రింగ్ లో లక్ : బాబు చక్రం తిప్పేస్తారా...?

Update: 2022-07-07 10:30 GMT
రాజ్యాలు రాజులు పోయినా ఆధునిక కాలంలో ప్రజాస్వామిక యుగంలో కూడా చక్రవర్తులుగా ఉన్న పాలకులు ఉన్నారు. ఇక ఒకసారి పవర్ లోకి వచ్చిన వారికి ఆ మోజు క్రేజ్ బాగా తెలుస్తాయి. దాంతో పదవి పోయాక మాత్రం వారు మాజీ అన్న పేరుని అసలు తట్టుకోలేరు. తిరిగి గద్దెనెక్కడానికి శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంటారు. అలా కనుక చూస్తే టీడీపీ అధినేత చంద్రబాబు తన శక్తిని నమ్ముకుని పార్టీని ముందుకు నడిపిస్తున్నారు.

ఆ మాటకు వస్తే చంద్రబాబు ఓటమిని ఎపుడూ ఒప్పుకోరు. ఆయన కిందపడినా మీదకు చేరడానికి చూస్తూంటారు. దానికి ఆయన షార్ట్ కట్స్ కంటే తన వ్యూహాలను తన శక్తినే ఎక్కువగా నమ్ముతారు. ఇది అందరికీ తెలిసిన నిజం. ఇక చంద్రబాబు జగన్ గద్దెనెక్కిన మరుసటి రోజు నుంచే జనాల‌లోకి వస్తున్నారు. ఇక మూడేళ్ళ పాలన తరువాత వైసీపీ ఏలుబడి మీద జనాలకు అభిమానం తగ్గిందని గ్రహించి గేరు మార్చి స్పీడ్ పెంచేశారు బాబు.

ఇదిలా ఉంటే ఎపుడూ పెద్దగా సెంటిమెంట్లకు బాబు విలువ ఇవ్వరు అంటారు. ఆయన మూఢ నమ్మకాలను కూడా పట్టించుకోరు అని చెబుతారు. ఇక బాబు ఎపుడూ కనీసం వాచీ కూడా చేతికి  పెట్టుకుని ఎరగరు. ఆయన జేబులో ఒక పెన్ను మాత్రం ఉంటుంది. ఆయన ముఖ్యమంత్రిగా పలు మార్లు చేసినా కూడా బంగారం తో చేసిన ఆభరణాలు కానీ మరే రకమైన వస్తువులను కానీ ధరించడానికి అసలు ఇష్టపడరు.

అలాంటి చంద్రబాబు తన తాజా రాయలసీమ పర్యటన‌లో మాత్రం ఒక చిత్రాన్ని జనాలకు చూపించారు. ఆయన జనాలకు అభివాదం చేస్తున్నపుడు ఆయన ఎడమ చూపుడు వేలుకు ఉంగరం ఉంది. దాంతో బాబు చేతి వేలు మీద దాన్ని చూసిన వారు ఇక రింగ్ తో బొంగరం ఆడించేస్తారా అన్న చర్చ కూడా మొదలెట్టేశారు. ఈ ఉంగరాన్ని వెండితో కానీ ప్లాటినం లోహంతో కానీ తయారు చేసినట్లుగా చెబుతున్నారు.

బాబు దీన్ని ధరించడం వెనక కచ్చితంగా  జ్యోతీష్యుల ప్రభావం ఉంది అంటున్నారు. ఎడమ చూపుడు వేలుకు ఈ ఉంగరం ధరించడం అన్నది రాజ్యాధికార ప్రాప్తిని కలిగిస్తుంది అని అంటున్నారు. గతంలో చాలా మంది రాజులు తమ ఎడమ చూపుడు వేలుకు ఉంగరాన్ని ధరించారని అలా వారు రాజ్యాలను పూర్తి అధికారంతో పాలించారని చరిత్ర‌ చెబుతోంది.

మరి బాబుకు ఏ జ్యోతీష్కుడు ఇలా చేయమని సూచించారో కానీ చంద్రబాబు అయితే ఉంగరం ధరించి సరికొత్తగా కనిపించారు. మదనపల్లి బహిరంగ సభలో బాబుని ఇలా చూసిన తమ్ముళ్ళు కూడా కొంత ఆలోచనలో పడ్డారు. మొత్తానికి వచ్చే ఎన్నికల్లో తమ శక్తిని మాత్రమే కాకుండా సెంటిమెంట్లను కూడా నమ్ముకుంటూ చంద్రబాబు అలా ముందుకు సాగిపోతున్నారు అన్న మాట.
Tags:    

Similar News