టీడీపీ నుంచి అతి పెద్ద కుటుంబం దూరం జరుగుతోందా...?

తెలుగుదేశం పార్టీకి పెట్టని కోటగా ఉత్తరాంధ్రా ఉంది. ఆ ప్రాంతాంలో టీడీపీలో పేరుమోసిన నాయకుడిగా దివంగత మాజీ ఎంపీ ఎంవీవీఎస్ మూర్తి ఉండేవారు. ఆయన 2018లో అమెరికా టూర్ లో ఉండగా యాక్సిడెంట్ కి గురి అయి మరణించారు. మూర్తి రెండు సార్లు టీడీపీ తరఫున ఎంపీగా పనిచేశారు. ఎన్టీయార్ టీడీపీ పెట్టక ముందు నుంచే ఆయన విశాఖలో స్థిర నివాసం ఏర్పరచుకుని విద్యా సంస్థలతో పాటు వ్యాపారాలు నిర్వహించేవారు.
ఇక 1982లో ఎన్టీయార్ టీడీపీని స్థాపిస్తే అందులో విశాఖ జిల్లా నుంచి మొదట చేరిన వారు మూరు. ఆయన 1984లో విశాఖ ఎంపీ టికెట్ ఆశిస్తే ఎన్టీయార్ భాట్టం శ్రీరామమూర్తికి ఇచ్చారు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు ఉడా చైర్మన్ గా పనిచేసిన మూర్తి 1991, 1999లలో రెండు సార్లు విశాఖ నుంచి ఎంపీగా గెలిచి సత్తా చాటారు. ఆయన టీడీపీ ఉత్తరాంధ్రా వ్యవహారాలు చూసేవారు. చంద్రబాబుకు ఆయన అన్ని విధాలుగా పెద్ద దిక్కుగా వ్యవహరించే వారు.
ఆయన మరణాంతరం మనవడు, బాలయ్య అల్లుడు శ్రీ భరత్ రాజకీయ అరంగేట్రం చేశారు. ఆయన 2019 ఎన్నికల్లో విశాఖ ఎంపీ అభ్యర్ధిగా టీడీపీ తరఫున పోటీ చేసి విజయం అంచుల దాకా వచ్చారు. కేవలం నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడారు. ఆయన నాడు ఓటమి పాలు కావడానికి సిటీలోని సొంత పార్టీ వారే వెన్నుపోటు పొడవడం కారణం అని అంటారు. దాని మీద ఆయన కూడా పార్టీ పెద్దలకు తనకు జరిగిన వెన్నుపోటు గురించి పూర్తి ఆధారాలతో వివరించినా వారి మీద ఏ రకమైన చర్యలు తీసుకోలేదని నాటి నుంచే మనస్తాపం చెందుతూ వచ్చారు.
ఇక మూడున్నరేళ్లుగా పార్టీ తరఫున ఆయన పెద్దగా చురుకుగా పనిచేయలేకపోతున్నారు అని అంటున్నారు. ఆయనకు విశాఖ ఎంపీ సీటు మీద కన్ను ఉంది. అయితే ఈసారి టీడీపీ పొత్తులతో రావడం ఖాయం. దాంతో ఆ సీటు అయితే జనసేనకు, లేకపోతే బీజేపీకి వెళ్తుంది అని అంటున్నారు. ఇది ముందే ఊహించిన శ్రీభరత్ మౌనం దాల్చారని చెబుతున్నారు. ఆయన ఒకవేళ ఎమ్మెల్యేగా పోటీ చేయాని అనుకుంటున్న భీమిలీ సీటు మీద మోజు పెంచుకున్నా అది కూడా దక్కేలా కనిపించడంలేదు. దీని మీద జనసేన కర్చీఫ్ వేసేసింది. అది కాదు అనుకుంటే లోకల్ టీడీపీ లీడర్స్ కి సీటు ఇవ్వడం ఖాయం.
దాంతో ఏం చేయాలో తెలియక మూర్తి గారి మనవడు పూర్తిగా గీతం విద్యా సంస్థల వ్యవహారలకే పరిమితం అయిపోయారు అని అంటున్నారు. ఆయన టీడీపీలో క్రియాశీలం కాకుండా సొంత పార్టీ వారే చూస్తున్నారా అన్న చర్చ కూడా ఉంది. ఆయన లోకేష్ కి తోడల్లుడు. చంద్రబాబుకు కొడుకు వరస అవుతాడు. అంగబలం, అర్ధబలం దండీగా ఉన్న వారు. కానీ ఆయనకు ఉన్న పలుకుబడి చుట్టరికాలు ఏ విధంగానూ టీడీపీలో హైలెట్ కావడానికి ఉపయోగపడడంలేదు అంటున్నారు.
ఆయన మరో అధికార కేంద్రంగా మారుతారు అన్న ఆలోచనతోనే ఆయనను పక్కన పెడుతున్నారా అన్న చర్చ కూడా వస్తోందిట. దాంతో ఆయన తానుగానే రాజకీయల పట్ల వైముఖ్యం ప్రదర్శిస్తున్నారు అని అంటున్నారు. మరి మామ బాలయ్య చిన్నల్లుడి విషయంలో ఏమైనా జోక్యం చేసుకుంటారా అన్నది చూడాలి. మొత్తానికి చూస్తే ఒకనాడు ఉత్తరాంధ్రను శాసించి ఎందరో నాయకులను నడిపించిన మూర్తి గారి కుటుంబం చివరికి విసిగి రాజకీయాలకు రాం రాం అనేస్తోంది అని అంటున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.