లోకేష్ పదవికి కౌంట్ డౌన్...మంగళగిరి కురుణిస్తుందా...?

Update: 2023-01-05 23:30 GMT
నారా లోకేష్ ఆరేళ్ల క్రితం పెద్దల సభకు ఎన్నిక అయ్యారు. ఆయన ఎమ్మెల్సీ కావడం అనూహ్యంగా జరిగిన పరిణామం. అప్పటికి లోకేష్ వయసు ముప్పయి నాలుగేళ్ళు మాత్రమే. పెద్దల సభ అని పేరులోనే ఉంది. ఆ సభ ద్వారా ముక్కుపచ్చలారని యువ కిశోరం లోకేష్ రాజకీయ అరంగేట్రం చేయడాన్ని అంతా  విమర్శనాత్మకంగానే చూశారు. లోకేష్ ని నేరుగా ఎమ్మెల్యేగా గెలిపించి మంత్రిని చేసి ఉండాల్సింది అని కూడా అన్న వారు ఉన్నారు.

అప్పట్లో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఏ నియోజకవర్గం లోకేష్ కోరుకున్నా ఆయనకు చాన్స్ ఉండేది. అలా రాజమార్గం ద్వారా సింహ ద్వారం గుండా చట్టసభకు రావాల్సిన నారా వారి వారసుడు శాసనమండలిని ఎంచుకుని తొలి అడుగే తప్పటడుగు వేశారు అని అంతా అనుకున్నారు. కానీ లోకేష్ మండలిలో కొంతవరకూ తనదైన వాణిని బాణిని చూపించారు. 2019 ఎన్నికల్లో ఆయన మంగళగిరి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడారు. దాంతో ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు పనికిరాడు అన్న విమర్శలు వచ్చాయి.

అయితే గడచిన మూడేళ్ళుగా లోకేష్ జోరు పెంచారు. ఓడిన చోటనే గెలుస్తాను అంటూ ప్రత్యర్ధి పార్టీలకు సవాల్ చేశారు. మంగళగిరి మీద పూర్తి స్థాయిలో దృష్టిని పెట్టి గత మూడున్నరేళ్ళుగా అక్కడే పనిచేస్తూ వస్తున్న లోకేష్ ఈ నెల నుంచి పాదయాత్రకు సిద్ధపడుతున్నారు. దాంతో ఆయన ఎన్నికల వేళ దాకా మళ్ళీ మంగళగిరిలో కనిపించారు.

ఇంకో వైపు చూస్తే  ఆయన ఎమ్మెల్సీ పదవీకాలం కూడా మార్చి నెలతో పూర్తి అవుతోంది. లోకేష్ మాజీ అవుతున్నారు. చట్ట సభలలో లోకేష్ కానీ చంద్రబాబు కానీ లేని వాతావరణం ఇపుడు కనిపించబోతోంది. అయితే జనంలోనే ఉంటూ అక్కడే తేల్చుకుంటామని చంద్రబాబు లోకేష్ పంతం పట్టి వస్తున్నారు. చంద్రబాబు అయితే టీడీపీని గెలిపించి మళ్ళీ సీఎం గా అసెంబ్లీలో అడుగు పెడతాను అని అంటున్నారు.

లోకేష్ తెలుగుదేశం పార్టీ విజయం కోసం మంగళగిరిలో భారీ పాదయాత్రకు సమాయత్తం అవుతున్నారు. నాలుగు వందల రోజులు నాలుగు వేల కిలోమీటర్ల దూరంతో సాగే ఈ పాదయాత్ర లోకేష్ పొలిటికల్ కెరీర్ ని పూర్తిగా మలుపు తిప్పనుంది అని అంటున్నారు. లోకేష్ సైతం తన ఇమేజ్ ఈ దెబ్బకు మారుతుందని వైసీపీకి కలవరం చెలరేగేలా తన రాజకీయ విశ్వరూపం చూపిస్తాను అని అంటున్నారు.

పాదయాత్ర సూపర్ హిట్ అయితే లోకేష్ మంగళగిరిలో పర్యటించకున్నా ఆయన ఎమ్మెల్యేగా కచ్చితంగా నెగ్గుతారు. అలాగే పార్టీ కూడా పవర్ లోకి రావడం ఖాయం అని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే లోకేష్ మంగళగిరిలో గెలవకుండా వైసీపీ వ్యూహరచన చేస్తోంది. అక్కడ నుంచి బీసీ అభ్యర్ధిని బరిలోకి దించడం ద్వారా లోకేష్ విజయాన్ని అడ్డుకోవాలని చూస్తోంది. మరి మంగళగిరి జనం ఏమనుకుంటున్నారు. లోకేష్ ని ఈసారి ఎమ్మెల్యేగా చేస్తారా. ఆయనను అసెంబ్లీకి పంపిస్తారా అన్నది చూడాల్సి ఉంది.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News