వైసీపీ ఎమ్మెల్యే బాధ : బాబును చెడ తిట్టా...అందుకే...?

Update: 2022-08-11 14:45 GMT
ఆయన వైసీపీ ఎమ్మెల్యే పేరు నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఆయనది రాజకీయ కుటుంబం. తండ్రి నల్లపురెడ్డి శ్రీనివాసులురెడ్డి డెబ్బై దశకం నుంచి రాజకీయాల్లో ఉన్న నాయకుడు. సీనియర్ నేత. కాంగ్రెస్ తెలుగుదేశం రాజకీయాలను రెండూ చూసిన దిగ్గజ నేత. ఆయన వారసుడే ఈయన. ఇక ప్రసన్నకు కూడా మూడు దశాబ్దాల రాజకీయ అనుభవం ఉంది. తండ్రి చనిపోయాక వచ్చిన ఉప ఎన్నికల్లో టీడీపీ తరఫున పోటీ చేసి తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు.

ఆ తరువాత చాలా ఏళ్ళు  టీడీపీలోనే ఉన్నారు. కానీ అక్కడ ఆయనకు ఏమైందో ఏమో కానీ వైఎస్సార్ పిలుపు మేరకు నాడు కాంగ్రెస్ లో చేరారు. ఇక ఆయన మరణాంతరం జగన్ వైపు వచ్చారు. ఆయనే తానుగా చెప్పుకున్నట్లుగా జగన్ విజయమ్మ తరువాత మూడవ ఎమ్మెల్యేగా వైసీపీలో గుర్తింపు పొందారు. అనేకసార్లు ఎమ్మెల్యేగా గెలిచినా మంత్రి పదవి అయితే దక్కలేదు. జూనియర్లు వచ్చి మంత్రి పదవిని తన్నుకుపోతున్నారు. ప్రసన్నకు మాత్రం జగన్ ప్రసన్నం కావడంలేదు.

తొలి దఫాలోనే మంత్రి అవుతారని అంతా అనుకున్నారు. కానీ అనిల్ కుమార్, గౌతం రెడ్డి మంత్రులు అయ్యారు. రెండవ దఫాలో చూస్తే కాకాణి గోవర్ధనరెడ్డికి చాన్స్ ఇచ్చారు. దాంతో మండిపోయిన ప్రసన్న కుమార్ రెడ్డి పార్టీలో ఫుల్ సైలెంట్ అయ్యారు. ఒక దశలో హై కమాండ్ జారీ చేసిన గట్టి  హెచ్చరికలు చూసి ఆయన ఇపుడు గడప గడపకు మన ప్రభుత్వమని చెబుతూ  వెళ్తున్నారు. అది కూడా మొక్కుబడిగా మాత్రమే.

ఆయనలో మునుపటి జోష్ లేదు. ఉత్సాహం అంతకంటే లేదు. ఎంతచేసినా ఏముంది ఏ పదవి వస్తుంది అన్న రాజకీయ  వైరాగ్యమే కనిపిస్తోంది. ఈ సందర్భంగా గడప గడపకు కార్యక్రమం కొవూరులో జరిగిన సందర్భంగా తన మనసులో మాటను మీడియాతో పంచుకున్నారు. తాను సైలెంట్ గా ఉంటే పార్టీ మారినట్లా అని మీడియానే ప్రశ్నించారు.

తన మీద రకరకాలైన కామెంట్స్ చేస్తున్నారని,  తప్పుడు ప్రచారాలు కూడా జరుగుతున్నాయని మధన పడ్డారు. తాను జగన్ని వీడిపోను అని కూడా అంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. తాను తిట్టినంతగా చంద్రబాబుని ఎవరు తిట్టి ఉండరని కూడా అన్నారు. తాను చెడా మడా బాబుని తిట్టేశాను అని చెప్పుకున్నారు. అంటే తాను అలా తిట్టిన పార్టీ తనకు చోటు ఇస్తుందా అన్నదే ఆయన అసలు బాధా అని కూడా అన్న వారు లేకపోలేదు.

వైసీపీలో అగ్ర నేతలుగా కొనసాగాలీ అంటే టీడీపీని ఇష్టం వచ్చినట్లుగా తిట్టాలి అని రూల్ ఉందేమో తెలియదు. లేక నేతల అతి ఉత్సాహం వల్ల తిడుతున్నారా అన్నది కూడా తెలియదు.కానీ ప్రసన్న లాంటి వారు చాలా గట్టిగానే బాబుని విమర్శించారు. ఇపుడు సొంత పార్టీలో ఆదరణ తగ్గాక పక్క చూపులు చూడలేక ఇలా ఇబ్బంది పడుతున్నారా అన్న చర్చ అయితే వస్తోంది.

తన ప్రాణం ఉన్నంతవరకూ జగన్ వెంటే అని ప్రసన్న అంటున్నారు. అంతకు మించి ఆయనకు వేరే ఆప్షన్ లేకనే అలా అంటున్నారు అని ప్రత్యర్ధులు అంటున్నారు. ఏది ఏమైనా కూడా ప్రసన్న చేసిన కామెంట్స్ వెనక ఆయన పార్టీ మారడంలేదు అని చెప్పుకోవడం ఉందా లేక  మారలేకపోతున్నాను అని బాధ ఉందా అంటే అది మాత్రం ఎవరికీ అర్ధం కాదనే అంటున్నారు. మొత్తానికి ప్రసన్న బాధ పడుతున్నారు. అది మాత్రం అందరికీ అర్ధమవుతోంది మరి.
Tags:    

Similar News