త‌మ్ముళ్ల చిత్రాలు.. మ‌నుషుల మ‌ధ్య ఉండ‌మంటే.. మైకుల ముందు!!

Update: 2022-07-10 01:30 GMT
ఏపీ టీడీపీలో నాయ‌కుల చిత్రాలు చిత్ర విచిత్రంగా క‌నిపిస్తున్నాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ఒక‌వైపు పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడు.. నిత్యం ప్ర‌జ‌ల‌లో ఉండాల‌ని నాయ‌కుల‌కు సూచిస్తున్నారు. తాను సైతం.. ఎండ‌న‌క, వాన‌న‌క‌.. ఆయ‌న ప్ర‌జ‌ల్లోనే ఉంటున్నారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో విజ‌య తీరం చేరేందుకు ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డ‌మే ప్ర‌ధాన‌మ‌ని ఆయ‌న న‌మ్ముతు న్నారు. మ‌రి ఈ స్ఫూర్తి.. చంద్ర‌బాబు వ్యూహం వంటివి నాయ‌కుల‌కు ప‌ట్టిన‌ట్టు క‌నిపించ‌డం లేదు. అందుకే.. నాయ‌కులు ఎక్క‌డా ముందుకు క‌ద‌ల‌డం లేదు.

పైగా.. నాయ‌కుడి ద‌గ్గ‌ర అనుకూలంగా ఉన్న‌ట్టు మార్కులు వేయించుకునేందుకు కేవ‌లం .. మ‌నుషుల క‌న్నా.. మీడియా మైకుల‌కు ప్రాధాన్యం ఇస్తున్నారు. కీల‌క నాయ‌కులు కూడా ప్ర‌జ‌ల మ‌ధ్య‌కు రావ‌డం లేదు. ఉద‌యం ఒక‌సారి.. సాయంత్రం ఒక సారి.. మీడియా మైకుల ముందు మాట్లాడి.. చాప‌చుట్టేస్తున్నారు.

దీంతో ప్ర‌జ‌ల‌కు నాయ‌కుల‌కు మ‌ధ్య లింకులు స‌రిపోవ‌డం లేదు. నిజానికి గ‌త మూడేళ్ల‌లో పార్టీని డెవ‌ల‌ప్ చేసేందుకు చంద్ర‌బాబు ఎంతో కృషి చేస్తున్నారు. ఎక్క‌డిక‌క్క‌డ ఉద్య‌మాలు.. నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు.

ఇసుక విధానంపై ఒక‌సారి.. పార్టీ కార్యాల‌యంపై దాడికి నిర‌స‌న‌గా మ‌రోసారి ఆయ‌న నిర‌స‌న స‌త్యాగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అయితే.. ఇదే స్ఫూర్తిని నాయ‌కులు కూడా కొన‌సాగించాల‌ని.. చంద్ర‌బాబు కోరుకున్నారు. కానీ.. నాయ‌కుల్లో మాత్రం అధినేత కోసం ఉన్న చ‌ల‌నం.. ప్ర‌జ‌ల కోసం లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం. అంటే.. అధినేత వ‌స్తున్నారంటే.. ఒక‌విధంగా.. అధినేత లేక‌పోతే.. మ‌రోలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. మైకు ముందు క‌నిపిస్తే.. అనుకూల మీడియాలో ప్లేట్ ప‌డితే.. స్కోలింగు వ‌స్తే.. చాలు అన్న‌ట్టుగా.. చాలా మంది నాయ‌కులు వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

దీంతో పార్టీ ప‌టిష్ట‌త స‌హా.. అనేక విష‌యాల్లో టీడీపీకి ఎదురు దెబ్బ‌లు త‌ప్ప‌డం లేదు. మ‌రో రెండేళ్ల‌లోనే ఎన్నిక‌లు ఉండ‌డం.. నాయ‌కులు ఎక్క‌డిక‌క్క‌డ అధినేత దృష్టిలో ప‌డితే చాలు అన్న‌ట్టుగా వ్య‌వ‌మ‌రించ‌డం వ‌ర‌కే ప‌రిమితం అవుతుండ‌డం.. వంటివి పార్టీకి తీర‌ని న‌ష్టాన్ని చేకూరుస్తాయ‌ని చెబుతున్నారు.

ఇప్ప‌టికైనా.. నాయ‌కులు పైపై మెరుగుల‌కు.. మైకు ముందు విన్యాసాల‌కు.. స‌వాళ‌ళ్ల రాజ‌కీయాల‌కు స్వ‌స్తి చెప్పి.. కార్య‌క‌ర్త‌ల‌ను ఐక్యం చేయ‌డం.. ప్ర‌జ‌ల‌ను క‌లుసుకోవ‌డం వంటి కీల‌క‌మైన రాజ‌కీయాల దిశ‌గా అడుగులు వేస్తేనే.. పార్టీకి పున‌రుజ్జీవం అన‌డంలో సందేహం లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.
Tags:    

Similar News