సెల్ఫ్‌గోల్ చేసుకున్న నిమ్మ‌గ‌డ్డ‌...అందుకే ఆయ‌న ఎంట్రీ?

Update: 2020-05-30 16:42 GMT
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మ‌ళ్లీ వార్త‌ల్లోకి ఎక్కింది. సీఈసీగా నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్‌ బాధ్య‌త‌లు మ‌ళ్లీ కీల‌క మ‌లుపులు తిరిగాయి. అమరావతిలో ఏపీ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్య‌లతో నిమ్మ‌గ‌డ్డ ప‌దవి చేప‌ట్ట‌డం స‌హా త‌దుప‌రి చ‌ర్య‌ల విష‌యంలో సెల్ప్‌గోల్ చేసుకున్నార‌నే భావ‌నను వ్య‌క్తం చేస్తోంది. నిమ్మ‌గ‌డ్డ తీరు అభ్యంత‌ర‌కంగా ఉంద‌ని, నిబంధ‌న‌ల‌కు విరుద్ద‌మ‌ని ఏపీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ నొక్కి వ‌క్కాణించ‌డం దీనికి తార్కాణంగా నిల‌స్తోంది.

హైకోర్టు తీర్పును నిమ్మ‌గ‌డ్డ ర‌మేష్ పొర‌పాటుగా అర్థం చేసుకున్నార‌ని, అతిగా స్పందించార‌ని ఏపీ అడ్వ‌కేట్ జ‌న‌ర‌ల్ పేర్కొన్నారు. ``హైకోర్టు జడ్జిమెంట్ కాపీ శుక్ర‌వారం మధ్యాహ్నం 3.30 గంటలకు  వచ్చింది. ఆ వెంట‌నే నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాష్ట్ర, జిల్లా అధికారులకు ఒక సర్కులర్ జారీ చేశారు. రాష్ట్ర ఎన్నికల అధికారిగా తిరిగి బాధ్యతలు చేపట్టినట్లుగా నిమ్మగడ్డ రమేష్ కుమారే ప్రకటించుకున్నారు. విజయవాడ కార్యాలయం నుంచి సర్క్యూలర్ విడుదల చేసి.. హైదరాబాద్‌లోని తన ఇంటికి వాహనాలు పంపించాలన్నారు. ఎస్ఈసీగా కొనసాగమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కు హైకోర్టు నేరుగా ఎక్కడా చెప్పలేదు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం తనంతట తానే బాధ్యతలు స్వీకరించినట్లుగా సర్క్యూలర్ విడుదల చేశారు `` అని  త‌ప్పుప‌ట్టారు.

హైకోర్టు తీర్పు విష‌యంలో సుప్రీంకోర్టుకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలని ఇప్పటికే హైకోర్టులో ఒక పిటిషన్ వేశామ‌ని ఏపీ ఏజీ తెలిపారు. అప్పటివరకు హైకోర్టు తీర్పుపై స్టే ఇవ్వాలని కూడా కోరామ‌ని తెలిపారు. ``రాష్ట్ర ఎన్నికల అధికారిని నియమించే అధికారం రాష్ట్రానికి లేదు అంటే.. నిమ్మగడ్డ రమేష్ కుమార్‌కు కూడా ఈ నిబంధనే వర్తిస్తుంది. అలాంటప్పుడు నిమ్మగడ్డ రమేష్ కుమార్‌ను ప్రభుత్వం ఎలా నియమిస్తుంది? నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను కూడా అప్పటి సీఎం చంద్రబాబు సలహా మేరకే నియమించారు. గవర్నర్ నిర్ణయంలో మంత్రి మండలి సలహా అవసరం లేదంటే.. అప్పటి సీఎం చంద్రబాబు ఇచ్చిన సలహా కూడా చెల్లదు. అంటే...నిమ్మగడ్డ రమేష్ కుమార్ నియామకం కూడా చెల్లదు`` అని ఆయ‌న పేర్కొన్నారు.  

హైకోర్టు తీర్పులో కాలవ్యవధి స్పష్టంగా చెప్పకుంటే.. రెండు నెలల కాలవ్యవధి ఉంటుందని ఏపీ ఏజీ వెల్ల‌డించారు. ``హైకోర్టు తీర్పు ప్రకారం నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్వీయ నియామకం చేసుకునే అధికారం లేదు. ఎస్ఈసీ స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న ప్రభాకర్‌ను రేపటిలోగా రాజీనామా చేయమని నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశించారు. ఈ విషయం ప్రభాకర్ నాకు ఫోన్ చేసి చెప్పారు. నాకు కొంత సమయం కావాలని ప్రభాకర్ నిమ్మగడ్డను కోరారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మాత్రం రేపటిలోగా రాజీనామా చేయమని ఆదేశించారు. ఇప్పటికే స్టే ఇవ్వాలని ప్రభుత్వం హైకోర్టును కోరింది. ఎస్ఈసీ అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్తున్నాం. సాధారణంగా ప్రభుత్వ న్యాయనిపుణులు ఎప్పుడూ మీడియా ముందుకు రారు. కానీ ఇది రాజ్యాంగ అంశాలు  హైకోర్టు తీర్పుతో కూడినందున మీడియా ముందుకు రావాల్సి వచ్చింది`` అని ఏపీ ఏజీ వివ‌రించారు.
Tags:    

Similar News