13 పరుగులు.. 50వ సెంచరీ.. భారీ రికార్డులపై రోహిత్ గురి

అయితే, బుధవారం అహ్మదాబాద్ లో జరగబోయే మూడో వన్డేలో మాత్రం రోహిత్ సూపర్ హిట్ మ్యాన్ గా నిలవడం ఖాయం.

Update: 2025-02-11 11:06 GMT

కెరీర్ ప్రారంభంలో మిడిలార్డర్ లో దిగి.. పరుగులు చేయలేక ఇబ్బంది పడి.. ఓపెనర్ గా దిగాక వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరమే రాని క్రికెటర్ టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ. కొంత కాలంగా ఫామ్ పై తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్న అతడు కటక్ లో ఇంగ్లండ్ తో రెండో వన్డేలో సూపర్ సెంచరీ బాది ఫామ్ లోకి వచ్చాడు. దీంతోపాటు మరికొన్ని పరుగులు చేసి ఉంటే అతడు అరుదైన రికార్డులను అందుకునేవాడే. అయితే, బుధవారం అహ్మదాబాద్ లో జరగబోయే మూడో వన్డేలో మాత్రం రోహిత్ సూపర్ హిట్ మ్యాన్ గా నిలవడం ఖాయం.

రోహిత్ ప్రస్తుతం వన్డేల్లో 259 ఇన్నింగ్స్‌ల్లో 10,987 పరుగుల మీద ఉన్నాడు. అంటే.. మరొక్క మరో 13 పరుగులు చేస్తే 11 వేల పరుగులు మైలురాయిని చేరతాడు. అంతేకాదు.. అత్యంత వేగంగా 11 వేల పరుగులు చేసిన రెండో ఆటగాడిగా రికార్డులకెక్కుతాడు.

బ్యాటింగ్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, రికీ పాంటింగ్, సౌరబ్ గంగూలీ, జాక్వెస్ కలిస్ కంటే కూడా రోహిత్ తక్కువ మ్యాచ్ లలోనే 11 వేల పరుగులు పూర్తి చేశాడు. టీమ్ మేట్ విరాట్ కోహ్లి మాత్రమే రోహిత్ కంటే ముందున్నాడు. కోహ్లి 222 ఇన్నింగ్స్‌ లలోనే 11వేల పరుగులు సాధించాడు.

ఇంగ్లండ్‌ తో రెండో వన్డేలో చేసిన సెంచరీ (119; 90 బంతుల్లో) రోహిత్‌ వన్డే కెరీర్ లో32వది. మొత్తమ్మీద అంతర్జాతీయ క్రికెట్‌ లో 49వది. మరో సెంచరీ చేస్తే సచిన్ (100), విరాట్ (81) తర్వాత 50 సెంచరీలు చేసిన మూడో భారత ఆటగాడు అవుతాడు. రోహిత్ టి20ల్లో రికార్డు స్థాయిలో 5 సెంచరీలు కొట్టిన సంగతి తెలిసిందే.

కోహ్లీతో పాటు సచిన్ (276 ఇన్నింగ్స్‌ల్లో), పాంటింగ్ (ఆస్ట్రేలియా) - 286 ఇన్నింగ్స్‌ల్లో, సౌరభ్‌ గంగూలీ (భారత్‌) - 288 ఇన్నింగ్స్‌ల్లో కలిస్ (దక్షిణాఫ్రికా) – 293 ఇన్నింగ్స్‌ల్లో, కుమార సంగక్కర (శ్రీలంక) 318 ఇన్నింగ్స్‌ల్లో, ఇంజామామ్ ఉల్ హక్ (పాకిస్థాన్‌) - 324 ఇన్నింగ్స్‌ల్లో, సనత్ జయసూర్య (శ్రీలంక) -354 ఇన్నింగ్స్‌ల్లో , మహేల జయవర్దెనె (శ్రీలంక) - 368 ఇన్నింగ్స్‌ల్లో 11 వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.

Tags:    

Similar News