కేసీఆర్‌ కు మంట‌పుట్టేలా 'కాళేశ్వ‌రం' షాక్

Update: 2017-10-06 02:33 GMT
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు ఊహించ‌ని షాక్ త‌గిలింది. ఆయ‌న స్వ‌ప్న‌మైన కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణానికి అభ్యంత‌రాలు వ్య‌క్తం చేస్తూ జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది. సింగ‌రేణి గుర్తింపు కార్మిక సంఘాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో భారీ విజ‌యాన్ని సాధించిన‌ప్ప‌టికీ.. కేసీఆర్‌కు ఆ సంతోషాన్ని మిగ‌ల్చ‌కుండా జాతీయ హ‌రిత ట్రైబ్యున‌ల్ ఇచ్చిన మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు చికాకు పెడ‌తాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకొని చేస్తున్న‌కాళేశ్వ‌రం ప్రాజెక్టు నిర్మాణ ప‌నుల్ని అపాలంటూ ట్రైబ్యున‌ల్ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు ఇచ్చింది.  ప‌ర్యావ‌ర‌ణ‌.. అట‌వీ అనుమ‌తులు పూర్తిస్థాయిలో వ‌చ్చే వ‌ర‌కూ ఎలాంటి నిర్మాణాలు చేప‌ట్ట‌కూడ‌ద‌ని వెల్ల‌డించింది.

చెట్లు కూల్చ‌టం.. బాంబులు పేల్చ‌టం.. ట‌న్నెల్ త‌వ్వ‌టం లాంటి ప‌నులు చేప‌ట్ట‌కూడ‌ద‌ని.. అన్ని ర‌కాల అనుమ‌తులు తీసుకున్న త‌ర్వాతే.. తామిచ్చిన ఉత్త‌ర్వుల్ని మార్చాల‌న్న అంశంపై త‌మ‌ను ఆశ్ర‌యించ‌వ‌చ్చ‌ని పేర్కొంది. ప‌నుల‌పై స్టే ఇస్తున్న ధ‌ర్మాస‌నం ఆదేశాల్ని మూడు రోజులు నిలిపివేయాలంటూ తెలంగాణ రాష్ట్ర స‌ర్కారు త‌ర‌ఫున కేసును వాదిస్తున్న న్యాయ‌వాది మాధ‌వి కోర‌గా.. అందుకు ధ‌ర్మాస‌నం అంగీక‌రించ‌లేదు.

ప్ర‌స్తుతం ఈ ప్రాజెక్టును హైద‌రాబాద్‌కు మంచినీరు ఇచ్చేందుకు వీలుగా ఈ ప్రాజెక్టును ఉప‌యోగించుకుంటామ‌ని పేర్కొన‌గా.. మూడు నెల‌లు  నిర్మాణం అపొచ్చు క‌దా అని ధ‌ర్మాస‌నం కోరింది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌నుల‌కు సంబంధించి అట‌వీ భూముల వినియోగంపై ప్ర‌భుత్వం స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో లోపాలు ఉన్నాయంటూ పిటిష‌న‌ర్ త‌ర‌ఫు న్యాయ‌వాది సంజ‌య్ వాద‌న‌లు వినిపిస్తూ.. మేడిగ‌డ్డ వ‌ద్ద నిర్మిస్తున్న గ్రావిటీ కెనాల్ పూర్తిగా రిజ‌ర్వు ఫారెస్ట్ ప‌రిధిలోకి వ‌స్తుంద‌న్నారు. ఈ అంశంపై ప్ర‌భుత్వం త‌ప్పుడు లెక్క‌లు చూపిస్తోంద‌న్నారు. ఇరు ప‌క్షాల వాద‌న‌లు విన్న ధ‌ర్మాస‌నం.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు పనుల్ని నిలిపివేస్తూ స్టే ఉత్త‌ర్వులు జారీ చేసింది. వ‌డివ‌డిగా కాళేశ్వ‌రం ప్రాజెక్టును పూర్తి చేయాల‌ని భావిస్తున్న సీఎం కేసీఆర్‌కు తాజా ఉత్త‌ర్వులు చిరాకు పుట్టించేవ‌న‌టంలో సందేహం లేదు.
Tags:    

Similar News