మంత్రి సీదిరికి సెగ‌.. ఇంటి నుంచి కాలు బ‌య‌ట‌పెట్ట‌గానే విరుచుకుప‌డ్డారుగా!!

Update: 2022-12-29 13:38 GMT
ఔను.. ఉత్త‌రాంధ్ర జిల్లా శ్రీకాకుళానికి చెందిన ఫైర్ బ్రాండ్ మంత్రి డాక్ట‌ర్ సీదిరి అప్ప‌ల‌రాజుకు భారీ సెగ‌తగిలింది. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి వెళ్తున్న ఆయ‌న ఇంటి నుంచి కాలు బ‌య‌ట పెట్ట‌గానే ప్ర‌జ‌లు ఒక్క‌సారిగా విరుచుకుప‌డ్డారు.

ఉప్పటేరు వంతెన రహదారి నిర్వాసితులు ఆయ‌న‌ను ప్ర‌శ్న‌ల‌తో ఉక్కిరిబిక్క‌రి చేశారు. ముందు తమ సమస్యను పరిష్కరించి ఆపై గడప గడపకు కార్యక్రమానికి వెళ్లాలని నిర్వాసిత గ్రామస్థులు ఆందోళన చేశారు. వారంతా తగిన పరిహారంతో పాటుగా.. ఇళ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.

ఏం జ‌రిగిందంటే..

గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం కోసం మంత్రి సీదిరి బ‌య‌ల్దేరారు. అయితే.. నిర్దేశిత గ్రామానికి చేరుకునే లోపే.. తీవ్ర నిరసన సెగ తగిలింది. తమకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఆ ప్రాంత ప్రజలు మంత్రి అప్పలరాజును నిలదీశారు. మెుదట మంత్రి సర్ధిచెప్పే ప్రయత్నం చేయగా.. వారంతా తమకు న్యాయం చేసే వరకు కదలనివ్వం అంటూ భీష్మించారు.

శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు వద్ద మంత్రి సీదిరి అప్పలరాజును.. ఉప్పటేరు వంతెన రహదారి నిర్వాసితులు అడ్డుకున్నారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనేందుకు వజ్రపుకొత్తూరు మండలం మంచినీళ్ల పేట వెళ్తున్న మంత్రిని అడ్డుకొని పరిహారంతో పాటు ఇళ్ళ స్థలాలు ఇచ్చిన తర్వాతే వంతెన రహదారి నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఇళ్ల కోసం చిన్న చిన్న స్థలాలు చూపించారని ఆందోళన వ్యక్తం చేశారు. అలా కాకుండా స్థలాల వైశాల్యం పెంచాలని డిమాండ్ చేశారు. అంతవరకూ పనులు మొదలు పెట్టకూడదని డిమాండ్ చేశారు. ఈ విషయంపై అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తానని మంత్రి హామీ ఇవ్వడంతో ప్రజలు శాంతించారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News