రెండు కోట్ల టార్గెట్...వైసీపీ ధీమా...?

Update: 2022-04-05 14:30 GMT
ఏపీలో రాజకీయ వేడి మెల్లగా వ్యాపించింది. వారూ వీరూ అంతా కలసి హడావుడి చేస్తున్నారు. విపక్షాలు అయితే చాలా కాలం నుంచే సౌండ్ చేస్తున్నా ఇపుడు అధికార పార్టీ వైసీపీలో వేడి పుట్టడమే విశేషంగా చూడాలి. వచ్చే ఎన్నికల్లో మరోమారు గెలవాలి అన్నదే ఆ పార్టీ గట్టి పట్టుదల. ఈసారి కనుక గెలిస్తే ఏపీ పొలిటికల్ సినేరియా నుంచి టీడీపీ పూర్తిగా కనుమరుగు అవుతుంది అన్నదే వ్యూహం.

అపుడు తాము కోరుకున్నట్లుగా మూడు దశాబ్దాల పాటు అధికారం చేతుల్లో ఉంటుంది అని ఆలోచిస్తోంది. ఇక వైసీపీ దానికి తగినట్లుగా తనదైన వ్యూహాలను రెడీ చేసుకుంటోంది. ఏపీలో వైసీపీతో ఢీ కొట్టే పార్టీ అయితే టీడీపీ అనే చెప్పాలి. టీడీపీ నుంచి ప్రధాన సామాజిక వర్గాలను లాగేయాలన్నదే వైసీపీ మాస్టర్ ప్లాన్.

ఇప్పటికే దశాబ్దాలుగా ఉన్న బీసీలను తమ వైపు తిప్పుకున్న వైసీపీ వారి ఓటు బ్యాంక్ సుస్థిరం చేసుకోవాలని పట్టుదలగా ఉంది. అందుకోసం మంత్రివర్గంలో బీసీలకు పెద్ద పీట వేయడానికి రంగం సిద్ధం చేస్తోంది. ఇక కాంగ్రెస్ సంప్రదాయ ఓటు బ్యాంక్ అయిన ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలను వైసీపీ ఏనాడో తమ సొంతం చేసుకుంది.

వీటితో పాటు కులమతాలు ప్రసక్తి లేకుండా కోటిన్నర కుటుంబాల దాకా సంక్షేమ పధకాలను గత మూడేళ్ళుగా పెద్ద ఎత్తున  అమలు చేస్తున్నామని ఆ పార్టీ చెప్పుకుంటోంది. ఆ ఓటు బ్యాంక్ అంతా తమకే అన్ని ఆశిస్తోంది. గత ఎన్నికల్లో చూసుకుంటే వైసీపీకి 151 సీట్లు, 49.95 శాతం ఓట్ల షేర్ దక్కింది. అదే టైమ్ లో టీడీపీకి 23 సీట్లు, 39.18 ఓటు షేర్ దక్కింది.

ఇక మొత్తం పోల్ అయిన  3,13,33,631 ఓట్లలో వైసీపీకి వచ్చిన ఓట్లు లెక్క తీస్తే ఒక కోటీ 56 లక్షల 83 వేల 592 గా లెక్క తేలింది. టీడీపీ విషయానికి వస్తే ఒక కోటీ 23 వేల ఒక వేయి 741 ఓట్లు పడ్డాయి. నాడు ఏపీలో మూడు కోట్లకు అటు ఇటుగా ఓటర్లు ఓటు చేస్తే ఈ రెండు ప్రధాన పార్టీలకు వచ్చిన ఓట్లు ఇవి.

ఇపుడు ఏపీలో జనాభా నాలుగు కోట్ల. 96 లక్షల దాకా ఉన్నారు. ఇందులో నుంచి చూసుకుంటే ఓటర్లు ఈ రోజుకు  దాదాపుగా 4 కోట్ల  ఏడు లక్షల  మంది ఉన్నారు. 2024 నాటికి ఈ సంఖ్య ఇంకా పెరగవచ్చు. దీనిలో మహిళా ఓటర్లు 2 కోట్ల అయిదు లక్షలుగా పేర్కొన్నారు. ఇక వచ్చే ఎన్నికల వేళకు రెండు కోట్ల ఓట్లను టార్గెట్ చేస్తోంది వైసీపీ.

ఇక  సంక్షేమ  పధకాలు  అందుకున్న వారు మూడున్నర  కోట్ల మంది ఉన్నారని, వీరిలో కనీసంగా సగం మంది తమ వైపునకు వచ్చినా సులువుగా కోటిన్నరకు పైగా  ఓట్లు వస్తాయని భావిస్తోంది. అలాగే, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, మహిళలతో   సోషల్ ఇంజనీరింగ్ ని సక్సెస్ ఫుల్ గా మరో మారు అమలు చేస్తే రెండు కోట్ల ఓట్లను ఈజీగా తెచ్చుకోగలమని చూస్తోంది.

మరో వైపు చూస్తే టీడీపీకి గతంలో వచ్చిన  ఒక కోటీ 23 వేల ఒక వేయి 741 ఓట్లు ఏ మాత్రం పెరిగినా జనసేన వంటి పార్టీలకు నాడు వచ్చిన 22 లక్షల ఓట్లు కలసినా కూడా విజయం తమ వైపునకు ఉండేలా వైసీపీ వ్యూహ రచన చేస్తోంది.

అందుకే ఎవరేమంటున్నా సంక్షేమ పధాన్ని వీడడంలేదు, వెల్ఫేర్ రధం పరుగులు ఆపడంలేదు. మరి ఇదంతా వైసీపీ అధినాయకత్వం  ధీమాగా ఉంది. ఈ మధ్యలో ఎన్ని విమర్శలు సొంత పార్టీలో బయట పార్టీల నుంచి వచ్చినా రెండు కోట్ల టార్గెట్ ను ఫిక్స్ చేసుకుని మరీ సాగిపోతోంది. చూడాలి  మరి ఏం జరుగుతుందో.
Tags:    

Similar News