ఆయనది ప్రపంచ బాధ : భీమవరానికి దారేదీ రాజా...?

Update: 2022-07-01 12:33 GMT
ఆయన లోకల్ ఎంపీ,  పవర్ ఫుల్ గా దర్జా వెలగబెట్టాల్సిన ఎంపీ. కానీ అధినాయకత్వంతో పేచీ పెట్టుకున్నారు. సరే తప్పు ఎవరిది. ఎక్కడ ఏమి జరిగింది అన్న చర్చలను పక్కన పెడితే  ప్రస్తుతం తనను గెలిపించిన నర్సాపురం లోక్ సభ నియోజకవర్గానికి రాజు గారు రావాలనుకుంటున్నారు. గట్టిగా మాట్లాడితే ఆయన సొంత గడ్డకు వచ్చి రెండేళ్ళు పై దాటుతోంది. ఢిల్లీలో రచ్చబండ్ ప్రెస్ మీటింగులతోనే ఆయనకు ఫుల్ టైమ్  సరిపోతోంది.

అక్కడ వైసీపీ సర్కార్ ని చీల్చిచెండాడుతూ ఇలాగే పుణ్యకాలం గడిపేయవచ్చు అని భావించిన రఘురామకు ఇపుడు మా చెడ్డ చిక్కొచ్చిపడింది. ఆయన మనసులో ఆరాధించే నాయకుడు, దేశానికి ప్రధాని అయిన నరేంద్రమోడీ ఏకంగా తన సొంత నియోజకవర్గానికి వస్తున్నారు. ఆ సమయంలో లోకల్ ఎంపీగా తాను పక్కనుంటే ఆ పొలిటికల్ వాల్యూయే వేరు. ఆ హోదాయే వేరు. ఇక అక్కడ జరిగే కార్యక్రమం ఏమైనా ఆషామాషీదా. తెల్లదొరలను గడగడలాడించిన విప్లవవీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు ప్రధాని ప్రారంభిస్తున్నారు.

అలాగే ముప్పయి అడుగుల అల్లూరి విగ్రహాన్ని ఆయన ప్రారంభిస్తారు. నిజంగా ఇది చారిత్రాత్మక సందర్భం. అనకూడదు కానీ ఈ ప్రోగ్రాం ఖరారు అయినప్పటి నుంచి రఘురామ మనసు ఢిల్లీలో లేదు, భీమవరం చుట్టుతానే తెగ తిరిగేస్తోంది. ఇదిలా ఉంటే రఘురామ మీద అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టి ఏపీ సర్కార్ ఆయన ఎపుడు ఏపీ వస్తే అపుడు అరెస్ట్ చేయాలని కాచుకుని కూర్చుంది. అపుడెపుడో లాక్ డౌన్ టైమ్ లో హైదరాబాద్ లో రఘురామ ఉంటే పుట్టిన రోజు అని కూడా చూడకుండా ఏపీకి సీఐడీ పోలీసులు తెచ్చి ఒక రాత్రి జైల్ ఏంటో చూపించారు.

దాని మీద రఘురామ ఇప్పటికీ తలచుకుని బోరుమంటారు. తనను ఆనాడు చంపేయాలనుకున్నారని, తెగ కొట్టారని కూడా చెప్పుకుంటారు. ఇక ఇపుడు ఏకంగా ఏపీలోనే కనిపిస్తే అసలు ఊరుకుంటారా. దాంతో ఆయన ఏపీ పోలీసులు తన జోలికి రాకుండా చేయాల్సినవి అన్నీ చేస్తూ వస్తున్నారు. తన మీద కేసులు ఎత్తివేయాల‌ని ఆయన హై కోర్టులో పిటిషన్ వేస్తే ఒక్క రాజద్రోహం కేసు తప్ప అన్నీ విచారించవచ్చు అని కోర్టు తీర్పు చెప్పి రాజా వారికి షాక్ ఇచ్చింది.

ఇపుడు మరోసారి ఆయన హై కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. తాను భీమవరం వస్తానని తనకు రక్షణ కల్పించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ ఆయన పిటిషన్ దాఖలు చేశారు. మరి దీనిని విచారణకు స్వీకరించిన హై కోర్టు ఏ విధంగా తీర్పు వెలువరిస్తుందో చూడాలి.

ఏది ఏమైనా భీముడు లాంటి రఘురామకు రెబెల్ పులి అనిపించుకున్న రాజావారికి భీమవరం వెళ్లే దారేదీ ఏ కోశానా కనిపించడంలేదుట. ఆయన‌కు ఏ రకమైన న్యాయ రక్షణ లేకుండా ఆయన భీమవరం వస్తే మాత్రం ప్రధాని మోడీ అలా వెళ్ళగానే ఆయనకు సీఐడీ పోలీసులు అరెస్ట్ చేసి జైలు దారి చూపెడతారు అని అంటున్నారు. ఇక రాఘురామ బాధ ఇపుడు ప్రపంచ బాధ అవుతోంది. ఆయన ఆకాశాన్ని భూమినీ కలిపేసి మరీ ఢిల్లీ నుంచి గభాలుగా భీమవరంలో దూకేయాలని చూస్తున్నారు. ఏం జరుగుతుందో మరి చూడాలి.
Tags:    

Similar News