చేదు బడ్జెట్ ఇచ్చిన నిర్మలమ్మకు చక్కరొచ్చిందే

Update: 2020-02-01 15:30 GMT
కేంద్ర బడ్జెట్ ను పార్లమెంటులో ప్రవేశపెడుతున్న సందర్భంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పరిస్థితి నిజంగానే ఆసక్తికరంగా మారింది. కేంద్ర బడ్జెట్ పూర్తి పాఠాన్ని చదవకుండానే... ఇంకో రెండు పేజీలు మిగిలి ఉండగానే... నిర్మలమ్మ బడ్జెట్ ప్రసంగాన్ని అర్ధాంతరంగా ముగించారు. బడ్జెట్ ప్రసంగం అంటే... సుదీర్ఘ ప్రసంగమే కదా. కేంద్ర ప్రభుత్వం ఓ ఆర్థిక సంవత్సరంలో చేసే ఖర్చుతో పాటు రాబట్టే ఆదాయాన్ని వివరించడంతో పాటుగా నిధులను ఏఏ శాఖకు ఎంతెంత మేర కేటాయిస్తున్నామన్న విషయంతో పాటుగా అందుకు తగ్గ కారణాలను కూడా సమగ్రంగా వివరించక తప్పదు. ఈ క్రమంలోనే బడ్జెట్ ప్రసంగమంటే చాలా సుదీర్ఘంగా సాగుతుంది. అయితే కేంద్ర ఆర్థిక శాఖకు తొలి మహిళా మంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నిర్మలమ్మ.. తొలి బడ్ఝెట్ ను ఎలాగోలా పూర్తి చేశారు గానీ.. రెండో బడ్జెట్ కు వచ్చేసరికి చతికిలబడిపోయారు. శనివారం పార్లమెంటులో బడ్జెట్ ప్రసంగాన్ని చదువుతున్న నిర్మలమ్మ... రెండున్నర గంటల పాటు తన బడ్జెట్ ప్రసంగాన్ని బాగానే కొనసాగించారు గానీ... ఇంకో రెండు పేజీలు ఉండగానే... అర్థాంతరంగా బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. ఇందుకు నిర్మలమ్మ శరీరంలో పెరిగిపోయిన షుగర్ లెవెల్సే కారణమని తెలిసింది.

ఎన్డీఏ-2 కేబినెట్ లో ఏకంగా ఆర్థిక శాఖ పగ్గాలను దక్కించుకున్న నిర్మలా సీతారామన్... నిజంగానే దేశం దృష్టిని ఆకర్షించారు. ఈ శాఖ బాధ్యతలను చేపట్టిన తొలి మహిళా నేతగా కూడా నిర్మలమ్మ రికార్డులకెక్కారు. నిర్మలమ్మలో ఉన్న సత్తాను గుర్తించిన కారణంగానే ప్రధాని మోదీ ఆమెకు రక్షణ శాఖ నుంచి ఆర్థిక శాఖకు ప్రమోషన్ ఇచ్చారని కూడా చెప్పాలి. మోదీ ఆశించిన మేరకు రాణించే విషయంలో నిర్మలమ్మ కూడా సత్తా చాటుతున్నా... ఇటీవలి కాలంలో జీడీపీ క్రమంగా తగ్గిపోతున్న వైనంపై పెద్ద ఎత్తున కథనాలు వస్తున్న సంగతి తెలిసిందే. నిర్మలమ్మ హయాంలో దేశ ప్రగతి పడకేసిందన్న వాదనలు కూడా ఆసక్తి రేకెత్తించాయి.

ఈ తరహా వాదనలు ఎలా ఉన్నా... ఏ శాఖ పగ్గాలు అప్పగించినా... అందుకు తగ్గట్టుగా మెరుగ్గా రాణించే విషయంలో నిర్మలా సీతారామన్ ఏ ఒక్కరికీ తీసిపోని నేతగానే చెప్పాలి. అయితే ప్రస్తుత బడ్జెట్ ప్రసంగం సందర్భంగా షుగర్ లెవెల్స్ పెరిగిన కారణంగా బడ్జెట్ పూర్తి పాఠాన్ని చదవకుండానే... రెండు పేజీలు మిగిలుండగానే నిర్మల తన ప్రసంగాన్ని ముగించడంపై ఆసక్తికర పంచ్ లు పడుతున్నాయి. దేశ ప్రజలకు చేదు అనిపించే బడ్జెట్ ను ప్రవేశపెట్టిన నిర్మలమ్మకు చక్కెర శాతం పెరగకుడా ఉంటుందా? అని కొందరు అంటుంటే.. మరికొందరేమో... అంతే మరి దేశ ప్రజలకు చేదు బడ్జెట్ ఇస్తే.. నిర్మలమ్మకైనా, ఇంకెవరికైనా చక్కెర వస్తుందంతే అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తంగా బడ్జెట్ పూర్తి పాఠం చదవలేకపోయిన నిర్మలమ్మపై సెటైర్లు పడిపోతున్నాయి.


Tags:    

Similar News