అటు గంటా.. ఇటు ముద్రగడ...పవర్ ఫుల్ ప్లాన్ ఎవరిది...?

Update: 2022-11-29 13:59 GMT

ఏపీలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అంతే కాదు సామాజిక కోణంలో కూడా పదునెక్కుతున్నాయి. ఏపీలో రాజకీయం అంటేనే సామాజిక సమీకరణలతో  రణం అని చెప్పాలి. సోషల్ ఇంజరీనింగ్ సరిగ్గా ఎవరు చేసుకుంటే వారిదే అధికారం. ఆ విషయంలో చంద్రబాబు 2014లో అన్ని లెక్కలూ చూసుకుని బరిలోకి దిగి విజయం సాధిసే 2019 నాటికి అవే లెక్కలను తిరగరాసి జగన్ ముఖ్యమంత్రి కుర్చీని అందుకున్నారు.

మరి చూడబోతే కేవలం పదిహేను నెలల వ్యవధిలోకి ఏపీ ఎన్నికలు వచ్చేశాయి. ఎలా చూసుకున్నా 2023 నుంచి ఎన్నికల వేడి వేసవి వేడిని మించేలా హీటు పెంచడం ఖాయం. దాంతో పాటు ఎత్తులు పై ఎత్తులు వ్యూహాలు ప్రతి వ్యూహాలు కూడా వారూ వీరూ చేస్తూ పోతారు. ఇపుడు చూస్తే ఏపీలో టీడీపీని బీసీలను తమ వైపు తిప్పుకోవడం ద్వారా చాలా వరకూ కట్టడి చేయాలనుకుంటున్న వైసీపీకి జనసేనతో కొత్త ఇబ్బందులు ఏర్పడుతున్నాయి.

జనసేనను 2024 నాటికి పెద్దగా అంచనా కట్టని వైసీపీకి ఇటీవల ఆ పార్టీ దూకుడు చూసి తన ఆలోచనలను మార్చుకోవాల్సిన అవసరం ఏర్పడింది అంటున్నారు. కాపులు జనసేన చుట్టూ ర్యాలీ అవుతారా. వారు ఓట్లు సాలిడ్ గా ఆ పార్టీకే పడతాయా. కాపులు పోలరైజ్ అవుతారా అన్న చర్చలు కూడా ఉన్నాయి. అయితే చరిత్రను గడచిన ఎన్నికల ట్రాక్ రికార్డుని తీసుకుంటే నూరు శాతం కాపుల ఓట్లు ఎపుడూ ఒకే పార్టీకి పడిన దాఖలాలు లేవు.

ఎవరైతే కాపులను తమ వైపునకు తిప్పుకుంటారో వారి వైపు అత్యధికులు మొగ్గు చూపుతారు. ఆ విధంగా విజయాన్ని వారు అందుకుంటున్నారు. దీంతో కాపుల ఓట్లు తమ చేతుల నుంచి జారిపోకుండా వైసీపీ గట్టి వ్యూహాన్నే రూపిందించింది అని అంటున్నారు. ఉత్తరాంధ్రా  గోదావరి జిల్లాలలో ఈ వ్యూహం పకడ్బంధీగా అమలు చేయాలని చూస్తోంది అని తెలుస్తోంది.

దాంతోనే ఉత్తరాంధ్రా నుంచి మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావుని తమ వైపునకు తిప్పుకునే ఎత్తుగడకు వైసీపీ తెర తీసిందని అంటున్నారు. ఓసీ కాపు అయిన గంటా ఉత్తరంధ్రాలో బలమైన నాయకుడు. ఆయన అంగబలం అర్ధం బలం దండీగా ఉన్న వారు. ఆయనకు కావాల్సింది రాజకీయంగా తాను గట్టిగా ఉండాలి, ఒక సామంత రాజుగా తన వైభవం వెలగాలి అన్నది ఆయన కోరిక. ఈ విషయం మీదనే గతంలో వైసీపీ అన్ని ఆలోచించి ఆయనను వదిలేసింది అని అంటున్నారు.

కానీ ఇపుడు విపక్షాల నుంచి ముప్పు ముంచుకొస్తున్న క్రమంలో గంటాను చేరదీయడం తప్ప మరో మార్గం లేదు అని అంటున్నారు. దాంతోనే ఆయనకు ఏకంగా వైసీపీ అధినాయకత్వం నుంచి నేరుగా సందేశం వెళ్ళింది అని అంటున్నారు. ఆయన పెట్టే కండిషన్లు అన్నీ అంగీకరిస్తూనే పార్టీలో చేర్చుకోవడానికి చూస్తున్నారు అని తెలుస్తోంది.

గంటా కనుక వైసీపీలో చేరితే బలమైన కాపు సామాజిక వర్గం తమ వైపే ఉందని సంకేతాలు పంపించవచ్చు అని అదే విధంగా ఆయన సారధ్యంలో ఉత్తరాంధ్రాలో కూదా మరోసారి విజయం సాధించవచ్చును అని వైసీపీ భావిస్తోంది అని అంటున్నారు. మొత్తానికి గంటాకు గేలం వేసి తమ వైపునకు కునే పనిలో  వైసీపీ పడింది. అన్నీ అనుకూలిస్తే డిసెంబర్ నెలలో ఆయన వైసీపీ గూటికి చేరడం ఖాయమే అని అంటున్నారు.

ఇక గోదావరి జిల్లాలకు సంబంధించి వైసీపీ మరో స్కెచ్ వేసింది అని అంటున్నారు. అదే మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభాన్ని వైసీపీలోకి తీసుకురావడం, ఆయనను వైసీపీలో చేరే విధంగా ఇప్పటికే దఫదఫాలుగా చర్చలు రాయబేరాలు జరిగాయని అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో ముద్రగడ ఫ్యామిలీకి ఎంపీ,ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి కూడా వైసీపీ సుముఖంగా ఉందని అంటున్నారు. ముద్రగడ తనయుడికి ఎమ్మెల్యే టికెట్ ఇస్తే ముద్రగడకు రాజ్య్సభ సీటుని ఇస్తారని కూడా అంటున్నారు.

మరి ముద్రగడ కనుక చేరితే గోదావరి జిల్లాలలో ఆ ప్రభావం గణనీయంగా ఉంటుంది అని అంటున్నారు. కాపుల కోసం వంగవీటి రంగా తరువాత ఆ స్థాయిలో ఉద్యమించిన ఘనత చరిత్ర ఆయనకు ఉంది. ముద్రగడ తెలుగుదేశం పార్టీకి బద్ధ వ్యతిరేకి, అదే టైం లో జనసేనతో కూడా ఆయన ఎడం పాటిస్తున్నారు. బహుశా ఈ సమీకరణలే వైసీపీకి ఆయన మీద ఆశలను పెంచుతున్నాయని అంటున్నారు. ఇలా ఈ ఇద్దరు రాజకీయ ఉద్దండులను, సామాజిక ఐకాన్స్ ని ముందు పెట్టుకుని గోదావరి జిల్లా నుంచి ఉత్తరాంధ్రా దాకా వైసీపీ జెండా ఎగిరేలా మాస్టర్ ప్లాన్ ని వైసీపీ రూపకల్పన చేసింది అని అంటున్నారు. అనుకున్నట్లుగా ఇది జరిగితే విపక్షానికి ఇబ్బందే అన్న మాట అయితే ఉంది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News