04-06 05:16 GMT
ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్లకు హెచ్-1బీ వీసాలను నిరాకరిస్తూ ట్రంప్ సర్కార్ తాజాగా జారీ చేసిన ఉత్తర్వులు... భారతీయ ఐటీ నిపుణుల అవకాశాలను తగ్గించకపోగా మరింత పెంచుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. హెచ్-1బీ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న భారతీయ ఐటీ నిపుణుల్లో ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ల సంఖ్య చాలా తక్కువగా ఉండటమే దీనికి కారణం. 2014 - 2015ల్లో హెచ్-1బీ వీసాకు అర్హత సాధించిన వృత్తినిపుణుల్లో కంప్యూటర్ ప్రోగ్రామర్లు 12 శాతం మాత్రమే ఉన్నారని రికార్డులు వెల్లడిస్తున్నాయి. మనదేశంలోని ఐటీరంగ వేదిక నాస్కామ్... తమ సభ్యుల్లో అనేకమంది ఉన్నతస్థాయి వృత్తుల కోసం అమెరికా వీసాలకు దరఖాస్తు చేసుకున్నారని తెలిపింది. అమెరికాకు వెళ్లాలనుకునే భారతీయ ఐటీ నిపుణుల్లో... ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకుంటున్న వారి సంఖ్య తక్కువగా ఉండటమేగాక అది క్రమంగా మరింత తగ్గుతున్నది. చాలామంది సిస్టమ్ ఎనలిస్ట్ - సాఫ్ట్‌ వేర్ డెవలపర్ - నెట్‌ వర్క్ అడ్మినిస్ట్రేటర్ వంటి ఉన్నతస్థాయి ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. కాబట్టి హెచ్-1బీ వీసాల జారీలో ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్లను పక్కనబెడుతూ ట్రంప్ ప్రభుత్వం తాజాగా తీసుకొచ్చిన ఉత్తర్వులతో భారతీయులకు నష్టం జరుగకపోగా లాభమే కలిగే అవకాశం ఉంది. ఉన్నతస్థాయి ఐటీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే వారికి మరిన్ని అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు.

ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగాల్లో విదేశాలకు చెందిన వ్యక్తులను నియమించుకోవటానికి అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ వీసాలను చాలాకాలంగా మంజూరు చేస్తున్నది. వీటిని భారతీయ ఐటీ కంపెనీలు అత్యధికంగా ఉపయోగించుకుంటున్నాయి. తమ వినియోగదారులకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పని చేయటం కోసం దీర్ఘకాలంపాటు అమెరికాలో పని చేయటానికి ఈ వీసాపైనే తమ ఉద్యోగులను అమెరికాకు పంపిస్తున్నాయి. అయితే, ప్రారంభస్థాయి కంప్యూటర్ ప్రోగ్రామర్ ఉద్యోగాలను ప్రత్యేక నైపుణ్యం ఉన్న ఉద్యోగాలుగా గుర్తించలేమని పేర్కొంటూ అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐసీ) మార్చి 31న కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. కంప్యూటర్ ప్రోగ్రామింగ్‌ లో హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునే కంపెనీలు ఇకమీదట.. సదరు ఉద్యోగాలకు సంక్లిష్టమైన, ప్రత్యేకమైన నైపుణ్యాలు అవసరమని, ప్రొఫెషనల్ కోర్సులు చేసిన వారు అవసరమని నిరూపించాల్సి ఉంటుందని తెలిపింది. మరోవైపు, హెచ్-1బీ వీసాల ప్రక్రియను దుర్వినియోగం చేస్తూ అమెరికాలో స్థానికుల పట్ల వివక్ష చూపే కంపెనీలపై చర్యలు తీసుకుంటామని అమెరికా కార్మికశాఖ హెచ్చరించింది. అక్టోబర్ 1తో మొదలయ్యే అమెరికా నూతన ఆర్థికసంవత్సరానికి కొత్తగా హెచ్-1బీ వీసాలను ఆమోదించే ప్రక్రియ ప్రారంభమైనందున ప్రభుత్వం ఈ హెచ్చరికలను జారీ చేస్తున్నది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News