ఖేల్ ఇండియా : బీజేపీ రాజకీయ సయ్యాట అదరహో!

Update: 2022-08-09 15:33 GMT
కేంద్రం అన్నది తండ్రిలా తల్లిలా ఉండాలి. రాష్ట్రాలు అన్నవి నిజానికి ఎప్పటికీ  ఉనికిలో ఉన్నవి. అవన్నీ కలిస్తేనే కేంద్రం. సమాఖ్య వ్యవస్థ భావన ఇదే. అలాంటిది రాష్ట్రాలను చిన్న చూపు చూడడం నాటి కాంగ్రెస్ తో మొదలైతే నాలుగాకులు ఎక్కువ చదివిన బీజేపీ దాన్ని మించి తాను అంటోంది. అందుకే బీజేపీ ఇపుడు ఖేల్ ఇండియా స్కీం ద్వారా తన రాజకీయ పక్షపాతాన్ని మరోసారి రుజువు చేసుకుంటోంది.

ఈ పధకం కింద దేశంలో వివిధ రాష్ట్రాలకు కేంద్రం విడుదల చేసిన నిధులను చూస్తే బీజేపీయేతర రాష్ట్రాలకు అతి తక్కువ నిధులు ఇస్తూ బీజేపీకి ఎక్కువ నిధులు ఇస్తూ తన పక్షపాతాన్నిఎలా  చాటుకున్నదీ  తెలుస్తుంది. ఇలా బడ్జెట్ లో బీజేపీ సర్కార్ కేటాయించిన నిధులను చూస్తే ఔరా కమలం తీరు అనిపించకమానదు.

ఖేల్ ఇండియా పధకం కింద తెలంగాణాకు ఏదో ఇచ్చమని చెప్పుకునేలా  24.11 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. అలాగే ఏపీకి వస్తే 33.80 కోట్ల రూపాయల నిధులను కేటాయించింది.

ఇక బీజేపీ పాలిత గుజరాత్ రాష్ట్రానికి ఏకంగా 608.37 కోట్ల రూపాయలు కేటాయించింది. అలాగే ఉత్తరప్రదేశ్ కి 503.02 కోట్ల రూపాయల నిధులు కేటాయించింది. బీజేపీ ఏలుబడిలో ఉన్న మరో రాష్ట్రం కర్నాటకకు 128.52 కోట్ల నిధులు కేటాయించారు.

దీని మీద మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెస‌ర్ నాగేశ్వర్ అయితే మండిపడ్డారు. బీజేపీ ఈ విధంగా రాజకీయ పక్షపాతం చూపించడం తగునా అని కూడా ఆయన అన్నారు. బీజేపీ రాష్ట్రాలకు పెద్ద ఎత్తున ఖేల్ ఇండియా నిధులను ఇచ్చి బీజేపీయేతర రాష్ట్రాలను చిన్న చూపు చూడడం దారుణం అని కూడా ఆయన ఫైర్ అయ్యారు.

అయినా కాంగ్రెస్ కి రాజకీయ వివక్ష మీద  నాడు సుద్దులు చెప్పిన బీజేపీ ఇపుడు నాలుగాకులు ఎక్కువ చదివినట్లుగా ఈ విధంగా చేయడమేంటి అని కూడా అంతా అంటున్నారు. మొత్తానికి బీజేపీకి  పాలనా అజెండా కంటే రాజకీయ అజెండావే ఎక్కువ అని తేలిపోయిన వేళ దేశంలో కమలం జెండా ఎత్తని రాష్ట్రాలు, వివక్షకు గురి అవుతున్న రాష్ట్రాలు ఇప్పటికైనా కళ్ళు తెరచి అంతా ఒక్కటిగా కలసి పోరాడాల్సి ఉంటుందని అంటున్నారు. అలా పోరాడితేనే తప్ప న్యాయం జరగదని కూడా అంటున్నారు.
Tags:    

Similar News