నిర్భయ దోషులకు డెత్ వారెంట్.. ఇప్పుడేం జరుగుతోంది?

Update: 2020-01-08 04:30 GMT
ఏడేళ్ల క్రితం జరిగిన నిర్భయ దారుణానికి బాధ్యులైన దోషులకు విధించిన ఉరిశిక్ష ను ఎప్పుడు అమలు చేయాలన్న అంశంపై తేదీ ఖరారు కావటం తెలిసిందే. సుదీర్ఘ న్యాయపోరాటం తర్వాత దోషులకు శిక్షకు ముహుర్తాన్ని డిసై్ చేశారు. తిహార్ జైల్లోని నెంబరు 3లో ఉరిశిక్షను అమలు చేయనున్నారు.

కోర్టు నుంచి ఉత్తర్వులు వెలువడిన కొన్ని గంటల వ్యవధి లోనే.. ఉరిశిక్ష అమలు కోసం చేపట్టాల్సిన పనుల్ని ముమ్మరం చేశారు. ఉరి తీసేందుకు అవసరమైన తలారీ కోసం ఉత్తరప్రదేశ్ లోని మీరఠ్ జైలు అధికారులకు కబురు పంపారు. తీహార్ జైలుకు ఉరి తీసే తలారీ లేకపోవటంతో ఇలాంటి పరిస్థితి నెలకొంది.

అంతేకాదు నిర్భయ దోషులు నలుగురిని ఉరి తీసేందుకు అవసరమైన ఉరితాళ్లను సైతం తయారు చేయటం షురూ చేశారు. మిషన్ తో కాకుండా.. చేతులతో తయారు చేసే ఉరి తాళ్లను బక్సర్ జైలు నుంచి తెప్పించనున్నారు. ఈ ఉరి తాళ్లను వినియోగించటానికి కొద్ది రోజులు ముందు మాత్రమే తయారీ షురూ చేస్తారు. ఎందుకంటే.. ఈ తాళ్లను ముందుగా చేసి ఉంచితే.. తాళ్లకు ఉండాల్సిన పటుత్వం ఉండదు. అందుకే.. ఉరిశిక్ష అమలు తేదీ ఖరారు అయ్యాక వీటి తయారీని షురూ చేస్తుంటారు.

దేశంలో చివరి సారి ఉరి శిక్షను అమలు చేసింది అఫ్జల్ గురు ఉదంతంలోనే. అప్పట్లోనూ బక్సర్ తాళ్లనే వినియోగించారు. తాజాగా నిర్భయ నలుగురు దోషులకు అవసరమైన తాళ్ల తయారీ షురూ చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. పూర్తిగా హ్యాండ్ మేడ్ అయిన ఈ తాళ్లను తయారు చేయటానికి మూడు రోజులు పడుతుంది. దాదాపు ఆరుగురు ఒక్కో తాడును తయారు చేయటానికి సమయం తీసుకుంటారు.

ఉక్కు.. ఇత్తడి ధరల ఆధారంగా ఈ ఉరితాడు ధరను ఫిక్స్ చేస్తారు. ప్రస్తుతం ఒక్కో ఉరితాడు రూ.1725గా నిర్ణయించారు. 7వేల దారంపోగులతో ఒక తంతువు తయారు చేస్తారు. ఇలాంటివి 152 తంతువులు ఉపయోగించి.. అవసరమైన కొలతలతో ఉరిశిక్షను అమలు చేయటానికి అవసరమైన తాళ్లను సిద్ధం చేస్తారు. కోర్టు ఆదేశాలు వెలవడిన కొద్ది గంటల్లో నిర్భయ దోషులకు ఉరిశిక్షను అమలు చేయటానికి అవసరమైన అన్ని పనులు షురూ అయినట్లుగా చెబుతున్నారు. మరోవైపు నిర్భయ దోషులకు ఉరి తీసే డేట్ ను ప్రకటించిన కోర్టు ఆదేశాలపై దిశ తండ్రి సంతోషాన్ని వ్యక్తం చేశారు.


Tags:    

Similar News