సైకిల్ ని కింద పడేసి తొక్కేస్తున్న తమ్ముళ్ళు...

Update: 2022-11-11 00:30 GMT
సైకిల్ మీద ఎక్కి తొక్కితే అనుకున్న గమ్యం చేరుస్తుంది. అది కూడా ఒక పద్ధతిగా సజావుగా తొక్కడం చేయాలి. కానీ తమకంటే ఎవరూ తోపు లేరనుకుంటున్న తమ్ముళ్ళు కొందరు సైకిల్ ని కింద పడేసి తొక్కుతున్నారు మరి తొక్కిపట్టి నార తీస్తే సైకిల్ ఏమవుతుంది. కిల్ అయి షెడ్డుకు చేరుతుంది. తమ్ముళ్లు కూడా ఎక్కడ ఉన్నచోట అలాగే ఉండిపోతారు.

ఇది ఎల్కేజీ స్టూడెంట్ కి కూడా అర్ధమవుతున్న నీతి పాఠం. కానీ  ఘనత వహించిన పసుపు తమ్ముళ్లకు అర్ధం కాదా అంటే కానే కాదని చేతలతో  చేష్టలతో చూపిస్తున్నారు. ఇది అనంతమైన అనంతపురం జిల్లా  తమ్ముళ్ళ కీచులాటల కధ. ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట. అక్కడ ఎందరో సీనియర్లు ఉన్నారు. చాలా మంది మంత్రులు అయ్యారు. పొలిట్ బ్యూరో మెంబర్స్ కూడా పనిచేశారు, ఈ రోజుకీ చేస్తున్నారు. దశాబ్దాలుగా పార్టీతో పాటే ఉంటూ రాజకీయాలు చేస్తున్నారు.

ప్రజల మెప్పు కూడా పొందారు. ఇపుడు ఆ తమ్ముళ్ళకే ఒకరితో ఒకరికి  పడడంలేదని టాక్. తమలో తమకు అసలు  కుదరక రోడ్డున పడుతున్నారు. చిత్రమేంటి అంటే బలంగా ఉన్న చోట ఇంకా గట్టిగా నిలబడాల్సిన వారు ఇలా కలహించుకుంటూ కలబడి విడిపోతూ పార్టీని బలహీనం చేసి పారేస్తున్నారు.

ఇక ఈ జిల్లాలో మొత్తం పద్నాలుగు సీట్లు ఉంటే మెజారిటీ సీట్లలో ఇదే సీన్ అని అంటున్నారు.  జేసీ బ్రదర్స్ టీడీపీలో కాంగ్రెస్ కల్చర్ ని ఎపుడో ప్రవేశపెట్టేశారు. వారు ఏకంగా జిల్లాలో నాలుగు సీట్లతో తాము చెప్పిందే శాసనం అన్నట్లుగా వేలూ కాలూ పెట్టేసి సొంత పార్టీలో  వర్గ పోరు పెంచుతున్నారు. దాంతో ఆ తలనొప్పులు ఇన్నీ అన్నీ కాదయా అన్నట్లుగా పరిస్థితి ఉంది.

మరో వైపు చూస్తే కళ్యాణ దుర్గం సీటు గురించి చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ గెలిచిన ఉషశ్రీ చరణ్ మంత్రిగా  ఉన్నారు. ఆమె పట్ల సొంత పార్టీలోనే వ్యతిరేకత ఉంది. దాంతో వైసీపీ జిల్లాలో ఓడే ఫస్ట్ సీటు ఇదే అని చెబుతున్నారు. అలాంటి సీట్లో తమ్ముళ్ళు మండల స్థాయి పదవుల కోసం తగవు పడి రోడ్డున పడుతున్నారు అని ప్రచారం ఉంది.

దీంతో వైసీపీకి వేయి ఏనుగుల బలం వచ్చినట్లే కదా అని అంటున్నారు. అలాగే పరిటాల ఫ్యామిలీ కూడా ఒకటి కాదు రెండు అంటూ రెండు సీట్లలో కెలకడం మొదలెట్టింది. ఒకటి ధర్మవరం, రెండు రాప్తాడు. ఈ సీట్లూ తమకే కావా లంటూ అటూ ఇటూ ఆ ఫ్యామిలీ తిరుగుతోంది. అయితే ఎక్కడా బలం పెంచుకున్నారా అంటే ఆలోచించాల్సిందే.

గత ఎన్నికల్లో రాప్తాడు నుంచి పోటీ చేసి ఓడిన పరిటాల శ్రీరాం ఈసారి ధర్మవరానికి షిఫ్ట్ అవాలని చూస్తున్నారు. అయితే ఇక్కడ వైసీపీ బలంగా  ఉంది. దాంతో పాటు బీజేపీలోకి వెళ్ళిన వరదాపురం సూరి ఈ సీటు వైపు చూస్తున్నారని, ఆయన్ని తెచ్చి ఎన్నికల వేళకు టీడీపీ తరఫున  నిలబెడతారని అంటున్నారు. సూరికి ధర్మవరంతో పట్టుంది. ఆయన గతంలో కూడా  గెలిచారు.

దాంతో ఆయన్ని పెట్టడమే కరెక్ట్ అన్న వాదన ఉంది. కానీ ఇంచార్జిగా తాను ఉన్నాను కాబట్టి తనకే సీటు అని పరిటాల పేచీ పెడుతున్నారుట. ఇక రాప్తాడులో తల్లి పరిటాల సునీతకు ఇవ్వాలని కోరుకుంటున్నారు. దాంతో ఈ తగవు తేలేలా కనిపించడంలేదు.

మరో వైపు చూస్తే ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు మీద సొంత పార్టీలోనే నాయకులు చాలా మంది విభేదిస్తున్నారు. మరి ఆయన తన స్టైల్ కరెక్ట్ చేసుకోవాలో లేక పెద్దలు ఎవరైనా చక్కదిడ్డాలో   తెలియదు కానీ ఇదీ ఆయన ఉన్న చోట సీన్. ఇవన్నీ చూస్తూంటే ఈసారి మెజారిటీ సీట్లు అనంతపురం జిల్లా నుంచే వస్తాయని ఆశపడుతున్న టీడీపీకి ఇవన్నీ అపశకునంలా తోచడంలేదా అని అంటున్నారు.

ఇప్పటీకైనా చంద్రబాబు కలుగచేసుకుని పరిస్థితిని చక్కదిద్దకపోతే ముందు ముందు మరింతగా విభేదాలు రోడ్డున పడితే అపుడు పసుపు పార్టీక నష్టమని అంటున్నారు. మరి హై కమాండ్ వద్ద ఉన్న మందు ఏమిటో చూడాలని అంటున్నారు తమ్ముళ్ళు. టోటల్ గా  ఇదీ ఈ జిల్లా టీడీపీ స్టోరీ మరి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News