బరాబర్ మా ఫోటో ఉండాల్సిందే... తేల్చేసిన ఫైర్ బ్రాండ్

Update: 2022-09-04 04:35 GMT
మాటలు అనేస్తున్నా.. విమర్శలు చేసేస్తున్నా.. ఆరోపణలు గుప్పిస్తున్నా.. వేచి చూద్దామన్న మాటకు పుల్ స్టాప్ పెట్టేసి.. ఎప్పటి లెక్కలు అప్పుడే తేల్చేసే తీరును ప్రదర్శిస్తోంది తెలంగాణ బీజేపీ. వారికి దన్నుగా బీజేపీ జాతీయ నాయకత్వం.. ఎప్పుడైనా.. ఎలాంటి సాయమైనా అవసరమైతే సర్వం సిద్ధమన్నట్లుగా వారి తీరు ఉందని చెప్పాలి. పక్కా ప్రణాళిక ద్వారా గులాబీ బాస్ లో గుబులు పుట్టించేలా కమలనాథుల తీరు ఉంది.

తాజాగా మూడు రోజుల తెలంగాణ పర్యటనను శనివారం సాయంత్రంతో ముగించుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  తెలంగాణ బీజేపీ ప్రధాన కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తమపై టీఆర్ఎస్ మంత్రులు చేస్తున్న విమర్శల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేశారు. సీఎం కేసీఆర్ తీరును.. ఆయన ప్రభుత్వ వైఖరిపైనా సీరియస్ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని రేషన్ షాపుల్లో ముఖ్యమంత్రి ఫోటోతో పాటు ప్రధానమంత్రి మోడీ ఫోటోను పెట్టాలన్న వాదనను తెర మీదకు తీసుకురావటమే కాదు.. కామారెడ్డి కలెక్టర్ పై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటం తెలిసిందే.

దీనిపై అధికార టీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేయటం తెలిసిందే. తెలంగాణ రాష్ట్ర మంత్రి కేటీఆర్ సైతం ఈ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటివేళ.. నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. కేటీఆర్ క్వశ్చన్లకు సమాధానాలు చెప్పటమే కాదు.. తమ వాదనను బలంగా వినిపించారు. కేంద్రం నుంచి డబ్బులు తీసుకొని ఒక్కరి పేరే ఎలా పెట్టుకుంటారని ప్రశ్నిస్తున్నారు.

కేంద్రం వాటా ఇస్తున్న వాటిలో తమ ఫోటో ఉండాల్సిందేనని ఖరాఖండిగా తేల్చేశారు. ''ప్రతి పథకంలోనూ కేంద్రానికి.. రాష్ట్రానికి చెరొక వాటా ఉంటుంది. కేంద్రప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకొని ఒక్కరి పేరే ఎలా పెట్టుకుంటారు. కేంద్రం వాటి ఇస్తున్న వాటిలో మా ఫోటో ఉండాల్సిందే'' అంటూ స్పష్టం చేయటం గమనార్హం. ఈ వ్యవహారంపై రాష్ట్ర మంత్రులు హరీశ్ రావు వ్యంగ్య వ్యాఖ్యలు.. మరో మంత్రి కేటీఆర్ ట్వీట్ పైనా మండిపడ్డారు నిర్మలా సీతారామన్.

పన్నుల రూపంలో తామే అధికంగా కేంద్రానికి ఇస్తున్నామని.. కేంద్రం తమను నిర్లక్ష్యం చేస్తున్న వ్యాఖ్యల్ని ఖండించారు. 'తెలంగాణకు కేంద్రం ఏమీ చేయట్లేదనటం అవాస్తవం. ఆర్థిక సంఘం సిఫార్సుల ప్రకారమే రాష్ట్రాలకు నిధులు ఉంటాయి. ఇష్టం ఉన్నట్లు రాష్ట్రాలకు ఎక్కువ నిధులు ఇవ్వటం కుదరదు. కేంద్రం వసూలు చేసే సెస్సులు కూడా రాష్ట్రాలకే వెళతాయి. వసూలు చేసి సెస్సుల కంటే రాష్ట్రాలకే ఎక్కువ ఇచ్చాం. ఇచ్చిన ప్రతి పైసా ను క్షేత్రస్థాయిలో ప్రజలకు తెలియజేస్తాం'' అని స్పష్టం చేశారు. బడ్జెటేతర అప్పులు ఏ రాష్ట్రానికైనా నష్టమేనన్న ఆమె.. తెలంగాణలో పుట్టబోయే బిడ్డపై కూడా రూ.1.25 లక్ష అప్పు ఉందన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టకు సరైన డీపీఆర్ లేదని.. రూ.1.40 లక్షల కోట్లు ఖర్చు చేయటంపై అభ్యంతరం వ్యక్తం చేయటం గమనార్హం.
Tags:    

Similar News