కుర్చీ మీద నుంచి జారి పడితే ఆ మాత్రం కోపం రాదా?

Update: 2022-04-02 06:44 GMT
ఉగాదిని పురస్కరించుకొని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళ సై రాజ్ భవన్ లో ఏర్పాటు చేసిన ఉగాది వేడుకల సందర్భంగా అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. అతిధులను గవర్నర్ పలుకరిస్తూ వారితో కలుపుగోలుగా మాట్లాడారు. తెలంగాణతోపాటు.. పాండిచ్చేరికి కూడా గవర్నర్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో.. ఆ రాష్ట్రానికి చెందిన మంత్రులు.. స్పీకర్ తో పాటు పలువురు రాజకీయ నేతలు హాజరయ్యారు.

ఇదంతా ఒక ఎత్తు అయితే.. వేదిక కింద ప్రముఖులు కూర్చునేందుకు కుర్చీల వద్ద ఒక కుర్చీలో గవర్నర్ తమిళ సై కూర్చుంటుండగా అది పక్కకు జరిగింది. అనూహ్యంగా ఆమె కింద పడ్డారు. వెంటనే తేరుకున్న ఆమె.. మళ్లీ అదే కుర్చీలో కూర్చున్నారు. ఈ సందర్భంగా వ్యక్తిగత సిబ్బందిపై గవర్నర్ కొంత సీరియస్ అయ్యారు. అయితే.. ఆమె ఆగ్రహానికి గురయ్యారంటూ టీవీల్లో స్కోలింగ్ లు రావటం సరికాదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

గవర్నర్ కు సాయంగా ఉండే వ్యక్తిగత సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. గవర్నర్ కు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా చూసుకోవాలి. అందునా.. ఇలాంటి వేడుకల సమయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. కుర్చీలో కూర్చునే వేళలో.. ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవటం చాలా అవసరం. అందుకు భిన్నంగా నిర్లక్ష్యంతో వ్యవహరించిన తీరుపై గవర్నర్ సీరియస్ కావటం తప్పేం కాదు.

తన ఆహ్వానాన్నిమన్నించి వచ్చిన అతిధుల విషయంలో ఆమె ప్రత్యేక శ్రద్ధను చూపించారు. అతిధులను పేరుపేరునా పలుకరించారు. ఈ వేడుకలకు సీఎం కేసీఆర్ తో పాటు.. మరే మంత్రి కూడా హాజరు కాని నేపథ్యంలో.. ఈ కార్యక్రమానికి హాజరైన బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. టీపీసీసీ చీఫ్.. ఎంపీ రేవంత్ రెడ్డి ప్రత్యేక ఆకర్షణగా మారారు.  రాజ్ భవన్ కు వచ్చి ఉగాది వేడుకలకు హాజరైన రేవంత్ రెడ్డి.. భోజనం చేయకుండా వెళుతున్న విషయాన్ని గుర్తించిన గవర్నర్.. ఆయన్ను ఆపి.. భోజనం చేసి వెళ్లాల్సిందిగా కోరారు. ఇదంతా చూస్తే.. వేడుకల నిర్వహణతో పాటు.. అతిధుల విషయంలో ఆమె చూపించిన శ్రద్ధ అందరిని ఫిదా అయ్యేలా చేశాయని చెప్పాలి.
Tags:    

Similar News