వివేకా హత్య కేసులో కొత్త పేరు తెరపైకి.. ఎవరతనంటే?

Update: 2021-09-07 09:30 GMT
వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణ సుధీర్ఘంగా సాగుతోంది. సీబీఐ అధికారులు తమకు అనుమానమున్న ప్రతిఒక్కిరనీ విచారిస్తూ అసలు విషయాన్ని రాబట్టడానికి యత్నిస్తున్నారు. అయితే ఎంతకాలం ఈ విచారణ ఉంటుందో తెలియదు. కానీ విచారణలో మాత్రం కొత్త కొత్త పేర్లు బయటికి వస్తున్నాయి. మొన్నటి వరకు వాచ్ మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిల పేర్లు వినిపించగా.. తాజాగా కృష్ణమాచారి పేరు బయటికి వచ్చింది. కొద్దిరోజులుగా కృష్ణమాచారిని సీబీఐ అధికారులు విచారిస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు కృష్ణమాచారి ఎవరు..? అన్న సందేహం చాలా మందిలో వస్తోంది..

వైఎస్ వివేకానందను వేటకొడవళ్లతో నరికి చంపారని ఇటీవల సీబీఐ అధికారుల విచారణలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో వేటకొడవళ్లను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఆ వేట కొడవళ్లు నిందితులకు ఎక్కడి నుంచి వచ్చాయి..? వాటిని ఎక్కడ కొనుగోలు చేశారు..? అనే విషయాన్ని లోతుగా పరిశీలించారు. అయితే నిందితులు వాడిన ఆయుధాలను కృష్ణమాచారి షాపులో కొన్నట్లు అనుమానాలున్నాయి. అందుకే ఆయనను విచారించారు. కృష్ణమాచారి సొంతూరు కడపజిల్లా కదిరి. ఆయనకు హార్డ్ వేర్ దుకాణం ఉంది. ప్రస్తుతం ఆయనను సీబీఐ అధికారులు విచారించడంతో ఆయన దుకాణంలోనే ఆయుధాలు కొనుగోలు చేశారా..? అన్న అనుమానాలు వస్తున్నాయి.

అయితే కచ్చితమైన వివరాల కోసం ఆయన వాంగ్మూలం తీసుకున్నట్లు తెలుస్తోంది. తమకు నమ్మకం కలిగిన తర్వాతే ఈ వాంగ్మూలాన్ని కోర్టులో అందించినున్నట్లు సమాచారం.సీబీఐ అధికారులు వైఎస్ వివేకా హత్య కేసును చాలా రోజులుగా విచారిస్తున్నారు. వీరి విచారణ ప్రారంభమై ఇప్పటికీ మూడు నెలలు గడిచింది. ఇంకా కేసు కొలిక్కి రాలేదు. ఇప్పటి వరకు వాచ్ మెన్ రంగయ్య, మాజీ డ్రైవర్ దస్తగిరిలను విచారించి వారి వాంగ్మూలాన్ని నమోదు చేసుకున్నారు. ఒక్క సునీల్ యాదవ్ ను మాత్రమే అరెస్టు చేశారు. ఆయనకు నార్కో టెస్ట్ చేద్దామనుకున్నారు. కానీ సాధ్యం కావడం లేదు. ఈమేరకు సీబీఐ వేసిన పిటిషన్ ను కోర్టు తిరస్కరించింది.

మరోవైపు సీబీఐ విచారణపై పలు విమర్శలు వస్తున్నాయి. సుధీర్ఘంగా విచారణ చేపట్టడంతో విచారణ ఎప్పటికి ముగుస్తుందో స్పష్టత లేదని పలువురు పేర్కొంటున్నారు. ఇప్పటికే వైఎస్ వివేకానంద కూతురు సునీత సీబీఐపై కూడా నమ్మకం పోతుందని ఆరోపించిన విషయం తెలిసింది. మరోవైపు జగన్ మేనమాన, కమలాపూర్ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి సైతం సీబీఐ విచారణపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వివేకా హత్యకు టీడీపీనే కారణమంటూ పి. రవీంద్రనాథథ్ రెడ్డి కూడా ఆరోపించడం సంచలనం రేపింది. అంతేకాకుండా ఈయన వ్యాఖ్యలను వైసీపీ నేతలు ఫాలో అయ్యారు.

అయితే రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపణలకు గల కారణాలను విశ్లేషించేందుకే ఆయనను సీబీఐ విచారించినట్లు తెలుస్తోంది. హత్యకు టీడీపీ కారణం అనడానికి మీ దగ్గర ఏమైనా ఆధారాలున్నాయా.. అని రవీంద్రనాథ్ రెడ్డిని ప్రశ్నించినట్లు సమాచారం. వివేకా హత్య జరిగి రెండేళ్లకు పైగా అవుతోంది. ఇంకా మాకు దోషులెవరో తెలియడం లేదు. ఇది చాలా అవమానకరంగా ఉంది. ఇప్పటికైనా దోషులను త్వరగా తేల్చండి అని సీబీఐని కోరినట్లు రవీంద్రనాథ్ రెడ్డి మీడియాకు తెలిపారు.

సీబీఐ అధికారులు మాత్రం అసలు దోషులను పట్టుకునేందుకు సుధీర్ఘ విచారణ అవసరమని అంటున్నారు. అయితే ఒకే వ్యక్తికి పలు మార్లు పిలిచి విచారణ చేపట్టడంపై కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏ కేసునైనా దర్యాప్తు వెంటనే పూర్తి చేసేందుకే ఈ కేసును సీబీఐకి అప్పగించారు. అయినా సంబంధిత అధికారులు కడప జైలు గెస్ట్ హౌస్, పులివెందుల గెస్ట్ హౌస్ ల చుట్టే తిరుగుతున్నారు. ఇప్పటికైనా ఈ కేసు విచారణను త్వరగా పూర్తి చేయాలని కోరుతున్నారు.


Tags:    

Similar News