పవన్ సీఎం...బాబు ఓకే అన్నా అక్కడే డౌట్ కొడుతోందిట...!

Update: 2023-01-23 21:00 GMT
ఏపీలో జనసేన తెలుగుదేశం మధ్య పొత్తు కుదరడం ఖాయం. ఈ విషయంలో ఆ రెండు పార్టీల క్యాడర్ కే కాదు, ఎవరికీ ఎలాంటి డౌట్లూ లేవు. ఇక ఏపీలో జగన్ని ఓడించాలి అంటే పొత్తులను మించిన అస్త్రం వేరొకటి లేదు అటు చంద్రబాబుకు ఇటు పవన్ కి ఇంతకు మించిన ఆప్షన్లు లేవు కూడా. విడిగా పోటీ చేస్తే కచ్చితంగా వైసీపీని గెలిపించడమే అవుతుంది అని అంటున్నారు.

దాంతో పొత్తుల విషయంలో సూత్రప్రాయంగా రెండు పార్టీలు అంగీకరించినా దాని మీద ఒక అధికారిక ప్రకటన రావడానికి మాత్రం చాలా సమయం పట్టేలా ఉంది అని అంటున్నారు. దానికి ప్రధాన కారణం జనసేన నుంచి వస్తున్న అతి పెద్ద డిమాండ్. పవన్ కళ్యాణ్ కి సీఎం పదవి ఇవ్వాలని ఆ పార్టీ కోరుతోంది. అదే టైం లో ఏపీలో బలమైన కాపు సామాజికవర్గం నుంచి కూడా అదే రకమైన డిమాండ్ వస్తోంది.

లేటెస్ట్ గా కాపు సేన అధ్యక్షుడు చేగొండి హరి రామజోగయ్య కూడా పవన్ని సీఎం చేయాలని కోరుతూ బహిరంగ లేఖ రాశారు. ఏపీలో వైసీపీని గద్దె దించాలంటే తెలుగుదేశం జనసేన కలసి పనిచేయాలని కూడా ఆయన కోరుకుంటూనే ఈ డిమాండ్ ముందుకు తెచ్చారు. ఇక జనసేన నాయకుల మాటలను చూసినా తమ నేత ఈసారి పక్కాగా సీఎం అవుతారు అని చెబుతున్నారు.

మరి ఇవన్నీ నాలుగున్నర దశాబ్దాల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబుకు అర్ధం కాకుండా ఉంటాయా అన్నది కూడా ఆలోచించాలి. మరి ఎందుకు ఈ డిమాండ్ వస్తోంది. గతంలో చూస్తే తెలుగుదేశం పార్టీ ఎన్నో ఇతర పార్టీలతో పొత్తు కుదుర్చుకున్నా జస్ట్ ఏవో కొన్ని సీట్లు ఇచ్చి ఒప్పందాలు కుదుర్చుకునే పరిస్థితి నుంచి ఇపుడు ఎందుకు ఇలా వస్తోంది అంటే అక్కడే ఉంది రాజకీయ తమాషా.

ఏపీలో జనసేన మూడవ ఆల్టర్నేషన్ గా ఎదుగుతోంది. ఆ పార్టీ గ్రాఫ్ కూడా 2014, 2019తో పోలిస్తే బాగా పెరుగుతోంది. ఇక అదే పరిస్థితుల్లో తెలుగుదేశం గతం కంటే బాగా బలహీనపడింది. ఆ పార్టీకి మునుపు ఉన్న ఊపు ఇపుడు లేదు. చంద్రబాబు వయోభారంతో పాటు లోకేష్ మీద నమ్మకం లేకపోవడంతో తెలుగుదేశంలో ఒక రకమైన నైరాశ్య పరిస్థితి ఉంది. ఇక పొత్తులు వద్దు అని తెగించి ఒంటరిగా వెళ్తే తెలుగుదేశం పుట్టె మునగడం ఖాయమని అంటున్నారు.

దాంతో ఎట్టి పరిస్థితులల్లోనూ పొత్తులతోనే చంద్రబాబు వెళ్తారు అని అంటున్నారు. మరి జనసేన డిమాండ్ అయిన సీఎం పదవి ఇచ్చేందుకు బాబుకు ఓకేనా అంటే అది కూడా ఆయన తగ్గాల్సిందే అని రాజకీయ మేధావుల నుంచి అంతా అంటున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ లాంటి వారు అయితే బాబుకు అంతకంటే మరో ఆప్షన్ లేదని అంటున్నారు. పవన్ సీఎం పదవే అడుగుతారని, అది కనుక బాబు ఒప్పుకుంటేనే రెండు పార్టీల మధ్య జట్టు కుదురుతుందని అంటున్నారు.

ఇంకో వైపు చూస్తే పవన్ కళ్యాన్ణి తెలివైన రాజకీయ నేతగా ఆయన అభివర్ణించారు. ఈ పరిణామాల నేపధ్యంలో బాబు ముందు వేరే ఆప్షన్లు లేవు అనే అంటున్నరు. పొత్తులు కుదుర్చుకుంటే సీఎం గా అయిదేళ్ళ కాలనికీ కనీసం రెండున్నరేళ్ల పాటు పవన్ కి ఇవ్వాలి. బాబు రాజకీయ వ్యూహకర్త కాబట్టి దానికి కూడా ఓకే అనేసి ఎన్నికల  గండాన్ని గట్టెక్కిసినా ఆ తరువాత సంగతేంటి అన్న చర్చా వస్తోంది.

ఎందుకంటే  1995 ఎన్టీయార్  వెన్నుపోటు ఎపిసోడ్ ని అంతా గుర్తుకు తెస్తున్నారు. నాడు తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరరావుకు ఉప ముఖ్యమంత్రి పదవిని ఇస్తానని చెప్పి బాబు ఇవ్వలేదు. చేతిలో అధికారం పడ్డాక బాబు మరిపోతారు కాబట్టి తొలి రెండున్నరేళ్ళ పదవీకాలంలోనే పవన్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని కూడా జనసేన కోరే అవకాశం ఉంటుంది అని అంటున్నారు. అలా కాకపోతే జనసేన ఎమ్మెల్యేలను కూడా చంద్రబాబు తన వైపునకు తిప్పుకుని దెబ్బ తీసే అవకాశాలు ఉంటాయని కూడా భయపడే సీన్ ఉంది.

ఏది ఎలా చూసినా చంద్రబాబు పవన్ కి సీఎం పదవి ఒప్పుకోవాలి. అలాగే తొలి రెండున్నరేళ్ళ పాటు ఇవ్వడానికే ఒప్పుకోవాలి. అపుడే ఈ పొత్తు ఫలించేది అని అంటున్నారు. ఇవనీ చూస్తూంటే బాబు ఎన్ని హామీలు ఇచ్చినా డౌట్లు ఇంకా అలాగే ఉంటాయని అంటున్నారు. పైగా తాను 2024 ఎన్నికల్లో గెలిచి సీఎం అవుతాను అని బాబు నిండు అసెంబ్లీలో ప్రమాణం చేశారు కాబట్టి 2024లో కూటమి గెలిస్తే సీఎం అయ్యేది బాబే అంటున్నారు. ఇక బాబు ఒక్కసారి సీఎం అయ్యాక కుర్చీ దిగేది ఉండదని ఫ్లాష్ బ్యాక్ ని చూసిన వారు అంటున్నారు. మరి బాబుని నమ్మి పొత్తులకు సిద్ధపడడమే పవన్ కి ఉన్న ఆప్షన్ అని అంటున్నారు. చూడాలి మరి ఏమి జరుగుతుందో.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.

Similar News