ఈసారి డ్రగ్స్ కేసు విషయంలో కేసీఆర్ సీరియస్ గా ఉన్నాడా?

Update: 2022-04-10 00:30 GMT
తెలంగాణ రాజధాని హైదరాబాద్ డ్రగ్స్ కు అడ్డాగా మారుతోందని ఓ వైపు ప్రతిపక్షాలన్నీ గొంతు చించుకుంటున్నాయి. మరోవైపు హైదరాబాద్ లోని పబ్ లలో డ్రగ్స్ బయటపడుతున్నాయి. అందులో సెలబ్రెటీల పిల్లలు పాల్గొనడంతో ఈ కేసు హైప్రొఫైల్ గా మారింది. డ్రగ్స్ హైదరాబాద్ లో విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్న అపవాదు ఉంది. ప్రభుత్వం నుంచి ముప్పేటగా వస్తున్న విమర్శలతో కేసీఆర్ అలెర్ట్ అయ్యారు. ఈ సారి డ్రగ్స్ కేసును సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.

ఇప్పటికే ఒకసారి టాలీవుడ్ ప్రముఖులు డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొన్నారు. కానీ ఆ కేసును సినీ ప్రముఖుల ఒత్తిడితో టీఆర్ఎస్ ప్రభుత్వం నీరుగార్చిందన్న ఆరోపణలున్నాయి. అందుకే ఈసారి డ్రగ్స్ కేసును కాస్త సీరియస్ గా తీసుకున్నట్టుగా తెలుస్తోంది.

తాజాగా తెలంగాణలో గంజాయి, మాదక ద్రవ్యాలను నిరోధించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కార్ ముందుకెళుతోంది. ఈ మేరకు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీలక ప్రకటన చేశారు. డ్రగ్స్ ను తెలంగాణలో కూకటివేళ్లతో పెకిలించేందుకు కేసీఆర్ ఆదేశాలిచ్చారని చెప్పారు. కూకటివేళ్లతో డ్రగ్స్ ను అరికడుతామన్నారు. నగరంలోని పబ్ యజమానులతో శ్రీనివాస్ గౌడ్ సమీక్షించి ఈ విషయం తేల్చారు. పబ్ లలో డ్రగ్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించవద్దని.. ఈ విషయంలో పాటించాల్సిన నియమనిబంధనలపై యజమానులతో మంత్రి శ్రీనివాస గౌడ్ చర్చించారు.

అధికారంలోకి వచ్చాక మొదట కేసీఆర్ పేకాట క్లబ్ ల పనిపట్టాడు.  ఆ తర్వాత గుడుంబా అంతు చూశాడు. ఇప్పుడు తెలంగాణను పట్టి పీడిస్తున్న డ్రగ్స్ ను సీరియస్ గా తీసుకున్నట్టు తెలుస్తోంది.  పక్కా ప్రణాళికతో పబ్ లలో డ్రగ్స్ లేకుండా చేసి అవసరమైతే పీడీ చట్టం అమలు కు కేసీఆర్ ఆదేశాలిచ్చినట్టు తెలుస్తోంది.

తెలంగాణకు చెడ్డ పేరు వస్తున్న డ్రగ్స్ విషయంలో ఇక ఎంతమాత్రం ఊపేక్షించవద్దని కేసీఆర్ డిసైడ్ అయినట్టుగా సమాచారం. ఈ క్రమంలోనే పబ్ లలో దొరికితే ఇక సీజ్ చేయడానికి కూడా వెనుకాడమని మంత్రి శ్రీనివాసగౌడ్ తెలిపారు.

యావత్ తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్ లోని పుడింగ్ అండ్ మింక్ పబ్ కేసు వెలుగుచూడడంతో కేసీఆర్ సర్కార్ అలెర్ట్ అవుతోంది. ఈ డ్రగ్స్ కేసులో పోలీసులు నిజాలు బయటకు తీస్తున్నారు. పబ్ సీసీ ఫుటేజీ ఆధారంగా డ్రగ్ పెడ్లర్స్ ను పోలీసులు గుర్తించారు. అనుమానితులను గుర్తించిన పోలీసులు  విచారణ జరుపుతున్నారు. పబ్ కు వచ్చిన వ్యక్తుల్లో ముగ్గురిపై డ్రగ్స్ కేసులు ఉన్నాయి. ఇప్పటికే మేనేజర్ అనిల్ , ఓనర్ అభిషేక్ రిమాండ్ లో ఉన్నారు. ఈ కేసు తెలంగాణలో సంచలనం రేపడంతో ఇప్పుడు డ్రగ్స్ అరికట్టేందుకు కేసీఆర్ సర్కార్ సీరియస్ గా ముందుకెళుతోంది.
Tags:    

Similar News